కర్రవస్తువుయందు రంధ్రములను చేయు పనిముట్లు :-
బ్రేస్ కు తగిలించుకొని కర్రవస్తువుయందు రంధ్రములను చేయు పనిముట్లను ' బిట్ ' ( Bit ) అంటారని తెలుసుకున్నాము. వివిధ ఆకారముల, వివిధ సైజుల రంధ్రములను చేయుటకు పనికివచ్చు ముఖ్యమైన పనిముట్లను గురించి క్రింద వివరించనైనది.
1. షెల్ బిట్ ( Shell bit ):-
ఇది పటములో చూపిన మాదిరిగా పొడవైన దీర్ఘచతురస్రాకారపు కడ్డీని కలిగియుండి దాని అడుగుభాగమున V— ఆకారములో ఏటవాలుగాయున్న రెండు పదునైన అంచులను కలిగియుంటుంది. దీనిని బ్రేస్ కు తగిలించుకుని 12 మి.మీ. వరకు వ్యాసముగల రంధ్రములను చేయవచ్చును. అయితే దీనిచే చేయబడిన రంధ్రముల లోతలము ఎక్కువ నునుపుదనమును కలిగియుండదు.
2. ట్విస్ట్ బిట్ ( Twist bit ) :-
దీనినే ' ఆగర్ బిట్ ' ( Auger bit ) అని కూడా అంటారు. ఇది కర్రవస్తువును ఖండించెడి రెండు పదునైన అంచులు సర్పిలాకారములో మెలిదిరిగి యుండునట్లుగా యేర్పరచబడిన కడ్డీని కలిగియుంటుంది. దీనికి అడుగు భాగమున తక్కువ పొడవుగల సన్నని స్క్రూ ఒకటి అమర్చబడియుంటుంది. ఈ పనిముట్టుతో రంధ్రమును చేయునపుడు ముందుగా స్క్రూ కర్రవస్తువు ఉపరితలమును తాకుచు చిన్న రంధ్రమును చేస్తుంది. పిదప కడ్డీకి గల పదునైన అంచుల ద్వారా వస్తువు ఖండింపబడి కడ్డీ వ్యాసమునకు సమానమైన సైజుగల రంధ్రము చేయబడుతుంది. దీని ద్వారా లోతైన రంధ్రములను ఖచ్చితమైన కొలతలను కలిగియుండునట్లు యేర్పరచవచ్చును. కర్రవస్తువుయందు అమర్చబడిన దిశలో లేదా ఆ దిశకు అడ్డముగా రంధ్రములను దీనితో చేయవచ్చును. ఇది 6 నుండి 35 మి.మీ. వ్యాసమువరకు వివిధ సైజులలో లభ్యమగుతుంది. తక్కువ పోడవుగల ట్విస్ట్ బిట్ ను ' డవెల్ బిట్ ' ( Dowel bit ) అని అంటారు.
3. ఎక్స్ పాన్షన్ బిట్ ( Expansion bit ):-
ఇది ' కట్టర్లు ' ( Cutters ) అనబడెడి ఖండించెడి రెండు భాగములను కలిగియుండి, వాటి మధ్య దూరమును మార్చుకొనెడి సదుపాయమును కలిగియుంటుంది. ఈ రెండు కట్టర్లను తగిన స్థానములలోనికి జరుపుకొని అమర్చుకొనుట ద్వారా రెండు నిర్ణీత సైజులమధ్యగల యేదేని సైజుతో రంధ్రమును యేర్పరచుకొనవచ్చును. ఇది సాధారణంగా 12 నుండి 35 మి.మీ. వరకు వ్యాసముగల వివిధ సైజులలో లభ్యమగుతుంది.
4. సెంటర్ బిట్ ( Center bit ) :-
కర్రవస్తువుయందు అమర్చబడిన దిశకు అడ్డముగా లోతు తక్కువగల రంధ్రములను చేయుటకు యిది తోడ్పడుతుంది. దీనితో చేయబడు రంధ్రములు ఖచ్చితమైన కొలతతో నునుపైన లోతలమును కలిగియుంటాయి. ఇది 3 నుండి 35 మి.మీ. వరకు వ్యాసముగల వివిధ సైజులలో లభ్యమగుతుంది.
5. ఫార్ స్ట్నర్ బిట్ ( Forstner bit ) :-
ఇది కడ్డీ ఆకారపు ' షాంక్ ' ను కలిగియుండి దానికి అడుగు భాగమున ఉక్కుతో చేయబడిన రింగును కలిగియుంటుంది. రింగుయందు వంపుగాయున్న చీలిక చేయబడి అది రెండు పదునైన అంచులను కలిగియుంటుంది. షాంక్ కు రెండవ వైపునగల ' టాంగ్ ' ( Tang )
అనబడు భాగము చక్ లో బిగించుట ద్వారా యిది బ్రేస్ కు కలపబడి వుంటుంది. ఇది 6నుండి 25 మి.మీ. వరకు వ్యాసముగల రంధ్రములను చేయు వివిధ సైజులలో లభ్యమగుతుంది.
6. కౌటర్ సంక్ బిట్ ( Counter sunk bit ):-
దీనినే ' రోజ్ బిట్ ' ( Rose bit ) అని అంటారు. కర్రవస్తువులలో చేయబడ్డ లోతైన రంధ్రము యొక్క పై భాగము వెలుపలికి తెరచుకున్నట్లు ఏటవాలు తలమును కలిగి యుండునట్లు చేయుటకు ఇది తోడ్పడుతుంది. ఈ ఏటవాలు తలమునకు తగులునట్లు
' కౌటర్ సంక్ స్క్రూ ' లను ఈ రంధ్రములో బిగించుటకు వీలుంటుంది.
7. డ్రిల్ బిట్ :-
కర్రవస్తువుయందు స్క్రూలను బిగించుటకుగాను అవసరపడు రంధ్రములను చేయుటకు డ్రిల్ బిట్ ( Drill bit ) ఉపయోగపడుతుంది. ఇది రెండు పదునైన అంచులను కలిగియుండి అవి సర్పిలాకారంలో మెలిదిరిగిన చీలికలతో కడ్డీ ఆకారములో అమర్చబడి వుంటాయి. దీని అడుగు భాగము పదునైన అంచులను ఏటవాలుగా 118॰ కోణములో వుండునట్లు యేర్పరచబడి యుంటుంది. బ్రేస్ కు తగిలించుకొను డ్రిల్ బిట్టు పటములో చూపబడింది.
అభ్యాసము
1. కర్రవస్తువుయందు రంధ్రములనుచేయు వివిధ పనిముట్లను పేర్కొనుము.
2. రాచెట్ బ్రేస్ పటమును గీచి దాని వివిధ భాగములను గుర్తించుము.
3. పండ్లచక్రపు బ్రేస్ పటమును గీచి, అది పనిచేయు విధానమును వివరించుము.
4. ట్విస్ట్ బిట్ కు మరియు కౌంటర్ సంక్ బిట్ కు మధ్యగల వ్యత్యాసములను వివరింపుము.
5. రెండు రకముల గిమ్ లెట్ ల పేర్లను పేర్కొని, వాటిలో యేదేని ఒకటి పనిచేయు విధానమును వివరింపుము.
No comments:
Post a Comment