కర్రవస్తువు యందు రంధ్రములను చేయు బోరింగు పనిముట్లు
కర్రవస్తువు యందు రంధ్రములను చేయుటకు బోరింగు పనిముట్లు ( Boring Tools ) ఉపయోగపడతాయి. రంధ్రము యొక్క సైజును బట్టి ( అనగా రంధ్రము వ్యాసమును బట్టి ) తగిన బోరింగు పనిముట్టును ఎన్నుకొని వుపయోగించవలసి
యుంటుంది. కర్ర సామాగ్రిని తయారు చేయుపనియందు ఉపయోగపడెడి వివిధ బోరింగు పనిముట్లను గురించి క్రింద వివరించనైనది.
1. బ్రాడాల్ ( Bradawl ) :-
ఎక్కువ గట్టిదనము లేని మెత్తని కర్రవస్తువుయందు చిన్న రంధ్రములను చేయుటకుయీ పనిముట్టు ఉపకరిస్తుంది.
పటము 7.1 లో చూపిన మాదిరిగా ఇది కడ్డీ ఆకారపు ' బ్లేడు ' ను కలిగియుండి దానికి పై భాగమును కర్రతో చేసిన హాండిల్ బిగింపబడియుంటుంది. కడ్డీ అడుగు భాగము పదునైన అంచు ( Cutting edge ) కర్రను ఖండించుటకుగాను ఏర్పరచబడియుంటుంది. ఈ పనిముట్టు స్ర్కూడ్రైవర్ ఆకారమును కలిగియుంటుంది. హాండిల్ ను చేతితో పట్టుకొని పదునైన అంచును గట్టిగా కర్రలోనికి నొక్కిపెడ్తూ బ్లేడును గుండ్రముగా త్రిప్పుట ద్వారా కర్రవస్తువులో రంధ్రము చేయబడుతుంది.
పదునైన అంచుగల బ్లేడు అడుగు భాగము తగినంత కోణములో వెలుపలివైపుకు ఏటవాలుగా వంగి వుండుట మూలముగా దీని నుపయోగించి రంధ్రములను చేయునపుడు కర్రవస్తువు పై పగుళ్లు యేర్పడవు. దీని హాండిల్ పైన 'మాలెట్' తో నెమ్మదిగా కొట్టుట ద్వారా కూడా కర్రవస్తువు యందు రంధ్రములు యేర్పరచవచ్చును. దీనితో సుమారు 6 మి.మీ. వరకు రంధ్రములను చేయువీలుంటుంది.
2. గిమ్ లెట్ ( Gimlet ) :-
ఇది కూడా కర్రవస్తువుయందు చిన్న రంధ్రములను చేయుటకు ఉపకరిస్తుంది. రెండు రకముల గామ్ లెట్ లు వాడుకలో నున్నాయి. మొదటి రకపు సాధారణ గిమ్ లెట్ కడ్డీ ఆకారపు ' బ్లేడు ' భాగమును కలిగియుండి దాని అడుగు భాగమున కొద్ది పొడవు కర్రవస్తువును ఖండిచెడి తదునైన మొనలు సర్పిలాకారంలో మెలిదిరిగి యుండునట్లు అమర్చబడి వుంటాయి.
రెండవ రకము గిమ్ లెట్ కడ్డీ మొత్తము పొడవు మెలిదిరిగి సర్పిలాకారపు పదునైన మొనలు అమర్చబడి వుంటుంది.
దీనిని ' మెలి దిరిగి యున్న గిమ్ లెట్ ' ( Twisted Gimlet) అని అంటారు. పై రెండు రకముల గిమ్ లెట్ లను ఉపయోగించుటకుగాను, కడ్డీకి పైన అమర్చబడిన కర్ర హాండిల్ ను చేతితో పట్టుకొని, కడ్డీ అడుగు భాగమును కర్రవస్తువుపై నొక్కి పెట్తూ హాండిల్ ను గుండ్రంగా త్రిపాలి. దీని వలన పదునైన మొనలచే కర్ర ఖండింపబడి రంధ్రము చేయబడుతుండి. దీని నుపయోగించి సుమారు 10 మి.మీ. వరకు వ్యాసము గల రంధ్రములను చేయవచ్చునుదీనినే ' బరమా '
అని అంటారు.
3. బ్రేస్ ( Brace ) :
వివిధ సైజులలో వివిధ ఆకారములను కలిగియున్న రంధ్రములను చేయుటకు బ్రేస్ ఉపయోగపడుతుంది. కర్రవస్తువుయందు రంధ్రములను చేయుటకు ఉపకరిచు పనిముట్టును ' బిట్ ' ( Bit ) అని అంటారు. బిట్ ను తగిలించుకొని కర్రవస్తువు యందు రంధ్రములను చేసెడి పరికరమును ' బిట్ బ్రేస్ ' లేదా ' బిట్ స్టాక్ ' లేదా ' బ్రేస్ ' అంటారు. రంధ్రమును చేయునపుడు గుడ్రముగా తిరిగెడి ' బిట్ ' వంగిపోకుండా నిట్టనిలువుగా నిలబడి యుండుటకుగాను దానికి తగినంత పట్టు నిచ్చుటకుగాను బ్రేస్ ఉపయోగపడుతుంది. బిట్ ను తగినంత ఒత్తిడితో కర్రవస్తువు పై నొక్కిపెట్టుటకు మరియు దానిని తగినంత వేగముతో గుండ్రముగా త్రిప్పుటకు బ్రేస్ సహకరిస్తుంది. గుండ్రముగా తిరిగెడి బిట్ కర్రవస్తువును ఖండిస్తూ ముందుకు పయనించుట ద్వారా లోతైన రంధ్రములను చేయగలుగుతుంది. ముందుగా బ్రేస్ పనిచేయు విధానమును గురించి తెలుసుకుందాము. రెండు రకముల బ్రేసులు ఎక్కువగా వాడుకలోనున్నాయి. వీటిని (1) రాచెట్ ను కలిగిన బ్రేస్ ( Ratchet brace ) అనీ మరియు (2) పండ్ల చక్రమును కలిగిన బ్రేస్ ( Wheel brace ) అని అంటారు.
