ఉపోద్ఝాతము:
కర్ర సామాగ్రిని తయారుచేయుటకు గాను పెద్ద సైజుగల కర్రవస్తువులను ఖండిచి చిన్నముక్కలుగా చేయుటకు లేదా వాటికి వివిధ ఆకారములను తెచ్చుటకు ఉపయోగపడు పనిముట్లను 'ఖండిచెడి పనిముట్లు' (cutting tools) అని అంటారు. కర్రసామాగ్రిని తయారుచేయు పనియందు యుందుకుగాను ఉపయోగపడెడి పనిముట్లను రెండురకములుగావిభజించవచ్చు.
1. ఱంపము (saw) 2. ఉలి (chiesl)
ఈ రెండురకముల పనిముట్లు వస్తువులను ఖండించెడి విధానములోను, మరియు వాటినుపయోగించెడి పధ్ధతిలోను భేదములున్నాయు. ఈ పనిముట్లను గురించి వివరముగా తెలుసుకుందాము.
1. ఱంపము :
ఇది కర్ర వస్తువులను కోసి రెండు భాగములుగా విడదీయుటకు మరియు కావలసిన ఆకారములలో కోయుటకు వుపయోగపడుతుంది. ఇది స్ర్పింగుదనమును కలిగిన ఉక్కుతో చేయబడిన సన్నని రేకుఆకారపు బ్లేడును కలిగి యుంటుంది. స్ర్పింగుదనమును కలిగియుండుట మూలముగా భ్లేడును కొద్దిగా,ప్రక్కలకు వంచినను అది విరగకుండా వుండును. బ్లేడు ఒక ప్రక్కగా కర్రతో చేసిన హాండిల్ ( పిడి )కు రివెట్ల ద్వారా లేదా స్ర్కూల ద్వారా బిగింపబడి వుంటుంది. బ్లేడు పొడవైన అడుగుభాగపు అంచు వరసగా అమర్చిన పదునైన మొనలతో కూడిన 'పండ్లను' కలిగియుంటుంది. వీటినే 'ఱంపపు పండ్లు' అంటారు. ఇవి V—ఆకారమును కలిగియుంటాయి. ఱంపముబ్లేడు పండ్లు కర్రపలకపై ఆనించి వాటి పదునైన మొనలు ముందునకు సాగునట్లు తోసినపుడు, అవి కర్రను క్రమక్రమంగా ఖండిస్తూకోసివేస్తాయి ఱంపముబ్లేడు పండ్లు ఒకదానిని విడిచి ఇంకొకటి కుడి, ఎడమ వైపులకు వంపబడియుంటాయి. దీనివలన బ్లేడు పండ్లు కర్ర వస్తువును ఖండించినపుడు యేర్పడు సన్నని చీలికగుండా బ్లేడు మిగిలినభాగము యేవిధమైన రాపిడి లేకుండా సులభముగా పయనిస్తుంది. ఇందుకు కారణము రెండు వైపులా కొద్దిగా వంగిన పండ్ల మూలముగా ఱంపము బ్లేడు కర్రవస్తువును ఖండించినపుడు యేర్పడెడి చీలిక, బ్లేడు మందము కన్నా కొద్దిగా ఎక్కువ మందమును కలిగియుండుటయే!
బ్లేడు ముందుభాగమును 'టో'(toe) అనీ, హాండిల్ బిగించిన వెనుకభాగమును హీల్ (Heel) అనీ పిలుస్తారు. ఱంపము యొక్క సైజును దాని బ్లేడు పొడవును బట్టి నిర్ణయిస్తారు. ఉదాహరణకు 650 మి.మీ. సైజు గల ఱంపము బ్లేడు పొడవు 650 మి.మీ. వుంటుంది. ఱంపము పొడవు మరియు ఆకారములు పలురకములుగా వున్నాయి. కర్రసామాగ్రిని తయారుచేయు పనియందు ఉపయోగపడు వివిధ రకముల ఱంపములను గురించి క్రింద వివరించనైనది.
ఉపయోగించు విధానమునుబట్టి ఱంపమును రెండు రకములుగా విభజించవచ్చును.
