అధ్యాయము— 1
పుస్తకముల బైండింగ్ ను గురించిన చరిత్ర మరియు దాని పరిచయము
పుస్తకములను బైండింగ్ చేయు వృత్తి అన్ని వృత్తులవలెనే ప్రసిద్ధి చెందిన చరిత్రగలది. ఈ వృత్తి ఎన్నో మార్పులు చెందుతూ నేటికిని అత్యంత ఆదరణ పొందుతున్నది. ప్రస్తుత ఆధునిక యంత్ర సాంకేతిక పద్ధతులకు అనువుగా కొన్ని బైండింగ్ పనులు చేయుచున్నారు. అందువలన అసంఖ్యాకముగా ముద్రించబడుచున్న వివిధ రకములైన పుస్తకములను స్వల్ప వ్యవధిలోనే పుస్తకములుగా బైండింగు చేయుట జరుగుచున్నది. మనము బైండింగు అనగా నేమిటో తెలుసుకొందాము. కాగితములను సక్రమముగా మడిచి, అనువుగా పుస్తకరూపములో కుట్టి, దళసరి అట్టలు వేసి భద్రపరచు విధానమని అర్థము.
పూర్వము పుస్తకములను కుట్టి వాటిని చెక్కలమధ్యన భద్రపరిచెడివారు. అటుతరువాత చెక్కలకు బదులుగా తోలును ఉపయోగించి పుస్తకములను భద్రపరచిరి. ఈ విధముగా బైండింగ్ పద్ధతులు మార్పు చెందుతూ, ప్రస్తుతం కాగితపు గుజ్జుతో చేసిన అట్టలను ఉపయోగించి బైండింగు చేయుట వాడుకలోనికి వచ్చినది. ఈ అట్టలను క్యాలికోతోగాని, రెక్సిన్ తోగాని లేదా తోలుతోగాని కవరు చేసి అలంకరించుచున్నారు.
మనము పుస్తకముల బైండింగ్ ఆవశ్యకత ఏ విధముగా ఏర్పడినదో తెలిసికొందాము. ' శిలాయుగమున ' ఏవిధముగా జీవించవలయునో తెలిసియుండలేదు. క్రమేణ ఆదిమానవుని జీవితములో కొన్ని మార్పులు ఏర్పడసాగెను. అతని మనోభావాలను చిత్రరూపములో, చెట్ల పైన, గుహగోడలపైన చిత్రించి, తన ఊహలను వ్యక్తపరచుకొనెను. అటుతరువాత కొన్ని శబ్దముల ద్వారా మాటలను నేర్చుకొనెను. ఆ విధముగా వారి భాషా పరిజ్ఞానము అపారముగా పెరిగిపోయెను. కావున వారి తెలివితేటలను వదిలపరచుటకు అనేక పద్ధతులను అన్వేషించిరి. అట్టి పద్ధతులలో ముఖ్యమైనవి వివిధరకములైన మట్టిబిళ్ళలను మరియు చెట్ల బెరడులపైన వ్రాసిన వాటిని భద్రముగా దాచుకొనిరి. మట్టి బిళ్ళలవలెనే మైనపు బిళ్ళలను కూడా తయారుచేసికొన్నట్లు ఆధారములుగలవు.
మట్టి బిళ్ళల వివిధ ఆకారములలో ముఖ్యమైనవి :
1. Oblong clay tablet 2. స్థూపాకారపు బిళ్ళ ( Cylindrical shape ) 3. పీపా ఆకారపు బిళ్ళ ( Barrel shape ) 4. షట్ భుజ ఆకారము ( Hexagonal clay tablet )
మరియు 5. అష్టభుజములుగల బిళ్ళలు ( Octagonal ) మొదలైనవి.
క్రీ.పూ. 3000 సం. క్రిందట ఈజిప్టు దేశములోని నైలునది ప్రవాహక లోయ ప్రాంతములలో పేపరస్ అనుచెట్టు అభివృద్ది చెందినది. ఆ చట్ల బెరడులు కాగితమును పోలియుండెడివి. అందువలన ఆ చెట్టు బెరడులను సన్నముగా తీసి ఒకదాని కొకటి కలిపి అతికించెడివారు. ఆ విధముగా ఎంతటి పొడవైన కాగితమునైనను తయారుచేసుకొనవచ్చును.
