యూనిట్ - 3
ప్లేన్ ను ఉపయోగించి కర్రవస్తువును చదునుచేయుట
3.1 ఉపోద్ఘాతము :
ప్లేన్ ( చిత్రిక )ను ఉపయోగించి కర్రవస్తువు వివిధ తలములు, అంచులు ప్రక్కభాగములు చదును పరచవచ్చునవి ఎనిమిదవ తరగతిలో తెలుసుకున్నాము. అంతేకాక వివిధరకముల ప్లేన్ ల నిర్మాణమునుగురించి, వాటిని ఉపయోగించెడి విధానమునుగురించి కూడా మనము తెలుసుకొనియున్నాము. ప్లేన్ ను ఉపయోగించి కర్రవస్తువులు చదునుచేసి నునుపుపరచు విధానమునుగురించి యిపుడు తెలుసుకుందాము.
కర్రవస్తువు వివిధ తలములు, అంచులను సమపరచి నునుపుచేయుట :
ప్లేన్ ఉపయోగించి మనకు కర్రవస్తువు వివిధ తలములనుండి, అంచులనుండి కొంత కర్రను ఖండించి, తొలగించుట ద్వారా దానిని చదును చేయవచ్చును. అంతేకాక అనవసర భాగములను తొలగించుట ద్వారా కర్రవస్తువుపై నిర్ధారించిన కొలతలను పొందవచ్చును. అయితే ఒక విషయము గమనించవలసివుంది. ప్లేన్ ద్వారా తొలగించబడెడి కర్రభాగము కొద్దిగా మాత్రమే వుండాలి. ఎక్కువ భాగము కర్రను ఖండించుటకు ప్లేన్ ను ఉపయోగించరాదు. మనకు యివ్వబడిన కర్రవస్తువును సమపరచి దానిని దీర్ఘ చతురస్రాకారపు పలకగా మార్చి, దాని వివిధ తలములు, అంచులు ఒకదానితో నొకటి సమకోణములో వుండునట్లు ప్లేనింగ్ చేయువిధానము క్రింద తెలుపబడింది.
( A ) కర్రవస్తు తలములను చదునుపరచి నునుపుగా చేయుట :—
1. ముందుగా ఇవ్వబడిన కర్రవస్తు పైభాగమున మరియు క్రింది వైపుగల ముఖతలములను పరిశీలించాలి. వాటిలో ఎక్కువ చదునుగాయున్న ముఖతలములను ఎన్నుకొనవలెను.
2. తిన్నని అంచు ( Stright edge ) లేదా ట్రైస్క్వేర్ ను ఉపయోగించి కర్రవస్తువు మెలిదిరిగియున్నదా పరీక్షించాలి. కర్రవస్తువు ముఖతలమునందు ఉబ్బెత్తుగా యున్న భాగములను గమనించి, గుర్తించాలి.
3. కర్రవస్తువు ముఖతలములు మరియు అంచులయందు కణములు అమర్చబడిన దిశను పరిశీలించి, ఆ దిశను సూచించునట్లుగా బాణముగుర్తును పెట్టుకొనాలి. ( పటము 3.2 )
4. కర్రపలకను వైస్ డాగ్ మరియు బెంచి స్టాప్ ల మధ్య బిగించాలి. అయితే బెంచి స్టాప్ కు గల కర్రదిమ్మ మందము కర్రపలక మందముకన్న తక్కువగా యుండాలి.
కర్రవస్తువును దాని రెండు అంచులపై ఒత్తిడి కలుగచేయునట్లు బిగించరాదు. ఈ విధముగా బిగించినయెడల కర్రవస్తువు సంపీడనముచెంది వంగిపోవుట జరగవచ్చును. ఎక్కువ పీడనముతో తిన్నగా బిగించబడిన కర్రవస్తువును ప్లేన్ ను ఉపయోగించి చదును పరచినపిదప, పీడనము తొలగించిన తదుపరి, ఆ కర్రవస్తువు వంపుదిరిగిపోవుటకు అవకాశమున్నది.
5. ముందుగా ప్లేను బ్లేడును తగినట్లుగా అమర్చుకొని అది కర్రవస్తువు ఉపరితలమునుండి సన్నని పొరలుగా కర్రను విడదీయునట్లు చూడాలి. ప్లేను ను కర్రయందు కణములు అమర్చబడిన దిశలో కదిలించుచు ప్లేనింగ్ చేయాలి.
ముందుగా ఉబ్బెత్తుగాయున్న భాగములనుండి కర్రను ఖండించి తొలగించుట ద్వారా కర్రపలకను చదునుపరచాలి. పిదప ప్లేన్ ను కర్ర ఉపరితలము నంతయును వ్వాపించునటుల కదిలించుచు సన్నని పొరలుగా కర్రను తొలగించసాగాలి.