(1)ముందుకు నెట్టబడెడి ఱంపములు (push saws) :- వీటిని కర్రవస్తువుపై ముందుకు నెట్టుట ద్వారా కర్ర కోయబడుతుంది. ఱంపమును వెనుకకు లాగినపుడు ఱంపము పండ్లు కర్ర వస్తువునకు తగలకుండాయుండునట్లు కొద్దిగా పైకిలేపాలి. తిరిగి ఱంపమును ముందుకు నెట్టినపుడు వస్తువుపై ఱంపము పండ్లను నొక్కిపెడ్తూ ముందుకు నెట్టుచు కర్రను కోయవలసి వుంటుంది. ఈ రకపు ఱంపములో బ్లేడుకుగల పండ్లు ముందు వైపుకు తిరిగిన పదునైన మొనలను కలిగివుంటాయి. కాబట్టి కర్రను కోయుటకుగాను ఈ ఱంపమును ముందుదిశలో మాత్రమే ఉపయోగించాలి.
(2) వెనుకకు లాగెడి ఱంపములు (Draw saws) :-
ఈ ఱంపము యెక్క పండ్లు కొద్దిగా వెనుకవైపుకు తిరిగిన పదునైన మొనలను కలిగి యుంటాయి. ఱంపము వెనుకకు (అనగా హాండిల్ వైపునకు) లాగినపుడు కర్రవస్తువుపై బ్లేడుపండ్లను నొక్కిపెట్టి వుంచాలి.దీనివలన ఱంపము వెనుకకు పయనించునపుడు కర్రవస్తువు కోయబడుతుంది. తిరిగి ఱంపమును ముందుకు నెట్టినపుడు బ్లేడును కర్రవస్తువునుండి కొద్దిగా పైకిలేపి ఎక్కువ బలము నుపయోగించకుండా పయనింపజేయాలి.
పై రెండురకముల ఱంపములు వాడుకలో నున్నాయి. కనుక బ్లేడును ఉపయోగించుటకు ముందు దాని పండ్లు ఏ దిశలో తిరిగియున్న పదునైన మొనలను కలిగియున్నది గమనించుకొనాలి. తప్పు దిశలో బ్లేడును కదిలిస్తూ కర్రవస్తువునుకోయుటకు ప్రయత్నించినయెడల కర్రవస్తువు కోయబడకుండా వుండుటయేకాక, ఱంపముపండ్లు దెబ్బతినిపోవచ్చును.
1. చేతి ఱంపము ( Hand saw ) :-
దీనినే 'క్రాస్ కట్ ఱంపము ' ( cross cut saw ) అనికూడా అంటారు. అనగా 'అడ్డముగా కోసెడి ఱంపము అని అర్థము. దీనికి కారణము కర్రవస్తువులో కణములు ( Grains ) అమర్చబడిన దిశకు అడ్డముగా కర్రను కోయుటకు ఇది ఉపయోగపడుతుంది. అయితే కణములు అమర్చబడినదిశలో మరియు ఇతరదిశలలో కూడా ఇది కర్రను కోయుటకు ఉపకరిస్తుంది. దీని బ్లేడు పొడవు 500 నుంచి 650 మి. మీ. వరకు వివిధ సైజులలో లభ్యమగుతుంది. బ్లేడు మందము 1 గేజి వుంటుంది. దీని పండ్లు పటము 4.3 లో చూపిన మాదిరిగా అమర్చబడి చాకు మొనలాంటి పదునైన మొనలను కలిగావుంటాయి. దీనిచే కర్రవస్తువును కోయునపుడు వాడియైన మొనలచే ఖండింపబడిన భాగము మొనల మధ్య ఖాళీస్థలములో నొక్కబడి చూర్ణంగా మారుతుంది. దీని బ్లేడు 100 మి.మీ. పొడవులో 20 నుండి 48 వరకు పండ్లను కలిగియుంటుంది.