ఆ బెరడుయొక్క గరకు స్వభావమును వ్యూమిస్ అనెడి రాయితో రుద్ది నునుపుగా వ్రాయుటకు అనుకూలముగా తయారుచెసెడివారు. అటుపిమ్మట వృక్షసంబంధమైన వనరులను ఉపయోగించి, ప్రత్యేకమైన వ్రాతపుడకతో పేపరస్ పై వ్రాసెడివారు. పేపరస్ చుట్టల పై ( Scrolls ) ఒకవైపున అడ్డముగాను, నిలువుగాను వ్రాసి, చుట్టగా చుట్టెడి వారు
.ఈ పేపరస్ చుట్టకు రెండు అంచుల యందు కొయ్యపిడుగులను బిగించి, పట్టుకొనుటకు వసతిగా తయారుచేసినారు. ఈ విధముగా చేసిన పేపరస్ చుట్టలను తోలు తిత్తిలో పెట్టి భద్రపరచెడివారు. పేపరస్ చుట్టపైన వరుసగా వ్రాసిన వ్రాతలవలస విప్పి చదువుటకు కష్టముగా వుండెను. పైగా స్ర్కోలు త్వరగా చినిగిపోవుచుండెను. అందువలన విషయములను కాలమ్స్ గా వ్రాయుట వలన పై ఇబ్బందులు తొలిగినవి, పైగా చదువుకొనవలసిన విషయమును త్వరగా వెతుకుటకు సాధ్యపడేది.
ఈ పేపరస్ చుట్టలు దొరకనిచోట, పార్చ్ మెంటు ( Parchment ), వెల్లమ్ ( Vellum ) అను సన్నని జంతుసంబంధమైన తోళ్ళమిాద వ్రాసినారు. ఆ విధముగా ఒకేవైపున వ్రాసిన పత్రులను ( Zigzag ) పద్ధతులను ఆధారముగా చేసికొని పుస్తకములను తయారుచేయుట నేర్చుకొనిరి. చుట్టలుగా పేపరస్ ను వాడు పద్ధతికి బదులుగా, మడతలు వేసి రెండువైపులా వ్రాయు పద్ధతిని అనుసరించిరి. అట్లా కుట్టిన పుస్తకములను దళసరి అట్టలు వేసి బైండింగ్ చేసిరి. పుస్తకముల పై రకరకములైన నగిషీ ( Finishings ) పనులను, వెండి, బంగారు పూతలతో చేసిరి. దీనినే ( Gold Embosing ) అని అంటారు. అటుతరువాత రాజుల కాలములో రాజ్య చిహ్నములను ( Monograms ) పుస్తకముల పై ముద్రించిరి. పూర్వము పుస్తకములను వ్రాయుటకు తయారుచేయుటకు చాలా కష్టముగా నుండెడిది. కావున విలువైన పుస్తకాలను గ్రంథాలయములలో దొంగలింపకుండా పుస్తకములను సన్నని గొలుసుతో టేబుల్ నకు బిగించి భద్రపరచెడివారు.
పైన తెల్పిన పేపరస్ , పార్చ్ మెంటు, మరియు వెల్లమ్ అను వ్రాయుటకు ఉపయోగించు వస్తువులు దొరకని దేశాలలో వేరేవిధమైన వస్తువులను వ్రాయుటకు ఉపయోగించినారు. చైనాదేశస్తులు శిల్కు గుడ్డపైన, భారతీయులు, బర్మా దేశస్తులు తాళపత్రముల పైన వ్రాసి, వాటిని అట్టల మధ్యన భద్రపరచినారు. 12 వ శతాబ్దమునాటికే కాగితమును చేతితో తయారుచేసి వాణిజ్యపరముగా ఉపయోగించినట్లు ఆధారములు గలవు. అటుపిమ్మట 18వ శతాబ్ది అంతమునకు కాగితమును యంత్రములద్వారా చేయుట ఆరంభమైనది. కాగితముతో పుస్తకములు తయారుచేయుట పైన తెల్సుకొన్న పద్ధతులకన్నా తేలిక అయినది.
