అధ్యాయము —2
పుస్తకము కవరింగ్ మరియు ఫినిషింగ్
చేయుట
( Book Covering and Finishing )
మిారు క్రింది తరగతిలో పుస్తకము యొక్క కవరింగ్ విశిష్టతను, మరియు కవరింగ్ నకు వాడునటువంటి వివిధరకములైన వస్తువులను గురించియు, కవరింగ్ పద్ధతులను గురించియు తెలిసికొనియుంటిరి. తక్కువ ఖరీదుగల పుస్తకములను తీగకుట్టుతోగాని మూడు రంద్రముల కుట్టు పద్ధతితోగాని కుట్టి కాగితపు అట్టలను అంటించెదరు. లేదా గుడ్డతోగాని కవరింగ్ చేస్తారు. కొంచెము మన్నికగా వుండవలసిన పుస్తకాలకు అట్టలు అంటించి బౌండు చేస్తారు. ఖరీదునుబట్టి బౌండును కవరింగ్ చేస్తారు. అట్టి పద్ధతులలో క్వార్టరు బౌండు, హాఫ్ బౌండు, ఫుల్ బౌండు అనునవి ముఖ్యమైనవి.
కొన్ని సందర్భములలో అవసరమునుబట్టి పుస్తకముద్రణ మరియు కవర్ల ముద్రణ లేదా పుస్తక కేసులు తయారుచేయుట అనునవి వెంటవెంటనే జరుగును. పుస్తకము ముద్రణకాగానే కవర్లు లేదా కేసులు అతికించి అలస్యమును నివారించవచ్చును. కానీ ఈ పద్ధతిలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుటకు అవకాశముగలదు. అందుకని ఇబ్బందులను అధిగమించుటకు ముందుగా కొన్ని విషయములను తెలుసుకొనవలయును. అవి ఏవనగా (1) పుస్తకముమందము (2) పుస్తకము సైజు. ముద్రణకు ఉపయోగించునట్టి కాగితముతో ఒక ' మాదిరి ' పుస్తకమును నిర్ణయించిన కొలతలలో తయారుచేసుకోవాలి. ఏ పరిస్థితులలోను కాగితము మరియు పుస్తకపు కొలతలలో మార్పు రాకూడదు. మాదిరి పుస్తకమును మూడువైపులా కత్తిరించి, దానికి సరిపడే కేసును తయారుచేయాలి. మాదిరి పుస్తకము ఆధారముగా అట్టలను, కవరింగ్ గుడ్డలను, కావలసిన సంఖ్యలో ఒకేసారి కత్తిరించి కేసులు తయారుచేయాలి. ఈ లోపల పుస్తకములను తయారుచేసి ఎండ్ పేపర్లను అంటించి మూడు అంచులయందు కత్తిరించి, దానిని కేసులయందు బిగించెదరు. ఈ విధముగా చేయుటవలన పుస్తకములను వెంటవెంటనే మార్కెట్టులోనికి పంపవచ్చును. ఉదా :— డైరీలు, ప్లాస్టిక్ కేసులతో కవరు చేయబడిన వైద్య, ఇంజనీరింగ్ మరియు న్యాయశాస్ర్త పుస్తకములను ఈ విధంగా చేస్తారు.
కేసును తయారుచేయుట :—
కావలసిన వస్తువులు :—
(1) కవరింగ్ గుడ్డ / కేలికో / రెక్సిన్ / కేన్ వాస్
(2) స్ర్టాబోర్డులు లేదా గ్రేబోర్డు.
(3) పల్పు బోర్డు ( హాలోపీసు Hallow piece )
(4) గ్లూ ( Glue )
పనిముట్లు :— కత్తి, కత్తెర, ఫోల్డర్ , నిప్పింగ్ ప్రెస్ .
