యూనిట్ - 5
ఉలి నుపయోగించి కర్రవస్తువునకు తగిన రూపము తెప్పించుట
ఉపోద్ఘాతము:—
ఉలి నుపయోగించి కర్రవస్తువునకు తగిన రూపము తెప్పించుట:
ఉలిద్వారా కర్రవస్తువును పొరలు, పొరలుగా చీల్చి దాని సైజును తగ్గించి, తగిన ఆకారమునకు దానిని మార్చుకొనవచ్చునని మనము 8వ తరగతిలో తెలుసుకున్నాము. వివిధ రకముల ఉలులు, వాటి ఉపయోగము కూడా మనము గ్రహించియున్నాము. ఇప్పుడు ఉలిని ఉపయోగించి కర్రవస్తువును ఖండించి, దానికి తగిన ఆకారమును యిచ్చెడి విధానమునుగురించి తెలుసుకుందాము.
2. ఉలిని ఉపయోగించుటకు ముందు పాటించవలసిన సూచనలు :
1. ముందుగా కర్రవస్తువును వైస్ లోగాని లేదా కదలలేని గట్టి ఉపరితలముపైన కదలకుండా యుండునట్లు గట్టిగా బిగించాలి. దీనివలన కర్రవస్తువును చేతితో పట్టుకొనెడి అవసరముండదు. అనగా రెండు చేతులతో ఉలి నుపయోగించుట సులభముగా, క్రమబద్ధపరిచెడి విధముగా చేసుకొన వీలుంటుంది.
2. ఉలి యొక్క ఖండించెడి అంచు పదునుగా వుండాలి.
3. కర్రవస్తువును ఖండించుట సులభముగా జరుగుటకు మరియు ఖండించిన ముఖతలము నునుపుగా యుండుటకు ఉలిని ఎప్పుడు కణములు అమర్చబడిన దిశలో వుపయోగించాలి.
4. ఉలిని ఉపయోగించినపుడు తగిన జాగరూకత అవసరము. ఉలిని చేతితో వదులుగా పట్టుకొని, దానిపై సుత్తెతో కొట్టినపుడు అది చేతినుండి జారి ముందుకు ఎగిరిపడవచ్చును.
4.3 ఉలిని ఉపయోగించెడి విధానము :
కర్రసామాగ్రిని తయారుచేయు వివిధ పనులకుగాను ఉలిని ఉపయోగించెడి విధానము క్రింద తెలుపబడింది.
( A ) ఉలిని ఉపయోగించి కర్రవస్తువు సమతలమునుండి కర్రను పొరలుగా విడదీయుట :
కర్రవస్తువు యొక్క సమతల ముఖభాగమునుండి కర్రను సన్నని పొరలభాగములో తొలగించి దానిని తగిన సైజులోనికి మార్చుటకు ఉలిని ఉపయోగించవచ్చును. ఇందుకుగాను అవలంబించవలసిన పద్ధతి క్రింద తెలుపబడింది.
1. ముందుగా కర్రవస్తువును వైస్ లో బిగించాలి.
2. ఉలి పదునైన అంచువద్దగల ఏటవాలు తలము ( Bevelled surface ) పైకి యుండునట్లు మరియు ఉలి సమతలంగా దాని హాండిల్ కుడిచేతితో పట్టుకొనాలి. ఎడమచేతితో ఖండించవలసిన కర్రభాగము నుండి సన్నని పొరలుగా కర్రను విడదీయునట్లు వుండాలి.
3. చేతిని ఆధారముగా తీసుకొని ఉలిని ఒకప్రక్కనుండి ఇంకొక ప్రక్కకు ఎటవాలుగా కదులునట్లు ముందుకు నెట్టవలెను. ఈ విధంగా ఉలిని కొద్దికొద్దిగా ముందుకు జరుపుచు కర్రవస్తువు సమతల ఉపరిభాగమునుండి కర్రను పొరలు పొరలుగా ఖండించవచ్చును. ( పటము 4.1)
( B ) ఉలిద్వారా కర్రవస్తువు ప్రక్కభాగములను మరియు నిలువుగాయున్న మూలభాగములను సరిచేయుట :
1. ముందుగా కర్రవస్తువును బెంచిపైన కదలకుండా అమర్చాలి. బెంచి ఉపరితలము దెబ్బతినకుండా కర్రవస్తువు అడుగుభాగమున బెంచి హుక్ నుగానీ, పనికిరాని కర్రముక్కలనుగానీ అమర్చియుంచాలి.