15 వ శతాబ్దములో అక్షరములనుకూర్చి ముద్రించు పద్ధతులు వచ్చినవి. అందువలన పుస్తకము సైజులోను, తయారుచేయు పద్ధతులలోను చాలా మార్పులు వచ్చినవి. పూర్వకాలపు పుస్తకముల తయారుచేయు విధానమునకుపోల్చి చూచిన, ప్రస్తుత పద్ధతులతో ఎంతో సులభముగాను త్వరగాను ( పుస్తకములను ) తయారుచేయవచ్చును. మరియు ఎన్ని పుస్తకములనైనా తక్కువధరలో , తక్కువ కాలములో చేయుటకు వీలుకల్గినది. పుస్తకాలు బైండింగ్ చేయుటకు రకరకములైన యంత్రములు తయారుచేసినారు. అట్టివాటిలో పేపరు కట్టింగ్ యంత్రము, సూయింగ్ యంత్రము మరియు యితర పరికరములు తయారుచేయుటవలన బైండింగ్ పనులు సులభముగా చేయుటకు వీలుకల్గినది. అందువలన బైండింగ్ పరిశ్రమకూడా ప్రింటింగ్ పరిశ్రమతోపాటు అభివృద్ధి చెందుచున్నది.
ప్రశ్నలు
1. పుస్తకములు బైండింగ్ చేయుట అనగానేమి?
2. పూర్వము ఆదిమానవుడు తన భావాలను ఏ విధముగా వ్యక్తపరచినాడు.
3. పెపరస్ ఎక్కడ దొరకును ? దానిని ఉపయోగించి స్ర్కోలును ఏ విధముగా తయారుచేస్తారు?
4. స్ర్కోలును వాడుటలో గల ఇబ్బందులేవి? వాటిని ఏ విధముగా అధిగమించిరి?
5. 15వ శతాబ్దము తరువాత బైండింగ్ లో వచ్చిన మార్పులేవి?
అధ్యాయము — 2
పుస్తకముల బైండింగ్ వర్గీకరణ పద్థతులు
పుస్తకముల బైండింగ్ చేయు పద్థతులను ముఖ్యంగా రెండు విధములుగా వర్గీకరించవచ్చును. అవి (1) లెటర్ ప్రెస్ బైండింగ్ (2) స్టేషనరీ బైండింగ్. పై రెండు విధములైన బైండింగ్ పద్థతులు ఒక్కొక్కదాని క్రింద నాల్గు ఉపభాగములుగా విభజింపబడి యూన్నవి. బైండింగ్ పనులు సులభముగా అర్థము చేసుకొనుట. అవసరమైన పద్థతిని అనుసరించుటకు ఆ విధముగా చేయబడినది. లెటర్ ప్రెస్ బైండింగ్ ను. చదువుకొను పుస్తకాలు తయారుచేయుటకు అనుసరించుదురు. స్టేషనరీ బైండింగ్ అనునది వ్రాసుకొను పుస్తకాలు తయారుచేయుటకు అనుసరించుదురు.
బైండింగ్ వర్గీకరణము
CLASSIFICATION OF BINDING
LEETTER PRESS BINDING
1. Extra Leather Binding
ప్రత్యేకమైన లెదర్ బైండింగ్
2. Liberary Binding
గ్రంథాలయ పుస్తకములకు చేయు బైండింగ్
3. Miscellancous Binding
వివిధ రకములైన పద్థతులతో బైండింగ్
4. Publishers Binding
పుస్తక ప్రచురణలకు చేయు బైండింగ్
STATIONARY BIND
1. Extra Account Book Binding
ప్రత్యేకమైన అకౌంటు పుస్తకాలు బైండింగ్
2. Manifold Books
రశీదు పుస్తకాలు బైండింగ్
3.Exercise Note Books
వ్రాసుకొను పుస్తకాలు ( నోట్సులు ) తయారు చేయుపద్థతి
4. General Office Stationory
సాధారణముగా ఆఫీసులలో వాడునట్టి పుస్తకాలు
LEETTER PRESS BINDING
1. Extra Leather Binding :
ప్రత్యేకముగా తోలు వేసి బైండింగ్ చేయు పద్థతి :
ఈ విధముగా తయారుచేయునటువంటి పుస్తకాలు చాలా ఖరీదు అయినవి. కావున తక్కువ పుస్తకాలు చేయుటకు పై పద్థతిని వాడుతారు. ఈ రకము పుస్తకాలు చేయుటకు యంత్రములను తక్కువగా ఉపయోగించుతారు. గట్టి దారము, అట్టలు మరీయు కవరింగుకు తోలు వాడుతారు. End papers గట్టివి వేస్తారు. పుస్తకము వెనుక వైపున గుండ్రముగా ( Rounding and Backing ) చేసి అట్టలు బిగించుతారు. పుస్తకము సులభముగా తెరుచు కొనుటకు, మధ్య కాగితములు కూడా పూర్తిగా చదువుటకు వసతిగా నుండుటకుగాను స్ర్పింగ్ బ్యాక్ లను ( spring Back ) తయారుచేసి బింగించుతారు. బైండింగ్ చెడిపోకుండా Dust Cover ను తయారుచేసి బింగించుతారు. ఈ విధముగా ఎన్నో ప్రత్యేక పద్థతులు ( Extra Operations ) చేసి పుస్తకాలను బైండింగ్ చేస్తారు. అందువలన దీనిని Extra Leather Binding అని అంటారు.