1,2. Straw boards
3. Hallow piece
4. Covering cloth
కవరింగ్ కు ఉపయోగించు గుడ్డను కావలసిన సైజుకన్నా 2 అం. పెద్దదిగా తీసుకొనవలయును. ఈ ఎక్కువ గుడ్డ కేసులోనికి మడచుటకు ఉపయోగింతురు. టేబుల్ మిాద కాగితమునువేసి, దానిపై కవరింగ్ గుడ్డను గరకువైపు పైకివచ్చులాగున వుంచవలెను. అట్టలను పెట్టవలసిన స్థలము మరియు
' ఫ్రెంచిగ్రూ ' స్థలమును సరిగా పెన్సిల్ తో గుర్తుపెట్టవలయును. పల్పుబోర్డును. పుస్తకము మందము మరియు పొడవునకు సరిపడేలా కత్తిరించు కొనవలెను. ఇది హాలో బ్యాక్ గా ఉపయోగపడును. కవరింగ్ వస్తువుపై ' గ్లూ ' ను పూయవలెను. పల్పుబోర్డును గుడ్డకు మధ్యలో వుంచవలెను. దీనికి రెండు, వైపులా పటములో చూపిన విధముగా అట్టలను 1/8 అం. సందును విడిచి. అంటించవలెను. దీనిని
ఫ్రెంచిగ్రూ అంటారు. కత్తెరతో కవరింగ్ గుడ్డ అంచులను అట్టకు 1/8" దూరము వుంచి 45 డిగ్రీలలో కత్తిరించవలెను. ఈ విధముగా చేయుటవలన కవరింగ్ గుడ్డ అంచులయందు ఎత్తుగా ముడి ఏర్పడదు. పైగా అంచులు కచ్చితముగా నుండును. ప్రస్తుతం కవరింగ్ వస్తువును మడచి అంటించవలెను. నాల్గువైపులా అంటించిన తరువాత దానిని ప్రెస్సింగ్ లో పెట్టాలి. ప్రస్తుతం కేసు తయారైనది.
కేసును ఫినిషింగ్ చేయుట :—
కేసుమిాద మరకలు లేకుండా తడిబట్టతో గాని స్పాంజితోగాని తుడవవలెను. తక్కువరకం కేసులు ఎక్కువ మొత్తంలో కావలెననిన, వాటిమిాద ముద్రించుతారు. కానీ ఈ ముద్రణ త్వరలోనే చెరిగిపోయి చూచుటకు బాగుండదు. ఖరీదైన కేసులమిాద ఎక్కువ కాలము మన్నికగా వుండుటకు బ్లాకింగ్ చేస్తారు. దీనిమిాద గోల్డ్ టూలింగ్ చేస్తే ఆకర్షణీయముగా వుండును. కేసులమిాద, పుస్తకముపేరు, గ్రంథకర్త, మోనోగ్రాము మరియు పబ్లిషర్ పేరు ఎంబోజింగ్ పద్ధతిలో ముద్రించెదరు. రకరకాల డిజైన్స్ తోను, బార్డర్స్ తోను కేసును అలంకరించెదరు. తోలును వాడినయెడల, కలరింగ్ , పాలిషింగ్ లేదా వార్నిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ పనిముట్లను ప్రత్యేకముగా ఇత్తడితో చేస్తారు. గోల్డింగ్ చేయవలసినచోట గ్లేయర్ ను పూస్తారు. దానిమిాద గోల్డింగ్ కాగితమునుపెట్టి, గోల్డు కాగితము వెనుక వేడిచేసిన పనిముట్టుతో అదుముతారు. గోల్డు కాగితము వేడికి కరిగి పుస్తకముపైన అంటుకొనును. ఈ పనిని చేయుటకు ఎంతో నైపుణ్యము కావలయును. వస్తువునుబట్టి పనిముట్లను వేడిచేసుకోవాలి. తక్కువ కాపీలను చేతితో చేస్తారు. ఎక్కువ కాపీలను ఎంబోజింగ్ మిషన్ సహాయమున చేస్తారు. ఈ యంత్రములో వేడిని వత్తిడిని కావలసిన రీతిలో వాడుకొనవచ్చును. ఒకసారి పూర్తి పేజీని అలంకరించవచ్చును.