6. ప్లేన్ ను ఉపయోగించునపుడు క్రింది సూచనలు పాటించాలి.
( a ) ప్లేన్ ను కదిలించుట ఆరంభించినపుడు ముందువైపునగల చేతిపిడి ( Knob ) పై ఎడమచేతితో ఎక్కువ పీడనమును కలిగించాలి. అనగా ప్లేన్ ముందుభాగమును కర్రవస్తువుపై ఎక్కువ ఒత్తిడితో నొక్కిపెట్టాలి.
( b ) ప్లేన్ ముందునకు కదిలి దాని అడుగుభాగము పూర్తిగా కర్రవస్తువు ఉపరితలము పైకి ప్రవేశించిన పిదప ముందువైపుగల చేతి పిడి పైన మరియు ప్లేన్ వెనుక భాగమున కుడిచేతితో పట్టుకొని యున్న హాండిల్ పైన సమానమైన ఒత్తిడిని కలుగజేయాలి.
( c ) ముందునకు సాగిన ప్లేన్ కర్రవస్తువు ఉపరితలమును దాటి పోవునపుడు ముందుభాగమునగల చేతిపిడిపైన ఒత్తిడిని తొలగించాలి.
7. ప్లేనింగ్ చేయునపుడు మధ్య మధ్యలో ట్రైస్క్వేర్ ను లేదా తిన్నని అంచును కర్రవస్తు ఉపరితలముపై అమర్చి అది సమతలముగా వున్నదీ, లేనిదీ పరిశీలించాలి. ట్రైస్క్వేర్ ను కర్ర ఉపరితలముపై పొడవుదిశలో, అడ్డముగా మరియు కర్ణము దిశలో అమర్చి పరిశీలించాలి. ట్రైస్క్వేర్ యొక్క బ్లేడు అంచు భాగమును కర్రవస్తువు ముఖతలముపై అమర్చి కాంతివచ్చు దిశకు అభిముఖముగా ఆ రెండింటిని పట్టుకొని చూడవలెను. బ్లేడు అంచుకు కర్రవస్తువుకు మధ్యనుండి కాంతి కనబడు భాగములు మిగిలిన ఉపరితలముకన్నా లోతుగా ( దిగువుగా ) వున్నవని గుర్తించవచ్చును. బ్లేడు అంచు కర్రనుతాకెడి మిగిలిన భాగములనుండి కర్రను తొలగించవలసియుంది. అయితే ఆ భాగమునుండి కర్రను సన్నని పొరలుగా మాత్రమే తొలగించి మరల సమతలమును పరిశీలించాలి.
8. ఈ విధముగా సమపరచబడిన ముఖతలముపై యేదైనా గుర్తుపెట్టుకొనాలి. రెండుముఖతలములలో చదును చేయబడిన దానిని తర్వాత గుర్తించుటకై యీ గుర్తు పనికివస్తుంది.
( B ) అంచులను ముఖతలముతో సమకోణము చేయునట్లు చదునుచేయుట :
1. కర్రవస్తువు రెండు అంచులలో ఎక్కువ చదునుగానున్న దానిని ఎన్నుకొనాలి. ట్రైస్క్వేర్ తో యీ అంచు సమతలపరచి గుర్తించబడిన ముఖతలముతో సమకోణములో నున్నదా లేదా గమనించాలి. ఈ అంచుపైన ఎత్తైన భాగమును గుర్తించాలి.
2. చదును చేయవలసిన అంచు పైకివుండునట్లుగా మరియు అది బెంచి ఉపరితలమునకు సమాంతరముగా వుండునట్లు కర్రవస్తువును బెంచి వైస్ లో బిగించాలి. ( పటము 3.5 )
3. పటము 3.5 లో చూపినట్లు ప్లేన్ ను పట్టుకొనాలి. ఎడమచేతి బొటనవ్రేలు ప్లేన్ ముందువైపునగల చేతి పిడికి తగులుచు, మిగిలిన వ్రేళ్లు కర్రవస్తువు ముఖతలముపైన సులభముగా జాఱునట్లు ఆనించి వుంచాలి. ప్లేన్ ను అంచుకు సమాంతరముగా వుంచి కుడిచేతితో మామూలుగా హాండిల్ ను పట్టుకొనాలి. ఈ విధముగా పట్టుకొనుటవలన ప్లేన్ యేవిధమైన ఒడిదుడుకులు లేకుండా సరిగ్గా ముందువైపునకు కదులుతుంది.