2. Liberary Binding
గ్రంథాలయ పుస్తకములకు బైండింగ్ చేయు పద్థతి :
పైన తెల్పిన పద్థతికన్నా ఈ పద్థతి కొంత తక్కువ రకము. కాని గ్రంథాలయములలో పుస్తకములలో పుస్తకములను ఎంతో మంది రకరకాలుగా వాడుదురు. కావున అటువంటి వాడుకమునకు తగినట్లుగా పుస్తకాలను ప్రత్యేకముగా తయారు చేయాలి. ఎన్నో పుస్తకాలను స్వల్పవ్యవధిలో చేయాలిగనుక యంత్రములను విరీవిగా వాడుదురు. ముఖ్యముగా గమనించవలసిన విషయమొమనగా, ఇట్టి బైండింగ్ చేయుటకు మంచి నాణ్యమైన వస్తువులను వాడవలెను. పుస్తకములు తయారుచేయుటకు అగునట్టి ఖర్చును తగ్గించవలెను.
3. Miscellancous Binding
వివిధ రకములైన బైండింగ్ పద్థతులు :
ఈ పద్థతిలో కొంత క్రొత్తదనము వుండవలెను. చూచుటకు అందము గాను, నాజూకుగాను వుండవలెను. ఇది చేయుటకు యంత్రములను వాడుదురు. ఈ పద్థతి పైన తెల్పిన పద్థతుల కన్నా తక్కువ ఖరీదగును. ఆకర్షణీయమైన కొత్త పద్థతులను అనుసరించుట దీని ప్రత్యేకత.
4. Publishers Binding
పుస్తక ప్రచురణలకు చేయు పద్థతి :
ఈ పద్థతి అన్ని బైండింగ్ పద్థతులకన్నా చాలా ముఖ్యమైనది. ఇది లాభసాటి అయిన పద్థతి. ఇందులో అన్ని పనులు యంత్రములసహాయమున అతితక్కువ వ్యవధిలో ఎక్కువ పుస్తకములను తయారుచేయుదురు. వీటికి అందమైన, ఆకర్షణీయమైన అట్టలు వేయుదురు. ఈ పుస్తకములు ఎక్కువ విలువ కల్గినవికావు. ఉదా :— నవలలు, మ్యాగజైన్ లు తదితర పుస్తకములు, వార పత్రికలు, పక్షపత్రికలు , పాఠ్యపుస్తకములు. ఈ పద్థతిని ఎడిషన్ ( Edition ) బైండింగ్ అని కూడా అంటారు.
STATIONERY BINDING
1. Extra Account Books :
దళసరి ఖాతా పుస్తకాలు చేయు పద్ధతి :
ఇది చాలా గట్టి రకమైన బైండింగ్ పద్ధతి. దీని తయారుచేయు పద్ధతులకు పైన తెల్పిన Letter Press Binding పద్ధతులకు చాలా తేడాగలదు. మంచిరకమైన కాగితముల పై రూలింగ్స్ చేసి గట్టి దారముతో కుట్టుతారు. పుస్తకపు అంచులకు లోహపు బిళ్ళలు బిగించుతారు. అందువలన అంచులు విరిగిపోవు. తాళమువేయు వసతి, ఇండెక్సు కాగితములు మొదలగు ఎన్నో క్రొత్త పద్ధతులు కలిపిచేయుదురు. అందువలన ఎక్కువ సమయము పట్టును. కాని చాలా కాలము దృఢముగా వుండును. ఈ పద్ధతిని వెల్లమ్ బైండింగ్ అనియు మరియు లెడ్జరు బైండింగ్ అనియుకూడా అంటారు.