ఫినిషింగ్ పనిముట్లు :
1. ఫిల్లెట్సు
2. ప్యాలెట్సు
3. రోల్సు
4. టైపుహోల్డరు
5. ఫినిషింగ్ ప్రెస్
6. ఫినిషింగ్ స్టౌ
7. గౌజస్
8. బార్డర్స్
9. టైపులు
10. బర్ నిషర్స్ మొదలగునవి
ప్రశ్నలు
1. కవరింగ్ చేయుటలో మాదిరి పుస్తకము ప్రాముఖ్యమేమి?
2. పుస్తకము కేసును తయారుచేయు విధనము వ్రాయుము?
3. ఫినిషింగ్ చేయుటకు కావలసిన పనిముట్లేవి?
అధ్యాయము —3
ఇండెక్స్ పుస్తకాలు తయారుచేయుట
ఇండెక్స్ ఆవశ్యకత :
పుస్తకములను ముఖ్యముగా వాడుకనుబట్టి రెండువిధములుగా విభజింపవచ్చును. అందు మొదటిది చదువుకొను పుస్తకములు. రెండవది వ్రాయుటకు ఉపయోగించు పుస్తకములు. మొదటిరకమును పుస్తకములో " విషయసూచిక " వలన మనకు కావలసిన అధ్యాయమును సులభముగా చూడగల్గు చున్నాము. రెండవరకము పుస్తకాలలో ముఖ్యమైనది అకౌంటు పుస్తకాలను తయారుచేయుట. ఖరీదునుబట్టి ఈ పుస్తకాలు వివిధ పద్ధతులలో తయారుచేస్తారు.
ఇండెక్స్ పుస్తకముయొక్క ఆవశ్యకత ఏమనగా, పెద్ద పెద్ద పుస్తకములలో, మనకు కావలసిన విషయముమగాని, వ్యక్తి పేరుగాని, అకౌంటు నంబరుగాని లేదా టెలిఫోన్ సంబరుగాని, పోస్టాఫీసులలో వివిధరకాల పిన్ కోడులను, తపాలాబిళ్ళలను, ఈ పద్ధతిద్వారా అతిసులభముగా, త్వరగా వెతుకుటకు వీలుకల్గును. ఇందువలన పుస్తకములో అవసరముగా కాగితములను త్రిప్పుట అందుమూలముగా జరుగు ఆలస్యము నివారించబడును. పుస్తకముయొక్క మన్నికకాలము కూడా పెరుగును.
ఇండెక్స్ విధానము ముఖ్యంగా మూడు పద్ధతులలో గలదు. అవి ఏవనగా (1) సింగిల్ లెటర్ ఇండెక్స్ (2) డబుల్ లెటర్ ఇండెక్స్ (3) కట్ త్రు ఇండెక్స్. ఇవి కాకుండా మరి రెండు పద్ధతులు గలవు. టేబ్ ఇండెక్స్ అనియు ఒవెల్ ఇండెక్స్ అనియు గలవు.
ఇండెక్స్ ను తయారుచేయుట :—
ఇంగ్లీషుభాషలోగాని, మరి ఏ ఇతర భాషలోనైనాగాని, వ్యక్తులపేర్లు కొన్ని అక్షరములతోనే ఎక్కువగా వాడబడతాయి. మిగిలిన అక్షరములు అప్పుడప్పుడు పదమునకు ముందుగా వాడబడతాయి. అందువలన అక్షరముల వాడుకనుబట్టి ఇండెక్స్ పుస్తకములో కాగితముల సంఖ్యను కేటాయించుకొనవలెను. కొన్ని అక్షరములతో పేర్లు సాధారణముగా వాడుకలోనికిరావు. అట్టి అక్షరములను, ఇండెక్స్ నందు వేరే అక్షరముతో కలుపుటగాని లేదా తీసివేయుటగాని చేయవలెను. ఉదాహరణకు ఆంగ్లభాషలోని 26 అక్షరములను వాడుక విధానమునుబట్టి ఇండెక్స్ స్కేల్ నందు 24 అక్షరములుగా చేయబడినది. అందువలన ఇండెక్స్ చేయవలసిన పుస్తకముయొక్క పొడవును కొలిచి, దానిని 24 సమభాగములుగా విభజించాలి. యిందుకుగాను ఒక పల్పుబోర్డును పుస్తకము పొడవునకు సరిపడునట్లుగా తీసుకొని, దానిని 24 సమభాగములుగా గుర్తించుకొని ఇండెక్స్ స్కేలును తయారుచేయాలి. ఈ ఇండెక్స్ స్కేలు పుస్తకము సైజునుబట్టి మరియు పద్ధతినిబట్టి మారుచుండును.
