యూనిట్ - 2
ఱంపముతో కర్రవస్తువును కోయు విధానము
2.1 ఉపోద్ఘాతము :
వివిధ రకముల చేతి ఱంపములనుగురించి, వాటిని ఉపయోగించెడి
విధానమునుగురించి ఎనిమిదవ తరగతిలో తెలుసుకొనియున్నాము. ఱంపము ద్వారా
కర్రవస్తువును కోసి దానికి తగిన ఆకారమును తెచ్చెడి విధానమునుగురించి యిపుడు
తెలుసుకుందాము. అయితే ముందుగా కర్రవస్తువుయుందు కణములు అమర్చబడిన
దిశలో లేదా కణముల అమరికకు అడ్డముగా కోయుటకు తగిన ఱంపమును
ఎన్నుకొనవలెను. కర్రవస్తువును తిన్నగా ఒక రేఖ వెంబడి కోయవలయునా లేదా
వంపుగా కోయవలయునా నిర్ణయించుకొని దానికి తగిన ఱంపమును
ఎన్నుకొనవలెను.
తగిన ఱంపమును ఎన్నుకొనుటకుగాను, వివిధ ఱంపములు పనిచేయు
విధానమునుగురించి మరల పునర్విమర్శించుకొనుము.
2.2 ఱంపముతో కర్రవస్తువును కోయు విధానము :
1. ముందుగా కోయవలసిన దిశలో కర్రవస్తువుపై స్టీలురూలు మరియు పెన్సిల్ లేదా
మార్కింగ్ గేజితో రేఖను గుర్తించిలి.
2. కర్రవస్తువు చిన్నదైన యెడల దానిని వైస్ లో గానీ లేదా బెంచి హుక్ పైనగానీ
అమర్చి బిగించాలి. పొడవుగాయున్న కర్రవస్తువును సాధారణంగా ఱంపపుబల్ల ( Saw
Horse ) పైన పెట్టి అది కదలకుండా మోకాలితో దానిని నొక్కిపెట్టి కదలకుండా
వుండునట్లు చూడాలి.
3. ఱంపమును కుడిచేతితో పట్టుకొనాలి. కుడిచేతి బొటనవ్రేలు మరియు
చూపుడువ్రేలు హాండిల్ కు రెండువైపులా వుండాలి. చూపుడువ్రేలు ముందువైపునకు
సాచియుంచాలి. ఈ విధముగా హాండిల్ ను పట్టుకొనుట వలన ఱంపము
ఋజుమార్గములో ( తిన్నగా ) పయనించుట క్రమబద్ధము చేసుకొనుట
సులభతరమగుతుంది.
4. పనిచేయు వ్యక్తి ముంజేయి, భుజము మరియు కంటిదృష్టి ఒకే వరుసలో
యుండునట్లు ఆ వ్యక్తి సరిగా నిలబడాలి. ( పటము 2.2 )
5. ఱంపపుబిల్లను ఉపయోగించునపుడు పటము 2.3 లో చూపినట్లు కర్రవస్తువుపై
మోకాలిని నొక్కిపెట్టి వస్తువు కదలకుండా చూడాలి. పెన్సిల్ ద్వారా గుర్తింపబడిన
రేఖకు అతి దగ్గరగా ఱంపముతో కోయుట ఆరంభించాలి. ఱంపము రేఖ నుండి
తొలగింపవలసిన కర్రభాగమువైపునకు వుండాలి. కోయుట ముగిసిన పిదప ముందుగా
గుర్తింపబడిన రేఖ దాదాపుగా కనబడకుండా వుండాలి.
6. కర్రవస్తువును కోయుట ప్రారంభించుటుకుగాను ఎడమచేతితో ఱంపము బ్లేడునకు
దగ్గరగాయుండునట్లు కర్రవస్తువును పట్టుకొనాలి. బొటనవ్రేలి కొంతభాగము బ్లేడునకు
తగులుచుబ్లేడు పయనించుదిశను క్రమబద్ధము చేసుకొనునట్లు వుండాలి ( పటము 2.4 )
అయితే ఱంపము బ్లేడు కదులునపుడు, దాని పదునైన పండ్లకు తగిలి
గాయపడకుండా బొటనవ్రేలును లేపి వుంచాలి.
7. ముందుగా ఱంపమును కర్రవస్తువుపై ఆనించి రెండు లేక మూడు సార్లు మెల్లిగా పైకి లాగాలి. దీనితో కర్రయందు సన్నని చీలిక యేర్పడి ఱంపముపండ్లు ఆ చీలికలో ప్రవేశించుట ద్వారా కర్రలోనికి దిగుతుంది.
8. ఈ విధముగా ఱంపము కర్రలోనికి దిగిన పిదప ఱంపముబ్లేడు ముందువైపు కొద్దిభాగము మాత్రము కర్రను ఖండించునట్లు చిన్న స్ర్టాకులతో చిన్న కదలికలతో ఱంపము బ్లేడును ముందు దిశలో కదిలించాలి. దీనితో ఇంతకుముందు చేయబడిన చీలిక లోతు హెచ్చి ఱంపముబ్లేడు మరింతగా కర్రలోనికి దిగుతుంది. ఇప్పుడు కర్రపైనుండి ఎడమ చేతిని తీసివేయవచ్చును.