2. రిప్ ఱంపము ( Rip saw ) :-
ఈ ఱంపము కర్రవస్తువుయందు కణములు అమర్చబడిన దిశలో మాత్రమే కర్రను కోయగలుగుతుంది. దీనిపండ్లు ఉలి ( Chisel ) కి గల పదునైన వస్తువును ఖండించెడి అంచు లాగా కొద్ది మందముతో అమర్చబడివుంటాయి. వరసగా బ్లేడు అమర్చబడిన ఈ పండ్లు వరుసగా అమర్చబడిన అనేక ఉలుల యొక్క పదునైన అంచులలాగా పనిచేసి కర్రవస్తువును ఖండిస్తాయి. బ్లేడును ముందునకు కదిల్చినపుడు ఒక కదలికలో ఎక్కువ మొత్తములో కర్రను ఖండించుటకు యిది ఉపయోగపడుతుంది. దీని బ్లేడు వెడల్పు ముందువైపు తక్కువగా (సుమారు 8 సెం. మి. ), హాండిల్ వైపు ఎక్కువగా (సుమారు 16 సెం.మి. ) వుంటుంది. ఇది 650 నుండి 750 మి.మీ. వరకు వివిధ సైజులలో లభ్యమగుతుంది. 100 మి.మీ. బ్లేడు పొడవులో ముందువైపు 24 నుండి 32 వరకు, హాండిల్ వైపు 12 నుండి 15 వరకు పండ్లను కలిగియుంటుంది
3. పానెల్ ఱంపము ( Panel saw ) :-
ఇది క్రాస్ ఱంపము ఆకారములోనేయుండి, అదేవిధంగా పనిచేస్తుంది. అయితే దీని బ్లేడు క్రాస్కట్ ఱంపము బ్లేడుకన్నా తక్కువ మందమును (22 గేజి ) కలిగియుంటుంది. దీని పొడవు 350 నుండి 600మి.మీ. వరకు వివిధ సైజులలో వుండి , 100 మి.మీ. బ్లేడు పొడవులో 32 నుండి 48 వరకు పండ్లను కలిగివుంటుంది. కర్రవస్తువును సూచించిన కొలతల ప్రకారము ఖచ్చితంగా కోయుటకు ఇది పనికివస్తుంది. కర్రవస్తువును రెండు భాగములుగా చీల్చుటకు మరియు కణములు అమర్చబడిన దిశకు అడ్డముగా కోయుటకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
4. టెనన్ ఱంపము ( Tenon saw ) :-
ఇది కూడా చేతిఱంపమువలె పండ్లను కలిగియుండి కర్రవస్తువులో కణములు అమర్చబడిన దిశకు అడ్డముగా కోయుటకు వాడబడుతుంది. దీని బ్లేడు తక్కువ మందమును ( 22 గేజి ) కలిగియుండి, దీని పండ్లు సమబాహు త్రిభుజాకారములో 60॰ కోణమునుగలిగిన పదునైన మొనలను కలిగియుంటాయి. కర్రవస్తువును మృదువుగా కోయుటకు యిది నుపయోగించినపుడు బ్లేడు ప్రక్కలకు వంగిపోకుండా దృఢంగా నిలబడి యుండుటకుగాను బ్లేడు పై భాగమున కర్రచేగాని, లోహముతోగాని చేయబడిన ఆధారపు చట్రము ( Frame ) అమర్చబడి యుంటుంది. ఱంపపుపండ్లకు వెనుకవైపున ఆధారము కల్పింపబడినది కావున దీనిని 'బ్యాక్ ఱంపము' ( Back saw ) అని పిలుస్తారు. ఇది 200 నుండి 450 మి.మీ. వరకు పొడవుతో వివిధ సైజులు లభ్యమగుతుంది. 100 మి.మీ. బ్లేడు పొడవులో 40 నుండి 60 వరకు పండ్లను కలిగియుంటుంది.
5. డవ్ టెయిల్ ఱంపము ( Dove tail saw ) :-
ఇది కూడ టెనస్ ఱంపము వలె యుంటుంది. అయితే ఇది తక్కువ పొడవుతో ( 150 నుండి 300 మి.మీ. వరకు వివిధ సైజులలో ) చిన్నసైజులో వుండి దీని హాండిల్ తెరుచుకొని వుంటుంది. ఇది కర్రవస్తువును అతి మృదువుగా కోయుటకు, సన్నని చీలికలను యేర్పరుచుటకు మరియు డవ్ టెయిల్ లను ఏర్పరిచి కర్రవస్తు భాగములను కలుపుకొనుటకు వుపయోగపడుతుంది. బ్లేడు మందము 22 గేజితో అతి తక్కువగా యుండి 100 మి.మీ. పొడవు గల బ్లేడు యందు 40 నుండి 60 వరకు పండ్లు యేర్పరచబడి వుంటాయి.