2. ఉలి పదునైన అంచులవద్దగల ఏటవాలుతలము సమపరచి సరిచేయవలసిన ప్రక్క తలమునకు వెలుపలివైపు తిరిగియుండునట్లు ఉలిని నిలువుగా పట్టుకొనాలి. ( పటము 4.2 )
3. ఉలిని పట్టుకొని వుపయోగించెడి వ్యక్తి దానిచే ఖండింపబడెడి కర్రభాగమును మరియు ఉలి పయనించుదిశను సరిగా చూడగలుగునట్లు నిలబడియుండాలి.
4. అరచేయిభాగములో ఉలి హాండిల్ ను నొక్కిపెట్టునట్లు కుడిచేతితో దాని హాండిల్ ను పట్టుకొనాలి. కుడిచేతి బొటనవ్రేలు ఉలి
' షాంక్ ' అనగా ముందువైపునకు చూపిస్తు వుండినట్టు సాచిపెట్టవలెను. ఎడమచేతి వ్రేళ్లతో ఉలి షాంక్ ను వదులుగా లేదా మృదువుగా పట్టుకొనాలి. కుడిచేతితో తగిన ఒత్తిడిని కలుగజేస్తూ ఉలి ముందుకు నెట్టాలి. ఎడమచేతితో కదలికను తగిన విధముగా మార్చుచు అది పయనించెడి దిశను క్రమపరచవచ్చును.
5. ఖండించునపుడు ఉలి పదునైన అంచు మొత్తము వెడల్పును వుపయోగించరాదు. దాని కొద్ది వెడల్పుతో మాత్రమే కర్రను ఖండించాలి. కర్రకు తగలకుండాయున్న మిగిలిన భాగము ఉలిని తిన్నని మార్గములో పయనించునట్లు క్రమపరచగలుగుతుంది.
6. పై విధముగా ఉలిని కొద్ది కొద్దిగా ముందునకు కదిలిస్తూ నిలువుగాయున్న ప్రక్కభాగములనుండి కర్ర పొరలను విడదీయవచ్చును.
7. ఎక్కువ మందముతో కర్ర పొరలను తొలగించుటకు ( అనగా ఎక్కువ లోతుతో కర్రలోనికి ఉలిని దించుటకు ) ఉలి హాండిల్ ను మాలెట్ తో కొట్టవలసి యుంటుంది.
( C ) మోర్ టైస్ లను ఏర్పరచుటకుగాను ఉలితో కర్రను తొలగించి చీలికలు చేయుట :
1. ఖండించవలసిన చీలిక వెడల్పునుబట్టి తగినంత మందముగల సాకెట్ రకపు ఉలిని సెలెక్టు చేసుకొనాలి.
2. ఉలి పదునైన అంచువద్దగల ఏటవాలుతలము తొలగించవలసిన కర్రభాగమువైపు వుండునట్లు ఉలి బ్లేడును ఎడమచేతితో పట్టుకొనాలి. దీనివలన ఖండింపబడెడి భాగమును సరిగా క్రమబద్ధము చేసుకొన వీలుంటుంది.
3. మాలెట్ ను కుడిచేతితో పట్టుకొని దానితో ఉలి హాండిల్ పైన కొట్టుట ద్వారా ఉలిని కర్రలోనికి దింపవలెను. ( పటము 4.3 )
4. ఈ విధముగా ఉలితో ఖండించి తొలగించవలసిన కర్రభాగములో దగ్గర దగ్గరగా యుండునట్లు అనేక చీలికలు నిలువుగా చేయాలి.
5. పిదప ఉలిని కొద్దిగా ఏటవాలుగా పట్టుకొని , దానిపైన అంచు అడ్డముగా పయనించునట్లు దాని హాండిల్ పై మాలెట్ తో కొట్టుచు ఉలిని నిలువు చీలికలు యేర్పరచిన కర్రభాగములో కొద్ది కొద్దిగా ముందుకు జరపాలి. దీనితో నిలువుగా చీల్చబడ్డ కర్రపొరలు అడుగున ఖండింపబడి తొలగింపబడతాయి.
6. ఈ విధముగా కొద్ది కొద్దిగా కర్రవస్తువులోనికి ఉలి దిగెడిలోతును పెంచుచు, కర్రలో యేర్పడిన చీలికలోతును పెంచవచ్చును.