ఇండెక్స్ చేయవలసిన పుస్తకమును మూడు అంచులయందు కట్ చేయాలి ముందు అంచునందు పైన క్రిందివైపు 1/2 సెం.మిా. స్థలమును వదలి మధ్య దూరమును 24 సమభాగములుగా ఇండెక్స్ స్కేలు సహాయమున గుర్తించుకొనవలయును. పైనుండి ఒక్కొక్క అక్షరమునకు కేటాయించిన కాగితములను లెక్కించవలెను. చివరి కాగితము క్రింది ఒక పల్చటి రేకును వుంచవలెను. ఇండెక్స్ స్కేలు సహాయమున మొదటి అక్షరమును కాగితము పైన గుర్తించవలెను. తరువాత బ్లేడ్ సహాయమున, గుర్తు క్రిందిభాగము నుండి, 1 సెం.మిా. వెడల్పున, పుస్తకము క్రిందివరకు కత్తిరించవలయును. ఈ విధముగా చేసినందువలన ఆ అక్షరమునకు కేటాయించిన
కాగితములన్నియు ఒకే పద్ధతిలో నుండును. ఇండెక్స్ లెటర్ మాత్రము ముందుకు వచ్చి అగుపించును. ఈ విధముగా ఒక్కొక్క అక్షరమును దానికి కేటాయించిన
కాగితములను పైనతెల్పిన రీతిలో కత్తిరించవలయును. ప్రస్తుతం ఇండెక్స్ లెటర్ లన్నియు ఒకదాని క్రింద మరియొకటి మెట్లుమెట్లుగా అగుపించును. ఎరుపు, నలుపు రంగు సిరాతో అక్షరములను A నుండి Z వరకు మార్చిమార్చి రంగులలో అద్దవలెను. ఈ విధముగా సింగిల్ లెటర్ ఇండెక్స్ పుస్తకమును తయారుచేయాలి.
డబుల్ లెటర్ ఇండెక్స్ ( Double Letter Index ) :—
ఈ పద్ధతిని సాధారణముగా పుస్తకము పొట్టిగానున్నప్పుడు వాడుదురు. ఇందు 24 అక్షరములను 12 కాగితములలో సరిపెట్టుదురు. అనగా కాగితమునకు రెండు అక్షరములు కేటాయించుదురు. ప్రతి రెండు అక్షరములకు కేటాయించవలసిన కాగితముల సంఖ్యను ముందుగా నిర్ణయించుకొని, పైన తెల్పిన పద్ధతిలోనే ఇండెక్స్ ను తయారుచేసుకోవాలి.
కట్ త్రు ఇండెక్స్ ( Cut through Index ) :—
ఈ పద్ధతిని పైన తెల్పిన రెండురకాల పద్ధతులలోను చేయవచ్చును. కాని ఈ పద్ధతిని చేయుటవలన పుస్తకము అంచు బలహీనమగును. బైండింగ్ చేయుటకు అనువుగా వుండదు. పైన తెల్పిన రెండుపద్ధతులలో పుస్తకములోని కొన్ని కాగితములు మాత్రమే కత్తిరించబడును. కాని ఈ పద్ధతిలో ఇండెక్స్ స్కేలును వుపయోగించి పుస్తకములోని పై కాగితమునుండి చివరి కాగితపు చివరివరకు కత్తిరించుతారు. ఈ విధముగా చేసినందున కొన్ని కాగితములు ప్రత్యేకించిన అక్షరమునకు సరిపోకుండుట, మరికొన్ని అక్షరముల కాగితములు మిగిలి వృధా అయిపోవుట జరుగును. అందువలన ఈ పద్ధతిని వ్రాసుకొనే పుస్తకములకన్నా సేంపిల్ ను భద్రపరచు పుస్తకాలుగా వాడుకొనుట మంచిది.
