యూనిట్ - 3
ల్యాప్ జాయింట్ ను ఏర్పరుచుట
రెండు కర్రముక్కలను ఒకే దిశలో కలుపుట ద్వారా కర్రవస్తువు
పొడవును పెంచుటకు లేదా వాటిని రెండు దిశలలో కలుపుకొనుటకు
ల్యాప్ జాయింట్ ను ఉపయోగించవచ్చును. ( పటము 6.22, 6.23 )
1. ముందుగా సమాన మందముగల రెండుకర్రముక్కల ప్రక్క ( కొన )
భాగములను చదునుపరచాలి.
2. రెండు కర్రముక్కలను ఒకదాని ప్రక్కగా మరియొకటి పటము 6.24
లో చూపిన విధముగా అమర్చాలి. అయితే ఈ విధముగా
అమర్చినపుడు మొదటి కర్రముక్క ముఖభాగమును మరియు రెండవ
కర్రముక్క క్రిందతలము పైకి వుండునట్లుగా చూడాలి.
3. చదునుపరచబడిన కొనభాగమునుండి జాయింట్ కు కావలసిన
వెడల్పు స్టీలు రూలు ద్వారా కొలిచి మార్కింగ్ చాకు ద్వారా
గుర్తించాలి. బిందువు A ). ఈ విధముగా రెండు కర్రముక్కల పైన
చేయాలి.
4. ట్రైస్క్వేర్ ను ఉపయోగిస్తూ రెండు కర్రముక్కలపైన AB రేఖను
మార్కింగ్ చాకు లేది పెన్సిల్ తో గుర్తించాలి.
5. కర్రముక్కలరెండువైపుల గల అంచులపై A మరియు B
బిందువుల నుండి నిలువుగా క్రిందవైపు గీతలుగీయాలి. ఈ రేఖలు
కర్రముక్కల మందమునకు సగము మాత్రమే వుండాలి.
6. కర్రముక్కల మందములో సగము వుండునట్లుగా మార్కింగ్ గేజిని
అమర్చి కర్రముక్కల ముఖభాగము ఆధారముగా రెండుప్రక్క
అంచులలో మరియు చదునుపరచబడిన చివర ( కొన ) భాగములో
రేఖలను పెన్సిల్ తో గుర్తించాలి. దీనితో కర్రముక్కలనుండి
తొలగించవలసిన కర్రభాగము గుర్తింపబడుతుంది.
7. రెండు కర్రముక్కలలో ఒకదాని తీసుకొని దాని చదును
పరచబడిన కొనభాగము పైకి వుండునట్లుగా దానిని వైస్ తో
బిగించాలి. పిదప బ్యాక్ ఱంపమునుపయోగించి తొలగించవలసిన
భాగమువైపు వుండునట్లుగా ఱంపమును అమర్చి గుర్తింపబడిన
రేఖవెంబడి కర్రను కోయాలి.
8. కర్రముక్కను వైస్ నుండి తొలగించాలి, దానిని వర్కబెంచిపై
పెట్టుకొని, బ్యాక్ ఱంపముతో కర్రమందములో సగమునకు
గుర్తింపబడిన దిశలో కర్రను నిలువుగా కోయాలి. అదేవిధముగా
రెండవ కర్రముక్కనుకూడా కోయాలి. గుర్తించిన రేఖలమీద
ఱంపముతో ఖచ్చితముగా కోసినయెడల రెండు కర్రముక్కలను
కలిసినపుడు అవి సరిగా అమర్చబడి జాయింట్ బిగుతుగా
యేర్పడుతుంది. లేని యెడల ఉలిని ఉపయోగిస్తు తగిన
మందముతో కోయబడిన కర్రభాగమునుండి తొలగింపవలసిన కర్రను
తీసివేయాలి.
9. పటము 6.9లో చూపబడిన క్రాస్ ల్యాప్ జాయింట్ ను
ఏర్పరుచటకు ఇదే పద్ధతిని అవలంభించాలి.
10. పైన తెలిపిన విధముగా యేర్పరచబడు ల్యాప్ జాయింట్ కు
తగిన పటిష్టతను కలిగించుటకుగాను జిగురు, స్ర్కూలు, మేకుల
ద్వారా రెండు కర్రముక్కలను బిగింపవచ్చును.
గమనించవలసిన విషయములు :—
1. రండు కర్రముక్కలు ఒకదానిలో మరియొకటి యేవిధమైన వదులు
లేకుండా బిగుతుగా అమర్చబడాలి.