6. విల్లు ఆకారపు ఱంపము ( Bow saw ) :-
దీనిని ' బౌ ఱంపము ' అని అంటారు ఇది
వెడల్పు తక్కువుగా యున్న బ్లేడును కలిగియుంటుంది. సాధారణంగా దీని బ్లేడు 3 మి. మీ. నుండి 12.5 మి.మీ. వరకు వెడల్పును 200 నుండి 250 మి.మీ. వరకు పొడవును కలిగియుంటుంది. దీనికి ముందు మరియు వెనుక భాగములలో కర్రతో చేయబడిన రెండు హాండిల్ లు బిగింపబడి వుంటాయి. అంతే కాకుండా బ్లేడుకు రెండు వైపులా కర్రతో చేయబడిన రెండు కడ్డీలు నిలువుగా అమర్చబడి ఆ రెండింటినీ కలుపుతూ బ్లేడు పొడవుకు సమాంతరముగా
కర్రతో చేసిన అడ్డు కమ్మీ ఒకటి బ్లేడుకు పై భాగమున కొద్ది దూరములో అమర్చబడి యుంటుంది. ఈ అడ్డు కమ్మీ కి మధ్యభాగములోగల ఒక చీలికలో మరియొక నిలువు కడ్డీ అమర్చబడియుంటుంది. అడ్డు కమ్మీకి సమాంతరముగా దానికి పై భాగమున కొద్ది దూరాములో బ్లేడు ముందు, వెనుక భాగములలో అమర్చబడిన నిలువుకడ్డీలను కలుపుతూ దారము బిగింపబడి యుంటుంది. ఈ దారము పొడవు సుమారు 3 మీటర్ల దాకా యుండి అది వదులుగా వుండకుండా బిగుతుగా యుండుటకుగాను మధ్యలోగల నిలువుకడ్డీకి చుట్టబడి యుంటుంది. బ్లేడును గట్టిగా బిగించడానికి మధ్యలో గల నిలువుకడ్డీని చేతితో గుండ్రముగా త్రిప్పుకొని దారమును దానిచుట్టూ చుట్టుకొనవలసిన యుంటుంది. నిలువుకడ్డీ అడ్డుకమ్మీకిగల చీలికలో సులభంగా తిరుగుటవలన యిది సాధ్యపడి బ్లేడు తగినంత బిగుతుదనమును కొద్దిగా తగ్గించుకొనుట ద్వారా దీనినయోగించి కొద్దిగా వంపుకలిగిన దిశలలో కర్రవస్తువును కోయవచ్చును.
7. కంపాస్ ఱంపము ( Compass saw ) :-
దీనినే ' టర్నింగ్ ' ( Turning saw ) ఱంపము అని అంటారు. దీని బ్లేడు కూడ తక్కువ వెడల్పును కలిగియుంటుంది. ఇది 250 నుండి 400 మి.మీ. పొడవుతో కోసుగా వుండి హాండిల్ వైపు ఎక్కువ వెడల్పును, బ్లేడు ముందు వైపు తక్కువ వెడల్పును కలిగి యుంటుంది. ఇది 250 నుండి 400 మి.మీ. పొడవుతో కోసుగా వుండి హాండిల్ వైపు ఎక్కువ వెడల్పును, బ్లేడు ముందు వైపు తక్కువ వెడల్పును కలిగియుండునట్లుగా చేయబడియుంటుంది. ఈ ఱంపము రెండు రకములుగా లభ్యమగుతుంది. మొదటిరకపు కంపాస్ ఱంపముయందు బ్లేడు వెనుక భాగము హాండిల్ నకు స్ధిరంగా బిగింపబడి యుంటుంది. రెండవరకము కంపాస్ ఱంపము మూడు వివిధ సైజుల బ్లేడును కలిగియుండి, వాటికి అవసరమైన బ్లేడును హాండిల్ కు తగిలించుకొను సదుపాయమును కలిగియుంటుంది. హాండిల్ కు అమర్చిన ఒక స్క్రూను వదులు చేసుకొని కావలసిన బ్లేడును దీనిలో అమర్చికొని తిరిగి స్క్రూను బిగింపబడుతుంది. దీనితో కూడ వంపుదిరిగిన దిశలో కర్రవస్తువులను కోయుటకు వీలుంటుంది.
8. కోపింగ్ ఱంపము (Coping saw ) :-
ఇది తక్కువ మందము మరియు తక్కువ వెడల్పుగల బ్లేడును కలిగియుండి అది ఇనుప చట్రములో ఒక మీట ద్వారా బిగింపబడి యుంటుంది. బ్లేడు పండ్ల వెనుకవైపున ( అనగా హాండిల్ వైపు ) తిరిగి యుంటాయి. హాండిల్ ను గుండ్రముగా త్రిప్పుకొనుట ద్వారా బ్లేడు బిగువుదనమును సరిచేసుకొనవచ్చును. తక్కువ వ్యాసముగల చిన్న వంపు దిరిగిన చాపముల దిశలో కర్రవస్తువును కోయుటకు యిది పనికివస్తుంది.