ప్రశ్నలు
1. ఇండెక్స్ ఏ పుస్తకాలకు చేస్తారు? దాని ఉపయోగమేమి?
2. ఇండెక్స్ లోని రకములేవి?
3. సింగిల్ లెటర్ ఇండెక్స్ ను ఏ విధముగా చేస్తారు?
4. కట్ త్రు ఇండెక్స్ ఎట్లాచేస్తారు? దాని ఉపయోగమేమి?
5. ఇండెక్స్ స్కేలును తయారుచేయుటకు కావలసిన అంశము లేవి?
అధ్యాయము —4
పుస్తకములను అతికించుటకు వాడునట్టి
పదార్ధములు
బైండింగ్ పనులు చెయునప్పుడు వివిధరకములైన కాగితములను, అట్టలను వాడెదరు. కవరింగ్ నకు ఉపయోగించునట్టి గుడ్డ, క్యాలికో, క్యాన్ వాస్, రెక్సిన్ మరియు తోలు మొదలగువాటిని అంటించుటకు ఎన్నిరకములైన అతికించు పదార్ధములు గలవో తెలిసికొందాము.
పుస్తకములు అతికించు పదార్ధములు ముఖ్యముగా రెండు రకములు. (1) వృక్ష సంబంధమైన జిగురులు. (2) జంతు సంబంధమైన జిగురులు. ఈ రెండూ కాకుండా సింథటిక్ రెజిన్స్ అనునవి కూడా గలవు. వృక్ష సంబంధమైనవాటిలో బంక ( Gum ) మరియు పిండి పదార్ధములు గలవు. మైదాపిండి, జొన్నపిండి, గోధుమపిండి మొదలైనవి ఉడకపెట్టి వాడుదురు. దీనినే పేస్ట్ అని అంటారు. తోలును అతికించుటకు
పేస్ట్ ను వాడరాదు. వృక్ష సంబంధమైన జిగురులను కోల్డ్ అడ్ హెసివ్ లని కూడా అంటారు. పేస్టులో నీరు కలిపి వాడవచ్చును. దీనిని వేడిచేయనవసరములేదు. జంతు సంబంధమైన జిగురులలో గ్లూ ముఖ్యమైనది. వీటిని హాట్ అడ్ హెసివ్ లు అని అంటారు. వీటిని ఎముకలు తోలు మొదలగువాటినుండి కరిగించి తయారుచేస్తారు. దీనిని సన్నని ముక్కలుగా అమ్ముతారు. ఈ ముక్కలను పొడిగాచేసి, ప్రత్యేకమైన పాత్రలో నానబెట్టి వేడిచేస్తారు. వేడికి ద్రవము తయారగును. దానినే కరిగిన గ్లూ అంటారు. దీనిని వేడిగా నున్నప్పుడే ఉపయోగించాలి. గ్లూ పాత్రయందు రెండు గిన్నెలు ఒకదానిలో మరియొకటి గలవు. ఈ రెండింటి మధ్యన నీరు పోయవలయును. బయటి పాత్రను వేడిచేసిన, నీటి ద్వారా లోపలి పాత్రవేడిచెంది గ్లూ కరుగును. గ్లూను రెక్సిన్ , తోలు, అతికించుటకు ముఖ్యముగా వాడెదరు. గ్లూ పూసిన పుస్తకాలను ఎముకల బారినుండి కాపాడుటకు కొన్ని నివారణ పద్ధతులను తీసుకొనవలయును. గ్లూ పూసిన వెంటనే ఆరిపోవును. కాగితములు త్వరగా అతుకుకొనును. ఇది కాగితములోనికి ఇంకదు. కేవలము పైననే గట్టి పొరగా ఏర్పడి అతుకుకొనును. ఇది కరుగునప్పుడు వాసన వచ్చును. అందువలన సింథటిక్ రెజిన్స్ ను వేడిచేసి వాడుచున్నారు. దీనిని యంత్రముల ద్వారా అతికించుటకు ఎక్కువగా వాడెదరు.