2. అయితే జాయింట్ కావలసినదానికన్న హెచ్చు బిగుతుగా
వుండరాదు. చేతులద్వారా శక్తినుపయోగిస్తూ వాటిని కలుపవలెను.
అంతేకాని ఎక్కువ బలము నుపయోగించి జాయింట్ ను
యేర్పరచరాదు. వదులుగా లేదా ఎక్కువ బిగుతుగా వున్న
జాయింట్లు పనితనములోని లోపములను తెలుపుతవి.
మీటర్ జాయింట్ న ఏర్పరుచుట :-
1. ముందుగా మీటర్ జాయింట్ తో కలుపవలసిన కర్రముక్కల
పొడవున సరిగ్గా నిర్ణయించాలి.
ఉదాహరణకు పటములకు ఫ్రేములను తయారుచేయుటకు
యేర్పరచెడి మీటరు జాయింటునకు కర్రపొడవును క్రింది విధముగా
నిర్ణయించాలి.
కర్రపొడవు = పటము యొక్కపొడవు + 2x నిలువు
కర్రయొక్కవెడల్పు + 2x అడ్డు కర్ర యొక్క వెడల్పు .
2. పిదప కావలసిన కోణములో కర్రముక్కల కొనభాగములను
ఏటవాలుగా ఱంపముతో కోయాలి. మీటరు జాయింటు ఎక్కువ 45॰
కోణములో చేయబడుతుంది. తగిన కోణములో సరిగ్గా కోయుటకుగాను '
మీటర్ బాక్స్ ' అనబడు పనిముట్టు వుపయోగిస్తుంది. అయితే
సాధారణ పనులకుగాను ' మీటర్ బాక్స్ ' ను వుపయోగించనవసరము
లేకుండానే పటము 6.26 లో చూపీనట్లుగా కోయవచ్చును.
ఇందుకుగాను ముందుగా పెన్సిల్ తో కర్రముక్క వెడల్పును
గుర్తించునట్లుగా కోయవచ్చును. ఇందుకుగాను ముందుగా పెన్సిల్తో
కర్రముక్క వెడల్పును గుర్తించినట్లు ఒక రేఖను అడ్డముగా
గీయాలి. పిదప దాని వెడల్పును డివైడర్ తో కొలిచి, ఆ పొడవును
కర్రముక్క పొడవు దిశలో ఒకవైపు అంచుపై గుర్తించి, అక్కడ
వెడల్పు దిశలో అడ్డముగా రెండవరేఖను గీయాలి. ఈ రేఖల
ద్వారా యేర్పడిన చదరపు భాగము వ్యతిరేఖ మూలలను కలిపెడి
కర్ణమును పెన్సిల్ తో గుర్తించాలి. ఈ కర్ణము వెంబడి ఱంపముతో
కోసినయెడల 45॰ కోణముతో మీటర్ జాయింట్ కు కావలసిన
కొనభాగమును యేర్పడుతుంది.
3. పైన తెలిపిన విధముగా రెండు కర్రముక్కలపై ఏటవిలుగా
కోయబడిన కొనభాగములపై జిగురును అంటించి పటము 6.24 లో
చూపబడిన విధముగా ఆ కొనభాగములను ఒకదానిని మరియొకటి
తగులునట్లుగా అమర్చి నొక్కిపెట్టి జాయింట్ సరిగా యేర్పడునట్లు
చూడాలి.
4. పైన తెలిపినట్లు యేర్పరచబడిన మీటర్ జాయింట్ ను
పటిష్టపరచుటకు గాను మేకులు, స్ర్కూలు, డవెల్ పిన్నులు లేదా
చిన్న కర్రపేడును వుపయోగించవచ్చును. పటము 6.28 లో
కర్రపేడుద్వారా పటిష్టపరచబడిన విధానము చూపబడినది.
డవెల్ పిన్నుల నుపయోగించునపుడు అవి కోయబడిన
కొనభాగములకు లంబదిశలో వుండాలి.
గమనించవలసిన విషయములు :
1. కలుపబడిన రెండు కొనభాగముల మధ్య యేవిధమైన ఖాళీ
స్థలము వుండరాదు.
2. కలుపబడిన రెండు కర్రముక్కల వెడల్పు దిశలో గల
ఉపరితలములు సమముగా వుండాలి. లేనియెడల ప్లేన్ ను
ఉపయోగించి సమపరచాలి.