4. ప్లేన్ ను అంచుపై పూర్తిగా కదిలిస్తూ వెనుకకూ, ముందుకు జరపాలి. ప్లేన్ ను సమతలంగా వుంచి ముందుగా అంచుపై ఎత్తుగాయున్న భాగములను తొలగించాలి. ప్లేన్ ను ముందునకు కదిలించుట ఆరంభించినపుడు ప్లేన్ ముందువైపునగల చేతిపిడిని నొక్కిపెట్టాలి. ప్లేన్ ముందువైపు జరుగు కదలికను ఆపినపుడు, వెనుకవైపునగల హాండిల్ పై ఎక్కువ ఒత్తిడి కలుగచేయాలి
5. చదునుపరచబడిన అంచును పరీక్షించుటకుగాను ట్రైస్క్వేర్ ను వుపయోగించాలి. పటము 3.6 లో చూపిన విధంగా చదునుపరచబడిన ముఖతలమునకు తగులునట్లుగా ట్రైస్క్వేర్ స్టాక్ ను అమర్చి దాని బ్లేడు అంచు ప్లేనుచేయబడిన కర్రవస్తువు అంచుపై తగులునట్లుగా అమర్చాలి. వెలుతురుకు అభిముఖముగా దీనిని పరిశీలించునపుడు బ్లేడుకు కర్రవస్తు అంచునకు మధ్య ఖాళీస్థలమువుండిన భాగములను గుర్తించాలి. బ్లేడుకు తగిలెడి మిగిలిన కర్రభాగములు ఎత్తుగా గుర్తింపబడినవి కనుక ఈ భాగములను ప్లేన్ ద్వారా తొలగించాలి. అయితే యీ పని కర్రను సన్నని పొరలుగా మాత్రమే తొలగిస్తూ జాగ్రత్తగా చేయాలి.
ప్లేన్ ను ఉపయోగించునపుడు పూర్తి వెడల్పును కలిగియుండునట్లు కర్ర మొత్తము పొడవుపై వ్యాపించునట్లు ప్లేన్ ను కదిలించాలి. దీనితో సరియైన అంచు త్వరగా యేర్పడుతుంది.
6. ఈ విధముగా సమపరచబడిన అంచుపై తగిన గుర్తుపెట్టుకొనాలి.
( c ) ప్రక్క భాగములను చదునుచేసి ముఖతలము, అంచులతో సమకోణములో వుండునట్లు సరిచేయుట :
1. ముందుగా ఒక ప్రక్క భాగములను పరిశీలించి, కణముల అమరిక కనబడుతుందా లేదా చూడాలి. కనబడనియెడల ఆ ప్రక్కభాగమునుండి కనీసము 5 మి.మీ. పొడవును వదలి కర్రను కోసివేయాలి. దీనితో కణముల అమరిక సరిగా కనబడుతుంది.
2. ఈ ప్రక్కభాగము పైకి తిరిగియుండునట్లుగా వైస్ లో కర్రవస్తువును బిగించి పిదప ప్లేన్ తో చదునుచేయాలి. పిదప ఆ ప్రక్కభాగమును ఒక అంచునుండి సగముదూరమువరకు మాత్రమే ప్లేన్ తో చదునుచేయాలి. మిగిలిన సగభాగమును చదునుచేయుటకు ప్లేన్ ను రెండువైపులగల అంచునుండి కదిలిస్తూ చదునుచేయాలి. దీనివలన అంచులవద్ద మూలలు పొరలు పొరలుగా లేవకుండా వుంటాయి.
3. ప్రక్కభాగమును చదునుచేయుటకుగాను అంచును చదునుపరచునపుడు పట్టుకున్న పద్ధతిలోనే ప్లేన్ ను పట్టుకొనాలి. అయితే ప్లేను కొద్దిగా ప్రక్కకు త్రిప్పి ఏటవాలుగా యుండునట్లుగావుంచి ముందునకు కదిలించాలి. దీనివలన కర్ర పై నుండి పొరలు సులభముగా తొలగించుట సాధ్యపడుతుంది.
4. పిదప ట్రైస్క్వేర్ తో చదునుపరచబడిన ప్రక్కభాగమును యింతకు ముందు చదునుచేయబడిన ముఖతలము మరియు అంచులతో సమకోణము చేయుచున్నదా లేదా పరిశీలించాలి. ఎత్తుగాయున్న భాగములను తొలగించి ప్రక్కభాగమును చదునుపరచాలి.
5. ఈ విధముగా చదును పరచబడిన ప్రక్క భాగమును తగిన విధముగా గుర్తుపెట్టుకొనాలి.
No comments:
Post a Comment