( D ) కర్రవస్తువుయొక్క వంపుదిరిగిన ఉపరితలములను నునుపుపరచుట :
1. ఉలిని ఉపయోగించి సమతలములోయున్న ముఖభాగములనుండి కర్రను తొలగించిన పద్ధతి నుపయోగించి పైకి ఉబ్బెత్తుగా యున్న
ఉపరితలమునుండి కూడా కర్రను తొలగించి, ఆ ఉపరితలమును నునుపుపరచవచ్చును. ఉలిని కుడిచేతి వ్రేళ్లతో పట్టుకొని అరచేయితో నొక్కిపెట్టుచు దానిని కర్రవస్తువుయొక్క వంపుదిరిగిన ఉపరితలము పై ముందుకు నెట్టాలి. ఉలిబ్లేడు ముందుభాగమును ఎడమచేతితో వదులుగా పట్టుకొని అది పయనించు దిశను క్రమబద్ధము చేయవచ్చును.
2. పై విధముగా ఉలిని వుపయోగించినపుడు దాని పదునైన అంచువద్దగల ఏటవాలుతలము పైకి తిరిగియుండాలి.
3. లోతైన ఉపరితలములనుండి కర్రను తొలగించి, నునుపుపరచుటకు ఉలి పదునైన అంచువద్దగల ఏటవాలుభాగము క్రిందివైపు తిరిగియుండాలి.
4. ఉలితో వంపుదిరిగిన ( ఉబ్బెత్తుగా లేదా, లోతైన ) ఉపరితలము పై పనిచేయునపుడు కణములు అమర్చబడిన దిశలో కర్రను ఖండించాలి.
( E ) గౌజ్ లను ఉపయోగించుట :
1. వంపుదిరిగిన ఉపరితలమునుండి కర్రను తొలగించుటకు లేదా కర్రవస్తువు పై వంపుదిరిగిన చీలికలను చేయుటకు గౌజ్ ను ఉపయోగిస్తారు.
2. లోపలివైపు వంపుతిరిగిన గౌజ్ ను కర్రవస్తువు పై వంపుదిరిగిన అంచులను చేయుటకు వుపయోగించాలి.
వెలుపలివైపు వంపుతిరిగిన గౌజ్ ను చీలికలు, రంధ్రములు చేయుటకు వుపయోగించాలి.
3. ముందుగా తగిన ఆకారము, తగిన వెడల్పుగల గౌజ్ ను సెలక్టు చేసుకొనాలి.
కుడిచేతి వ్రేళ్లతో దాని హాండిల్ ను పట్టుకొని దాని పై ఒత్తిడిని కలుగజేయుచు ముందునకు నెట్టాలి. ఎడమచేతితో దాని బ్లేడు ముందుభాగమును పట్టుకొని అది పయనించెడి దిశను క్రమబద్ధము చేసుకొనాలి. ( పటము 4.6 )
4. ఎక్కువ మందముతో కర్రను తొలగించుటకు గౌజును మాలెట్ తో కొట్టుచు ముందుకు కదిలించాలి. అయితే ముగించవలసినపుడు ( చివరి సారిగా ఖండించునపుడు ) మాలెట్ ను ఉపయోగించకుండా చేతితో నే ఒత్తిడి కలుగచేస్తూ సన్నని పొరగా కర్రను విడదీస్తూ సున్నితముగా ఖండించాలి.
4.4 ఉలితో పనిచేయునపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు :
1. కర్రవస్తువు కదలకుండా దానిని వైస్ తో గట్టిగా బిగించాలి.
2. చేతులను ఉలి పదునైన అంచు ముందువైనకు పెట్టరాదు.
3. ఉలి కదిలెడి దిశ ఎప్పుడు శరీరము నుండి వెలుపలివైపునకు వుండాలి.
4. ఉలి అంచు పదునుగా వుండాలి.
5. వర్కింగ్ బెంచిపై ఉలి పదునైన అంచు తగలకుండా చూడాలి.
అభ్యాసము
1. ఉలిని ఉపయోగించునపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు వివరింపుము.
2. ఉలి ద్వారా కర్రవస్తువు ముఖతలము నుండి కర్రను తొలగించి విధానము వివరింపుము.
3. ఒక కర్రవస్తు ముఖతలమునుండి దీర్ఘచతురస్రాకారపు చీలిక చేయబడి ఉన్న దాని అడుగు భాగము మరియు ప్రక్కతలములను ఉలి ద్వారా సమపరచె విధానము వివరింపుము.
4. గౌజును వుపయోగించి ఉబ్బియున్న ఉపరితలమును నునుపుపరచు విధానము వివరింపుము.
No comments:
Post a Comment