పేస్టును తయారుచేయుట :—
దీనిని మైదాపిండి, గోధుమపిండి లేదా జొన్నపిండితో చేస్తారు. పిండిని ముందుగా నీటిలో కలుపవలయును. ఈ మిశ్రమమునందు క్రిమిసంహారక మందులు అయిన మైలుతుత్తము, పటిక పొడి కలుపుతారు. కాస్టిక్ షోడాను కూడా కొద్దిగా కలుపుకోవచ్చును. దీనివలన పేస్టు త్వరగా చెడిపోదు.
మిశ్రమమును పొయ్యిమీదపెట్టి వేడిచేయాలి. ఉండలు కట్టకుండా గురిటెతో కలుపుతుండాలి. కొద్దిసేపటికి పేస్టు తయారగును. చల్లారిన తరువాత కావలసిన పద్థతిలో నీరు కలుపుకొని వాడుకొనవచ్చును. ఈ విధముగా తయారైన పేస్టు ఒక వారంరోజులు చెడిపోకుండా వుండును. ప్రస్తుతం వాడుకకు సిద్ధంగాయున్న
పేస్టు లు పెద్ద డబ్బాలలో లభ్యమగుచున్నవి. పేస్టు వాడిన పుస్తకములపైన బొద్దింకలు, చిమ్మటలు, చదలు, ఇతర పురుగులు మొదలగునవి చేరి పేస్టునందలి పిండిపదార్ధమును తినుటకై ప్రయత్నించును. కాని క్రిమిసంహారక మందులవలన తిన్న వెంటనే అవి చనిపోవును. పేస్టు ను తోలును అంటించుటకు వాడిన దీనిలోని తడి త్వరగా ఆరిపోనందువలన తోలు చెడిపోవును. అందువలన పేస్టు వాడరాదు. సింథిటిక్ జిగురులు చల్లనీటిలో కూడా కలిసి వాడవచ్చును. కోల్డ్ అడ్ హెసివ్ లు తడిగావున్నప్పుడు అంటించిన వాటిని కదల్చరాదు. ఇది అతుకుకొనుటకు కొంత వ్యవధిపట్టును. అందువలన వీటిని యంత్రములలో వాడుటకు ఉపయోగించరు.
ప్రశ్నలు
1. కాగితములు అతికించుటకు వాడు పదార్ధములు ఎన్ని రకములు?
2. గ్లూ అనునది ఏ విధముగా ఏర్పడును?
3. గ్లూను వాడు విధమును తెల్పుము?
4. పేస్టు ను తయారుచేయు పద్థతి తెల్పుము?
5. సింథటిక్ జిగురుల ఉపయోగమేమి?
అధ్యాయము —5
బైండింగ్ సెక్షన్ అమరిక
( Planning the Binding Section )
కాగితపు ఉత్పత్తులను సాధారణముగా ఎన్నో రీతులలో రకరకముల పనుల కొరకు తయారుచేస్తారు. కావున పనిచేయు తీరులో కొన్ని మార్పులు ఉండును.