3. మూలలను కలిపినపుడు లోపలి మరియు వెలుపలి మూలలు
సరిగ్గా కలుపబడాలి.
6.7 మోర్ టైస్ మరియు టెనన్ జాయింటు :
( A ) టెనన్ ను యేర్పరుచుట :-
1. ముందుగా రెండు కర్రముక్కల మందమును స్టీలురూలుతో
కొలవవలెను. రెండింటిలో తక్కువ మందము కొలత ( t )
ఆధారముగా టెనన్ కొలతలు క్రిందివిధంగా నిర్ణయించాలి.
టెనన్ మందము T = ( 1/3 నుండి 1/2 ) x t
టెనన్ వెడల్పు W< 6 x t
( అనగా టెనన్ వెడల్పు 6t కన్నా తక్కువవుండాలి ).
ఎక్కువ టెనన్ లు కలిగిన జాయింట్ యందు మోర్ టైస్ ( చీలికల )
మధ్యగల కర్రవెడల్పు = t
2. రెండు కర్రముక్కలయందు జాయింట్ యేర్పరచవలసిన
కొనభాగములను నిర్ణయించి ఆవైపు పైన తెలిపిన కొలతలను
గుర్తించాలి.
3. పటము 6.30 లో సూచించినట్లు టెనన్ పొడవు ( L ), రెండవ
కర్రముక్క కొలతల ఆధారముగా నిర్ణయించాలి.
4. రెండుప్రక్క అంచులనుండి వదలవలసిన మూలభాగము ( S )
వెడల్పు ఆ కర్రముక్కపై టెనన్ యేర్పరచెడి స్థితిని బట్టి
వుంటుంది. సాధారణంగా ఇది టెనన్ మందమునకు సమానముగా
వుంటుంది. లేదా 12 నుండి 15 మి.మీ. వరకు వుంటుంది.
అనగా S = T లేదా S = 12 నుండి 15 మి.మీ.
5. పైన పేర్కొనబడిన కొలతలను మార్కింగ్ గేజి లేదా మోర్ టైస్
గేజి నుపయోగించి కర్రముక్క కొనభాగము వైపుగుర్తించాలి.
6. టెనన్ కోయుటకు ముందుగా కర్రముక్కను బెంచివైస్ లో కొద్దిగా
ఏటవాలుగా అమర్చవలెను. బ్యాక్ సా ఱంపమును వుపయోగిస్తూ
టెనన్ మందమును గుర్తించు రేఖలవెంబడి కర్రను కోయవలెను.
కోయునపుడు ఱంపము గుర్తించబడిన రేఖనుండి తొలగించవలసిన
కర్రవైపు వుండాలి.
7. పిదప టెనన్ వెడల్పు సూచించు రేఖలవెంబడి కోయవలెను.
8. కర్రవస్తువు ముఖతలము మరియు క్రిందివైపు ఉపరితలముపై
టెనన్ పొడవును సూచించు అడ్డు రేఖలవెంబడి కర్ర
మూలభాగములను కోయవలెను. అనగా టెనన్ వెడల్పును
వదిలివేసి రెండుప్రక్కల అంచులనుండి కర్రను కోయవలెను. ఈ
విధముగా ఏర్పరచవలసిన టెనన్ నాలుగు మూలలనుండి కర్రను
కోసి తొలగించవలెను.
9. టెనన్ ముందుప్రక్కన నాలుగు అంచుల వెంబడి కొద్దిగా
ఏటవాలుగా వుండునట్లు తలములను ఏర్పరచాలి. దీనిని
' ఛాంఫరింగ్ ' ( Chamfering ) అంటారు. దీనివలన టెనన్ ను మోర్ టైస్
లో సులభముగా అమర్చగలుగుటయే కాకుండా, ఈ విధముగా
నాలుగు ప్రక్కల కర్ర తొలగించుటచే మోర్ టైస్ లో టెనన్ చుట్టు
యేర్పడిన కొద్ది ఖాళీస్థలములో జిగురు పదార్ధమును పెట్టి జాయింట్
ను దృఢపరచవచ్చును. ఛాంఫరింగ్ చేయబడిన టెనన్ ను పటము
6.32 లో చూడవచ్చును.