2. Manifold Binding :
రశీదు పుస్తకాల తయారీ పద్ధతి :
ఈ పుస్తకాల తయారీలో కొన్ని ప్రత్యేక పద్ధతులు గలవు. ఇది చాలా చౌకరకము. యంత్రములు విరివిగా వాడుతారు. నంబరింగ్ మరియు perforation చేయుదురు. ఈ సన్నని వరుసరంధ్రములవలన కాగితము సులభముగా ఎంచుటకు వీలుకల్గును. ఉ :— చెక్కు పుస్తకాలు, రశీదు పుస్తకాలు వగైరా.
3. Exercise Note Books :
వ్రాసుకొను పుస్తకాలు ( నోట్సులు ) తయారుచేయు పద్ధతి :
ఈ రకపు పుస్తకాల తయారీ చాలా సులభమైన పద్ధతి మరియు తక్కువ ఖరీదైనది. కాగితముల పై గీతలు వేయుటకు Pen ruling మరియు Dise ruling అను యంత్రములను వాడుదురు. వీటి సహాయమున నిలువు గీతలు, అడ్డ గీతలు రకరకాల పద్ధతుల్లో వేయవచ్చును. ఒకేసారి రెండురంగుల గీయవచ్చును. కొన్ని యంత్రములలో రెండువైపులా ఒకేసారి రెండురంగుల గీతలు వేయవచ్చును. అట్లా గీతలు వేసిన కాగితములను మడిచి, తక్కువ ఖరీదైన కాగితపు అట్టవేసి యంత్రము సహాయమున కుట్టి పుస్తకము మూడువైపులా కత్తిరించుదురు. పైనతెల్పిన పద్ధతులన్నీ యంత్రముల సహాయమున ఎంతో తొందరగా చేయవచ్చును.
4. General Office stationery :
సాధారణముగా ఆఫీసులలో వాడు పుస్తకములు :
ఈ పద్ధతులకు పుస్తకములు తయారుచేయు పద్ధతులకు కొంత తేడా కలదు. ఉదా : Letter Head Pads, Tear Off Pads etc. ఈ పద్ధతిలో ( Writing pads ), సిరా అద్దుకొనే అట్టలు ( Blotting Pads ), కాగితపు బరువులు ( Paper Weights ), ఫైళ్ళు, కవర్లు మొదలైనవి.
ప్రశ్నలు
1. బైండింగ్ పనులను ఎన్ని విధములుగా వర్గీకరించినారు? అవి ఏవి?
2. లెటర్ ప్రెస్ బైండింగ్ లోని రకములు ఏవి? వాటిని తయారుచేయు పద్ధతులు తెల్పుము.
3. స్టేషనరీ బైండింగులోని రకములు ఏవి ? వానిని తయారుచేయు పద్ధతులులేవి?
అధ్యాయము —3
పుస్తకాలు బైండింగు చేయుటకు కావలసిన
పరికరములు
Book Binding Tools
బైండింగ్ పనులుచేయుటకు తగినటువంటి పరికరములు కావలయును. వీటిసహాయమున వివిధరకములైన పనులను సులువుగాచేయవచ్చును. ఈ పరికరములను వాడునప్పుడు తగుజాగ్రత్తలు పాటించవలెను. సరిఅయిన పరికరములను వాడుట మంచిపద్ధతి.
1. ఫోల్డర్ ( Folder ) :
దీనిని దంతముతో చేయుదురు. ఇది సుమారు 6 అంగుళముల పొడవు వుండును. దీనికి ఒకవైపున గుండ్రముగాను మరియొక వైపున ఏటవాలుగాను చేయబడియుండును. ఇది కాగితములను మడచుటకు ( అనగా మడిచిన కాగితము పై రుద్దుటకు ) మరియు అతికించునట్టి కాగితములు, గుడ్డ, వగైరాలపై రుద్దుటకు కూడా దీనిని వాడుదురు. ఈ ఫోల్డర్సు ప్లాస్టిక్ తోను, చెక్కతోను గూడా తయారుచేయుదురు.