9. పిదప మొత్తము బ్లేడు పొడవుతో కర్రను కోయునట్లు ఱంపముబ్లేడును పూర్తి స్ర్టాకులతో ముందు, వెనుకలకు కదిలించాలి. ఱంపమును ముందునకు నెట్టినపుడు శరీరము మరియు భుజముతో తగినంత ఒత్తిడిని కలిగించాలి. అంతేకాని ముంజేయితో ఒత్తిడిని కలుగచేయరాదు. ముంజేయితో ఒత్తిడిని కలుగించినయెడల బ్లేడు తిన్నగా కాకుండా అటూ, ఇటూ కదులుచు ఒడిదుడుకులతో పయనిస్తుంది.
10. ఒకవేళ ఱంపము బ్లేడు కోయవలసిన తిన్నని మార్గము నుండి ప్రక్కకు వైదొలగిపోయినయెడల, బ్లేడు ముందుభాగము వైపుగల పండ్లతో మాత్రమే కర్రను కోయుచు, ఱంపముహాండిల్ ను ప్రక్కలకు వంచి బ్లేడు ప్రక్కలకు వంగునట్లు చూడాలి. దీనివలన బ్లేడు తిరిగి సరియైన మార్గములోనికి వస్తుంది. ( పటము 2.5 )
11. ఱంపముబ్లేడు వస్తు ఉపరితలముతో తగినంత కోణమును చేయునట్లు ఏటవాలుగా వుండాలి. అడ్డముగా కోయునపుడు ఈ కోణము 45॰ మరియు రిప్ ఱంపము నుపయోగించినపుడు సుమారు 60॰ వుండునట్లు అమర్చాలి. ( పటము 2.6 )
12. ఱంపమును కదిలించునపుడు అది గుర్తించి రేఖవెంబడి ఖండించునట్లు చూడాలి. అంతేకాకుండా అది వస్తువు ఉపరితలమునకు సమకోణములో కోయాలి.
13. ఱంపముతో చీలికలు చేయునపుడు, ఱంపము చీలికలో చిక్కిపోవుట వలన సులభముగా కదలకపోవచ్చును. కోయబడిన చీలికలో కోసుగాయున్న కర్రముక్కనొకదానిని అమర్చి చీల్చబడిన కర్రభాగములు దగ్గరగా రాకుండ చూడాలి. దీనివలన బ్లేడు చీలికలో తట్టుకొనబడక సులభముగా కదులుతుంది. ( పటము 2.7 )
14. ఱంపము బ్లేడు కర్రను కోయుట ముగియునపుడు ( అనగా కర్రవస్తువు ఒక ప్రక్క భాగము నుండి మొదలై మరియొక ప్రక్క భాగము వరకు వచ్చునపుడు ), విడదీయబడెడి కర్రభాగమును చేతితో పట్టుకొనాలి. ( పటము2.8 ) తక్కువ పొడవుగల కదలికతో, తేలికైన స్ర్టోకులతో ఱంపమును కదిలించాలి. ఒకవేళ విడదీయబడెడి కర్రముక్క ఎక్కువ పొడవును కలిగియుండి, దానిని ఒక చేతితో పట్టుకొనుట కష్టసాధ్యమైనపుడు, మరొకవ్యక్తి సహాయమును కోరాలి. లేదా దాని క్రింద తగిన ఆధారమును పెట్టియుంచాలి.
2.3 గమనించవలసిన విషయములు :
1. ఱంపముతో కోయునపుడు గుర్తింపబడిన రేఖకు దగ్గరగా మరియు తొలగించవలసిన కర్రభాగమువైపు కోయవలెను.
2. ఱంపము ద్వారా కోయబడు భాగము కర్రవస్తువు ఉపరితలనునకు లంబముగా యుండాలి.
3. ఱంపముతో కర్రవస్తువును పూర్తిగా కోసి రెండు భాగములుగా విడదీయవలెను. అంతేకాని, కొంతవరకు కోసినపిదప, కర్రను ఉలితో విడదీయుట లేదా చేతితో పట్టుకొని చీల్చి విడదీయుట చేయరాదు.
4. ఎడమచేతి బొటనవ్రేలికి గాయము కాకుండా చూడాలి. ధరించిన వదులైన దుస్తులు ఱంపముపండ్లలో చిక్కిపోకుండా జాగ్రత్త వహించాలి.
అభ్యాసము
1. ఒక దీర్ఘ చతురస్రాకారపు కర్రపలకను వెడల్పు మార్గములో రెండు భాగములుగా కోయువిధానమును వివరింపుము.
2. ఒక దీర్ఘ చతురస్రాకారపు కర్రపలకయందు దానికర్ణము మార్గములో కర్రనుకోయు విధానమును వివరింపుము.
3. ఱంపముతో కోయునపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలను వివరింపుము.
No comments:
Post a Comment