( B )మోర్ టైస్ నిర్శాణము :—
1. )మోర్ టైస్ ను యేర్పరుచటకుగాను ముందుగా కర్రవస్తువుపై
చేయవలసిన చీలిక ( మోర్ టైస్ )కొలతలను సరిగా గుర్తించాలి.
ఎక్కువ సంఖ్యలో మోర్ టైస్ లను చేయునపుడు, అన్ని
కర్రముక్కలను ప్రక్క ప్రక్కగా అమర్చుకొని, ఒకేసారి అన్ని మోర్
టైస్ ల కొలతలు గుర్తించాలి. అన్ని కొలతలు కూడా కర్రముక్క
ముఖభాగమునుండి కొలచి, గుర్తించాలి.
మోర్ టైస్ కొలతలను క్రింద సూచింపబడినవి:—
( a ) మోర్ టైస్ పొడవు L1= టెనెన్ వెడల్పు W
( b ) మోర్ టైస్ పొడవు W1= టెనెన్ మందముT
( c ) మోర్ టైస్ యేర్పరుచుటకుగాను కర్రముక్క ప్రక్క భాగమునుండి
వదల వలసిన మూలభాగము, టెనెన్ కు ప్రక్కగా వదిలిన
మూలభాగము (s) నకు సమానముగా వుండాలి.
ట్రైస్క్వేర్ , మార్కింగ్ చాకు ద్వారా మోర్ టైస్ పొడవును
ముందుగా గుర్తించాలి. టెనెన్ వెడల్పునకు సమానముగా
వుండునట్లు మార్కింగ్ గేజి ( లేదా మోర్ టైస్ గేజి )ని అమర్చుకొని
దాని ద్వారా మోర్ టైస్ పొడవును గుర్తించాలి. మోర్ టైస్
వెడల్పును కూడా మార్కింగ్ గేజి ద్వారా గుర్తించాలి.
2. మోర్ టైస్ వెడల్పు ( W1 )నకు 2 మి.మీ. తక్కువ సైజుగల
బోరింగు బిట్ ను బిట్ బ్రేస్ లో అమర్చి కొలతలచే గుర్తింపబడిన
మోర్ టైస్ యందు ప్రక్కప్రక్కగా యుండునట్లు రంధ్రములను
చేయాలి. ముందుగా రెండు ప్రక్కల రంధ్రములను చేసి పిదప
మధ్యగల రంధ్రమును చేసి కర్రను తొలగించాలి.
3. పిదప తగిన వెడల్పుగల పదునైన అంచులను కలిగిన
ఉలిద్వారా రంధ్రములు చేయగా మిగిలిన కర్రను గుర్తించబడిన
రేఖల మధ్య నుండి తొలగించి, తద్వారా యేర్పడిన మోర్ టైస్
లోపలి ముఖ తలములు సమపరచాలి. ఈ పని చేయునపుడు
మోర్ టైస్ కొలతలను ( ముఖ్యంగా వెడల్పును )
గుర్తించు రేఖలను దాటిపోరాదు.
4. బోరింగు బిట్ తో రంధ్రములు చేయకుండా మోర్ టైస్ ఉలితో
నేరుగా మోర్ టైస్ ను ఏర్పరచవచ్చును. మోర్ టైస్ ఉలి వెడల్పు
చేయవలసిన చీలిక వెడల్పుకన్నా సుమారు 2మి.మీ. తక్కువ
వుండాలి. ముందుగా మధ్య భాగమునుండి ప్రారంభించి రెండు
ప్రక్క భాగములకు సాగుచు కర్రను తొలగించాలి.
జాయింటును కలుపునపుడు గమనించవలసిన విషయములు :
1. మోర్ టైస్ లో టెనన్ ను దూర్చి జాయింటును ఏర్పరచునపుడు
జాయింట్ ఎక్కువ బిగువుగా లేదా వదులుగా వుండరాదు. టెనన్
ను ఎక్కువ బలమునుపయోగించి మోర్ టైస్ లో దూర్చరాదు.
దీనివలన రంధ్రము చుట్టువున్న కర్రయందు పగుళ్లు
యేర్పడవచ్చును. ఎక్కువ వదులుగాయున్న జాయింట్ పనికిరాదు.
2. టెనన్ యందు దాని చుట్టు కర్రతొలగించగా యేర్పడిన
మూలభాగములు చదునుగా వుండాలి. చదునుగాలేని కర్రమూలలను
పదునైన ఉలి ద్వారా సమపరచాలి.