2. సూదులు ( Needle ) :
వీటిని పుస్తకములను కుట్టుటకు ఉపయోగించెదరు. ఇవి దృఢముగా నుండి దారము పెట్టుటకు అనువైన రంధ్రము కలిగియుండవలెను.
3. కంఠాణి ( Bodkin ) :
వీటిని కాగితములపైనను, అట్టలపైనను రంధ్రములుచేయుటకు ఉపయోగింతురు. వీటిని ఇనుముతో తయారుచేయుదురు. వీటికి ఒకవైపున సన్నముగాను మరియు పదునుగానుండి, మరియొకవైపున చదరముగానుండును. వీటిని వాడునపుడు పుస్తకముక్రింద అట్టనుపెట్టవలెను లేనిచో టేబుల్ పై రంధ్రములుపడి టేబులు మరియు కంఠాణి చెడిపోవును. అందువలన దీనిని ఉపయోగించునపుడు జాగ్రత్త తీసుకొనవలెను. ఎక్కువకాగితములకు రంధ్రములు వేయునపుడు ఇనుపసుత్తి సహాయమున ఈ కంఠాణి పై కొట్టవలయును.
4. రంపము ( Tenonsaw ) :
పుస్తకములు కుట్టునపుడు సెక్షనుల వెనుకవైపున రంధ్రము చేయుటకు దీనిని ఉపయోగింతురు. అట్లా చేసినందువలన కుట్టుటకు సులభముగా నుండును.
5. కత్తి ( Knife ) :
మంచి పదునైన కత్తి కాగితములు, గుడ్డ, క్యాలికో టేపు మొదలగు వాటిని చించుటకు ఉపయోగపడును.
6. ప్యారియింగ్ కత్తి ( Paring Knife ) :
రకరకముల పద్నతులలో ప్యారియింగ్ కత్తులు దొరకును. వీటిని తోలు బైండింగ్ చేయునపుడు తోలు అంచులను సన్నబరచుటకు ఉపయోగింతురు.
7. నునుపురాయి ( Paring stone ) :
దీనిని తోలు అంచులు ప్యారియింగ్ కత్తి ద్వారా సన్న పరచునపుడు తోలు క్రింద ఆధారముగా పెట్టుకుందురు.
8. గరుకురాయి ( Oil Stone ) :
దీనిని కత్తులు పదును చేసుకొనుటకు వాడుదురు. దీనిని చెక్కపెట్టెలో బద్రపరచుదురు. దీనిపై కొన్ని చుక్కల నూనె వేసి కత్తులను పదునుచేయుదురు. ఇవి రెండు సైజులలో దొరకును.
9. బ్రష్ లు ( Brushes ) :
ఈ బ్రష్ లను ' పేస్టు ' పూయుటకు ' గ్లూ ' పూయుటకు వాడుదురు. పని అయిన వెంటనే వీటిని నీటిలో శుభ్రముగా కడిగి పదిలపరచవలెను.
10. కత్తెర ( Scissors ) :
కత్తెరతో క్యాలికో , తోలు, రెగ్ జీన్ మొదలైన వస్తువులను కత్తిరించుటకు వాడుదురు.
11. సుత్తి ( Hammer ):
రకరకముల ఇనుప సుత్తులను వివిధరకముల పనులకు వాడుదురు. ఉ:— పుస్తకాలు Rounding and Backing చేయుటకు మరియు కాగితములపై Bodkin తో రంధ్రములు వేయునపుడు కొట్టుటకు వాడెదరు.
12. మూల మట్టము ( Straight edge ) :
దీనిని నేరుగా గీతలు గీయుటకు మరియు కాగితములు మొదలగునవి వంకరలేకుండా కత్తిరించుటకు సహాయకారిగా ఉపయోగింతురు.
13. నాకింగ్ డౌన్ ఐరన్ ( Knocking down iron ) :
ఇది 8 x 4 అం. ల సైజుగల ఇనుపదిమ్మె. దీనిని పుస్తకములు కుట్టునపుడు Sections level గా తట్టుటకు ఉపయోగింతురు.