ఉదా :— చదువుకొను పుస్తకాల తయారీ మరియు వ్రాయు పుస్తకముల తయారీ విధములలోని స్వల్ప మార్పులు. కొన్ని పనులు రెండు రకాల పుస్తకాలకు ఒకే మాదిరిగా వుండును. పుస్తకాలు బైండింగ్ చేయునట్టి ఒక పెద్ద షాపులో జరుగుపనులు ఈ విధముగా నుండును. కాగితములు మడచుట, కుట్టుట, అట్టలు అతికించుట, అంచులు కత్తిరించుట, మ్యాపులు, చార్టులు అతికించుట, సర్వీస్ రిజిష్టరులు తయారుచేయుట, రూలింగ్ చేయుట, నంబరింగ్ చేయుట, పర్ఫొరేషన్ చేయుట, కౌంటింగ్ , గేదరింగ్, పేస్టింగ్ , గ్లూయింగ్ అనే రకరకాల పనులను చేయుచుందురు. కావున ఒక్కొక్క పనికి కావలసిన పరికరములు, ప్రత్యేక స్థలమును కేటాయించుకొనవలయును. కొంతభాగము చేసిన పనిని, ఏదో కారణముచేత ఆపవలసి వచ్చినప్పుడు, అట్టి పనిని భద్రపరచుటకొరకు మరికొంత స్థలము కావలసియుండును. అందువలన కొద్ది స్థలమును ఇందుకొరకు నిర్ణయించుకొనవలయును. ఫోల్డింగ్ అయిన కాగితములను కట్టలుగా కట్టి గేదరింగ్ పనిని సులభముగా చేయునట్లు చూచుకొనవలయును. పిన్నింగ్ చేయవలసిన పుస్తకములను వేరే కాపీలతో కలుపకుండా వుండునట్లు చూచుకోవాలి. కవరింగ్ , కట్టింగ్ చేయు స్థలమును కొంచెము పెద్దదిగా కేటాయించుకొనవలెను. పుస్తకాలు తారుమారగును.
బైడింగ్ యంత్రములు, పరికరములు వాటి ప్రాముఖ్యతనుబట్టి వాటిని స్థానములను కేటాయించవలెను. యంత్ర సామర్థ్యమునుబట్టి వాటి చుట్టూ ఖాళీ స్థలమును ఏర్పరచవలెను. ఎక్కువ అవసరపడ్డ యంత్రములను ఒక ప్రక్కగా వుంచవలెను. స్థలమును వృధాచేసికొనకూడదు. ఖాళీ స్థలములో వర్క్ బెంచీలను వేసి, పనిని గ్రూపులుగా విభజించి త్వరగా చేయించుట తెలుసుకొనవలెను. బరువుగల యంత్రములను క్రింది అంతస్థులోనే వుంచుకొనవలయును. స్థలముచాలని పరిస్థితులలో వున్నదానిలోనే అటకలుగా ఏర్పాటువేసుకొని తేలికపనులు అక్కడ జరిపించుకొనవలెను.
బైడింగ్ కు కావలసిన ముడిపదార్థములను చేరువలోనే ఏర్పరచు కొనవలయును. ముద్రించిన కాగితములనుగాని, తయారైన పుస్తకములను గాని డెలివరీ చేయుటకు ఎక్కువ దూరము తీసుకొనిపోకూడదు. ముద్రణ విభాగమునకు, బైడింగ్ విభాగము దగ్గరలోనే వుండవలయును. గదులకు గాలీ, వెలుతురు బాగుగారావలయును. ద్వారములకు అడ్డముగా ఏమీ వుంచరాదు. పేస్టు, గ్లూ లను దూరముగా వండి, లోనికి తెచ్చుకొనవలయును. అగ్ని ప్రమాదములు రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకొనవలయును. గదిని శుభ్రముగా నుంచుకొనవలయును. కాగితపుచెత్తను మూటగాకట్టి దూరముగా నుంచవలెను.
ప్రతిదినము చేయునట్టి పనులను, పుర్తిచేసిన పనులను రిజిష్టరునందు వివరముగా వ్రాసిపెట్టు కొనవలయును. పుర్తిచేసిన పనిని లెక్కించి, కట్టలుగా కుట్టి, రశీదు తీసుకొని బట్వాడ చేయవలయును. ప్రతిరోజు అయిన తరువాత, పనిముట్లు, పరికరములు లెక్కచూచుకొని శుభ్రపరచాలి. ఈ విధముగా బైడింగ్ సెక్షన్ ను ఏర్పరచుకొని ఏ ఇబ్బందీ లేకుండా పనులు చేసుకోవలెను.
ప్రశ్నలు
1. బైండింగ్ షాపులో చేయు వివిధ పనులను తెల్పుము?
2. బైండింగ్ షాపులో యంత్రములను ఏర్పాటు చేయునపుడు ఊహించవలసిన వీషయములేవి?
3. అగ్ని ప్రమాదములు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేవి?
No comments:
Post a Comment