(1) రాచెట్ బ్రేస్ :-
ఇది ' విల్లు ' ( Bow ) ఆకారములో వంచబడి ఉక్కు కడ్డీని కలిగియుంటుంది. దీనిని ' క్రేంక్ ' ( Crank ) అని అంటారు. ప్రత్యేకమైన యీ విల్లు ఆకారము వలన దీనిని ఉపయోగించుట సులభసాధ్యమే కాకుండా, ఇది పనిచేయు విధానము తగురీతిలో క్రమబద్ధము చేసుకొనవచ్చును. ఈ కడ్డీ పై భాగమున బాల్ బేరింగుల ద్వారా ' హెడ్ ' అనబడు భాగము అమర్చబడి వుంటుంది. ఇది ప్లాస్టిక్ తో లేదా గట్టి కర్రతో లేదా అల్యూమినియంతో చేయబడి చేతితో పట్టుకొను ఆకారమును కలిగియుంటుంది. దీనిని చేతితో పట్టుకొని క్రిందకి నొక్కిపెట్టుట ద్వారా కర్రవస్తువు పై తగిన ఒత్తిడితో బిట్ పనిచేస్తుంది.
వంపుతిరిగిన కడ్డీ మధ్యభాగములో హాండిల్ ఒకటి బిగింపబడియుంటుంది. ఇది ప్లాస్టిక్ తో లేదా గట్టి కర్రతో లేదా అల్యూమినియంతో చేయబడి వుంటుంది. క్రేంక్ పైన బిగింపబడిన హాండిల్ వదులుగా వుండుటవల్ల అది క్రేంక్ పైన గుండ్రముగా తిరగగలుగుతుంది. హాండిల్ ను చేతితో పట్టుకొని బలమునుపయోగిస్తూ క్రేంక్ ను గుండ్రముగా త్రిప్పవచ్చును.
రంధ్రములను చేయు పనిముట్టు ( బిట్ ) ను పట్టుకొనుటకుగాను ఉపయోగపడు భాగమును ' చక్ ' ( Chuck ) అంటారు. ఇది బాల్ బేరింగుల ద్వారా క్రేంక్ అడుగు భాగమును బిగింపబడియుంటుంది. దీనికి అమర్చబడిన పండ్ల ( Jaws ) ద్వారా బిట్ పట్టుకొనబడుతుంది. చక్ కు అమర్చబడిన స్లీవ్ ( Sleeve ) అనబడు గొట్టమును గుండ్రముగా త్రిప్పుకొనుట ద్వారా పండ్లను దగ్గరగా లేదా దూరముగా జరుపుకొని బిట్ ను పట్టుకొనుట లేదా వదిలివేయుట చేసుకొనవచ్చును. చక్ ను క్రేంకు కు అడుగుభాగమున అమర్చినచోట ' కేమ్ రింగ్' ( Cam ring ) అనబడు గొట్టము ఆకారపు భాగమువుంటుంది. దీనిని కుడి వైపు ( అనగా సవ్యదిశలో ) త్రిప్పుట ద్వారా చక్ కు పైన గల ' రాచెట్ ' ( Ratchet ) పనిచేసి క్రేంకు గుండ్రముగా ( సవ్యదిశగా ) తిరిగినపుడు దానితోపాటు బిట్ ను కూడా త్రిప్పుతుంది. అయితే క్రేంకును అపసవ్యదిశలో త్రిప్పినపుడు బిట్ దానితోపాటు తిరగదు. రంధ్రము చేసినపిదప బిట్ ను రంధ్రమునుండి పైకి తీయునపుడు క్రేంకును అపసవ్యదిశలో త్రిప్పుకొని బిట్ ను బయటకు తీయవచ్చును.
కర్రవస్తువుయందు పండ్లచక్రపు బ్రేస్
పండ్లచక్రపు బ్రేస్ :-
తక్కువ వ్యాసముగల చిన్న రంధ్రములను చేయుటకు ఇది ఉపకరిస్తుంది. దీనియందు విల్లు ఆకారపు క్రేంకుకు బదులు ఒకపెద్ద పండ్ల చక్రము ( Toot hed gear ) మరియు దానిని గుండ్రముగా త్రిప్పుకొనుటకుగాను దానికి అమర్చబడిన
' క్రేంక్ ' వుంటాయి. అడుగునగల కడ్డీ ఆకారపు బాడీకి అడుగున చక్ బిగింపబడియుంటుంది. దీనికి పై భాగమున అమర్చిన కర్ర హాండిల్ ను చేతితో పట్టుకొని, కర్రవస్తువు పైకి చక్ లో బిగించిన బిట్ ను నొక్కిపెట్టవచ్చును. కడ్డీపైననే అమర్చబడిన చిన్న పండ్లచక్రము క్రేంక్ చే త్రిప్పబడు పెద్ద పండ్లచక్రమునకు కలపబడియుంటుంది. పెద్ద పండ్లచక్రము తిరిగినపుడు దానితోపాటు చిన్న పండ్లచక్రము గుండ్రముగా తిరిగి కడ్డీని మరియు దానిపై అమర్చిన చక్ ను త్రిప్పుట ద్వారా రంధ్రమును చేయు బిట్ తిరిగి కర్రవస్తువుయందు రంధ్రమును చేస్తుంది.
No comments:
Post a Comment