14. బాక్సింగ్ బోర్డ్స్ ( Backing Boards ) :
ఇవి ఏటవాలుగా నుండు చెక్కలు. వీటిని Saw cuts చేయునప్పుడు, మరియు పుస్తకము వెనుకభాగమును గుండ్రముగా చేయునప్పుడు పుస్తకమునకు రెండువైపులా ఆధారముగా వుంచుదురు.
15. ప్రెస్సింగ్ బోర్డ్స్ ( Pressing Boards ) :
ఇవి నునుపైన అల్యూమినియమ్ తో చేయబడ్డ ప్లేట్లు . ఇవి 10" x 12" సైజులో వుండును. పుస్తకాలను అదుముటకు ముందు ఈ అట్టలను పైన క్రిందపెట్టుదురు. అందువలన పుస్తకములపై ఎలాంటి గుర్తులుగాని మరకలుగాని పడవు.
16. గ్లూ కెటిల్ ( Glue Kettle ) :
ఇవి రెండుపాత్రలు ఒకదానిలో నొకటి అమర్చబడి యుండును. ఆ రెండు పాత్రలమధ్య నీటిని నింపుదురు. లోపలిపాత్రలో ' గ్లూ ' ముక్కలను పొడిచేసి నీటిలో కలుపుతారు. బయటి పాత్రను వేడిచేయుదురు. కాబట్టి లోని పాత్ర కూడా మధ్య నీటిద్వారా వేడి చెందెను. ఈ విధముగా చేసినందున ' గ్లూ ' మాడకుండా వుండును. మరియు గట్టిగా కరచుకొను గుణములు కలిగియుండును.
17. ప్లయర్లు ( Pliers ) :
ఇవి ఒకరకమైన కత్తెరలు. వీటికి పొడవైన దవడలు ( Jaws ) కలిగియుండును. వీటి సహాయమున తీగలు వంచుట మరియు త్రుంచుటకు ఉపయోగపడును.
18. పంచ్ లు ( Punches ) :
ఇవి రంధ్రములు చేయుటకు ఉపయోగించు ఇనుప పనిముట్లు . ఇవి వివిధ సైజులలో దొరకును. ఇవి పదునుగ నుండును. వీటిని ఆఫీసు ఫైళ్ళు ( Files ), ఫోటోఆల్బమ్ లను చేయునప్పుడు రంధ్రములు చేయుటకు ఉపయోగింతురు.
eg :- Round punch , slit punch and T — shape punch.
19. ఉలి ( Chisel ) :
ఇవి పదునైన ఇనుప పనిముట్టు. అట్టలపైన చతురస్రాకారపు రంధ్రములు చేయుటకు దీనిని ఉపయోగింతురు.
20. మైదా గిన్నెలు ( Paste vessels ) :
ఇవి ప్లాస్టిక్ లేదా పింగాణి పూత పూసిన ఇనుప గిన్నెలు. వీటిలో గట్టి Paste , పల్చటి Paste ను వేరు వేరుగా కలిపి ఉంచుదురు.
మెరుగుపెట్టు పనిముట్లు ( Finishing Tools ) :—
సాధారణముగా విలువైన పుస్తకాలు బైండింగ్ చేయునప్పుడు, వాటిని చివరిదశలో అనగా, అట్ట వేయుట, కవరింగ్ చేయుట అనుపనులు అయిన తరువాత, అట్టి బైండింగ్
పుస్తకమునకు మెరుగులు పెట్టుపనిని చేయుదురు. అట్లా చేసినందువలన పుస్తకముయొక్క బైండింగ్ ఆకర్షణీయముగా వుండును. కాని ఈ చివరిదశలో ఎలాంటి పొరపాటు జరిగినను అది పుస్తకముయొక్క స్వరూపమును చెడగొట్టును. అందువలన ఈ మెరుగుపెట్టు పనిని అతి జాగ్రత్తగా చేయవలయును. అట్లాగే ఈ మెరుగుపెట్టుటకు ఉపయోగించు పనిముట్లను సరిగా సక్రమపద్ధతిలో వాడుకొనవలయును. పుస్తకముల మెరుగుపెట్టుటకు ఉపయోగించు పరికరములన్నియూ ఇత్తడి లోహముతో చేయబడినవి. ఈ పరికరములను వేడిచేసి వాడవలయును. వీటికి ఉపయోగించుటకు తగిన Handles వుండును. అట్టి పరికరములలో ముఖ్యమైనవి ఈ దిగువన తెలుపబడినవి.