6.8 డవ్ టెయిల్ జాయింట్ ను యేర్పరుచుట :
1. ముందుగా డవ్ టెయిల్ జాయింట్ వివిధ భాగములను గురించి
సరిగా తెలుసుకొనాలి. పటములో యివి సూచింపబడినవి.
2. డవ్ టెయిల్ పిన్నులు, ' టెయిల్ ' భాగముకన్నా తక్కువ సైజులో
గానీ లేదా అదే సైజులో యేర్పరుస్తారు. అయితే టెయిల్ కన్నా
పిన్నులు ఎక్కువ వెడల్పును కలిగియున్నచో జాయింట్ పటిష్టత
హెచ్చుతుంది.
3. పిన్నులను యేర్పరుచుటకుగాను కొలతలను క్రింది విధముగా
గుర్తించాలి.
కర్రముక్క మందము = t
పిన్ను అడుగు భాగపు వెడల్పు W =3/4 x t
ప్రక్కప్రక్కగా యున్న రెండుపిన్నుల మధ్యబిందువుల దూరము = 2
W లేదా 3 W
వెలుపలివైపు పిన్నులు ( అనగా రెండుచివర వైపుల గల పిన్నులు )
మధ్యలో గల పిన్నుల వెడల్పు కన్న 3 నుండి 4 మి.మీ. ఎక్కువ
వెడల్పును కలిగియుండాలి.
4. రెండు కర్రముక్కల యందు కలుపవలసిన కొనభాగములను
నిర్ణయించి వాటిని చదునుపరచాలి. వాటిలో ఒకదాని మందమును
కొలచి, ఆ దూరమును రెండవ కర్రముక్క యందు చదును
పరచబడిన కొనభాగము నుండి గుర్తించాలి.
ఈ విధముగా గుర్తింపబడిన బిందువునుండి కర్రముక్క నాలుగు
తలములయందు ( అనగా చుట్టు ) మార్కింగ్ చాకు లేదా పెన్సల్ తో
రేఖలను గీసి గుర్తించాలి.
5. జాయింట్ కు యేర్పరచవలసిన పిన్నును మరియు చీలికల
సంఖ్యను సరిగా నిర్ణయించాలి. ఇందుకుగాను కర్రముక్కల
మందమును బట్టి పిన్ను వెడల్పు , పిన్నుల మధ్యదూరము
మొదలగునవి పైన సూచింపబడిన కొలతల ఆధారముగా
నిర్ణయించాలి.
ఉదాహరణకు, కర్రముక్క వెడల్పు 160 మి.మీ. మరియు మందము 20
మి.మీ. అనుకొందుము. కాబట్టి , పిన్నువెడల్పు W= 3/4 x 20 = 15 మి.మీ.
పిన్నులమధ్యదూరము = 2.5 W
=2.5x15 మి.మీ.
=37.5 మి.మీ.
~ 40 మి.మీ.
ఏర్పరచవలసిన పిన్నుల సంఖ్య =కర్రముక్క వెడల్పు / పిన్నుల
మధ్యదూరము
= 160/40 = 4 పిన్నులు
అయితే రెండు చివరలలో పిన్నులు సగము వెడల్పుతో
వుండాలి. కాబట్టి , 4 పిన్నుల సంఖ్యను 3 పూర్తి పిన్నులు
మరియు 2 సగము పిన్నులుగా నిర్ణయించాలి. ( 3 పూర్తి పిన్నులు
మధ్యలో మరియు 2 సగము పిన్నులు రెండు చివరలలో వుండాలి. )
6. మధ్యలో గల పిన్నుల కన్నా రెండు చివరలలో గల పిన్నులు
సుమారు 3 మి.మిా. ఎక్కువ వెడల్పును కలిగియుండాలి. కాబట్టి
ముందుగా రెండు ప్రక్కఅంచుల నుండి 3 మి.మిా. దూరమును
కొలిచి ఆ బిందువుల గుండా అంచులకు సమాంతరముగా ( పొడవు
దిశలో ) రెండు రేఖలను గీయాలి.
7. పై రెండురేఖల మధ్యగల కర్ర వెడల్పు భాగమును నాలుగు
సమభాగములుగా విభజిస్తూ రేఖలను గీయాలి. ఈ రేఖలు
యేర్పరచబడెడి పిన్నుల మధ్య భాగమును సూచిస్తాయి. పైన
గణించి పెట్టుకొన్న పిన్ను మందమునకు సగభాగము
వుండునట్లుగా పై రేఖలకు రెండు వైపులా బిందువులను
గుర్తించాలి. ఈ బిందువుగుండా T— బివెల్ ను వుపయోగిస్తూ 1:6
నిష్పత్తిని కలిగియుండునట్లు ( పటము ) ఎటవాలుగా రేఖలను
గీయాలి. T— బివెల్ ను తగిన కోణములో అమర్చుకొను విధానము
పటము 6.39 లో చూపబడింది. ఈ విధంగా పిన్నుల సైజును కర్ర
రెండవ ముఖతలము వైపు గూడా గుర్తించాలి.
8.బ్యాక్ ఱంపము లేదా డవ్ టెయిల్ ఱంపమును వుపయోగిస్తూ
పైన గుర్తింపబడిన రేఖల వెంబడి కర్రను కోయాలి. అయితే
ఱంపము రేఖ నుండి తొలగింపవలసిన భాగమువైపు అమర్చి
కర్రను తొలగించాలి. ఈ విధముగా చీలిక రూపములో కోయబడిన
కర్రను తొలగించుటకు కోపింగ్ ఱంపము లేదా ఉలిని
ఉపయోగించాలి. ముందుగా ఒకవైపు సగము వరకు కోసి,
కర్రముక్కను త్రిప్పుకొని రెండవ వైపు మిగిలిన సగభాగమును కోసి
తొలగించాలి. ఈ విధముగా కోయునపుడు పిన్ను ప్రక్క భాగములు
చదునుగా ( సమముగా ) వుండునట్లు జాగ్రత్త వహించాలి.
9. పై విధముగా ' డవ్ టెయిల్ ' రూపములో కోయబడిన పిన్నును
ఉపయోగిస్తూ రెండవ కర్రయందు దాని రూపమును గీసి గుర్తించాలి.
దీని వలన కోసి తొలగించవలసిన భాగమును పెన్సిల్ తో లేదా
మార్కింగ్ చాక్ తో గుర్తింపబడుతుంది. ఈ విధముగా కర్రముక్క
రెండు ముఖతలముల యందు గుర్తించాలి.
10. తొలగించ వలసిన భాగమును ముందుగా బ్యాక్ ఱంపముతో
కోసి తొలగించాలి. పిదప కోపింగ్ ఱంపము లేదా ఉలితో కోయగా
మిగిలిన భాగము ప్రక్కతలములను చదునుపరచి తగిన సైజును
సరిచేయాలి.
11. పిదప పటము 6.40 లో చూపిన విధముగా రెండు
కర్రముక్కలను జాగ్రత్తగా కలపాలి.
12. కొన్ని డవ్ టెయిల్ జాయింట్ల యందు టెయిల్ భాగము
జాయింట్ ద్వారా వెలుపలి వరకు యేర్పరచబడదు. అనగా
టెయిల్ భాగము బయటకు కనబడకుండా జాయింటు
యేర్పడుతుంది ( పటము 6.41 ). దీనిని బ్లైండ్ లేదా స్టాప్ డవ్
టెయిల్ జాయింట్ ' అంటారు.
అభ్యాసము
1. కర్రముక్కలను కలుపుకొని జాయింట్ ను ఏర్పరచు ఆవశ్యకతను
వివరింపుము.
2. కర్రముక్కలను కలుపెడి వివిధ జాయింట్లును పేర్కొనుము.
3. రెండు కర్రముక్కలను కలుపెడి ల్యాప్ జాయింటును ఏర్పరచు
విధానమును వివరింపుము.
4. మీటరు జాయింటును ఏర్పరచుటకు కావలసిన పనిముట్లను
పేర్కొని, వాటితో జాయింటును యేర్పరుచు విధానమును
వివరింపుము.
5. మోర్ టైస్ మరియు టెనన్ జాయింట్ ను ఏర్పరచునపుడు
కొలతలను గుర్తించెడి విధానమును వివరింపుము.
6. మోర్ టైస్ ను నిర్మించు విధానమును వివరింపుము.
7. డవ్ టెయిల్ జాయింటును ఏర్పరచునపుడు కొలతను గుర్తించు
విధానమును వివరింపుము.
8. డవ్ టెయిల్ జాయింటును యేర్పరచుటకుగాను కావలసిన
పనిముట్లను పేర్కొనుము. వాటినుపయోగించి జాయింటును
యేర్పరచు విధానమును వివరింపుము.