9. కీరంధ్రములను చేయుఱంపము ( key hole or pad hole saw):-
వస్తువుపై సన్నని ' కీ ' రంధ్రములు ( చీలికలు ) చేయుటకు ఈ ఱంపము పనికివస్తుంది. ఇది చిన్నగా సుమారు 250 మి.మీ. పొడవును కలిగియుంటుంది. దీని బ్లేడు కోసుగా చేయబడియుంటుంది. హండిల్ యందు చీలికలో బ్లేడు బిగింపబడియుంటుంది. బ్లేడును వుపయోగించినపుడు దీనిని హాండిల్ నుండి బయటకు తీయవచ్చును.
ఱంపమును ఉపయోగించువిధానము :
ఱంపమును సరిగా ఉపయోగించని యెడల దాని బ్లేడు విరిగిపోవుట లేదా ఱంపముపండ్లు దెబ్బతినిపోవుట జరగవచ్చును. అంతే కాకుండా కర్రవస్తువును సరియైన దిశలో కోయుట సాధ్యపడదు. ఱంపమును సరిగా వుపయోగించు విధానము క్రింది వివరింపబడింది.
( 1 ) ఱంపమును చేతితో పట్టుకొన్నపుడు చూపుడు వ్రేలు ( Fist finger ) ముందువైపునకు సూచిస్తూ వుండాలి. దీనివలన ఱంపముతో వస్తువును కోయుటను కావలసిన రీతిలో క్రమబద్దము చేసుకొనుటకు సాధ్యపడుతుంది.
( 2 ) వస్తువు కొలతకన్నా కొద్దిగా ఎక్కువ కొలతలను కలిగియుండునట్లుగా ఱంపముతో కోయాలి. కావలసినదానికన్నా ఎక్కువగా యున్న కొద్ది భాగము ' ప్లేన్ ' నుపయోగించి చదును చేయునపుడు తొలగించబడుతుంది.
( 3 ) ఱంపము ముందునకు నెట్టునపుడు పయనించెడి దూరమును ' స్ర్టోక్ ' ( Stroke ) అంటారు. ఱంపము పై తక్కువ ఒత్తిడిని కలుగచేస్తూ ఱంపము కదిలెడి స్ర్టోక్ పొడవుగా వుండునట్లుగా ఱంపముతో కర్రవస్తువును కోయాలి.
( 4 ) ఱంపము ఉపయోగించుటకు ముందు ఱంపము పండ్లు పదునుగా ఉన్నాయా లేదా అన్నది పరీక్షించుకొనాలి. పదును లేనియెడల వాటిని పదును పెట్టుకొనాలి.
( 5 ) పని ప్రారంభించుటకు ముందు ఱంపము బ్లేడు కర్ర ఉపరితలము చేయు కోణము తక్కువగా వుండును. ఱంపమును పట్టుకొనాలి. ఎడమచేతి బొటన వ్రేలికి ఱంపము బ్లేడును నొక్కి పెడుతూ, ఱంపము బ్లేడు ప్రక్కలకు కదలకుండా తిన్నగా సాగును ముందు నెమ్మదిగా కర్రను కోయాలి. ముందుగా తేలిక స్ట్రోక్ లతో కొద్దిగా కోయుటద్వారా కర్ర యందు చీలిక యేర్పరచాలి. పిదప పొడవైన స్ట్రోక్ లతో కర్రను వేగంగా కోయవచ్చును.
ఱంపమును పదును పెట్టుకొనుట :
ఱంపమును ఉపయోగించిన కొంతకాలమునకు దానిపండ్లు అరిగిపోయి పదును కోల్పొనవచ్చును. అప్పుడు ఱంపమముతో కర్రను కోయుపని సరిగా జరగదు. ఱంపము పండ్లను పదునుపెట్టుకొని మరల కోతను సాగించాలి. ఱంపము పండ్లను పదును పెట్టుకొనెడి విధానము క్రింద వివరించనైనది.
1. ముందుగా ఱంపము బ్లేడు పండ్లు పైకి యుండునట్లుగా బ్లేడు తలక్రిందుగా ' వైస్ ' పైన బిగించాలి. అయాతే వైస్ లో బ్లేడు వదులుగా వుండరాదు. వదులుగా బిగించిన బ్లేడును పదును పెట్టిన యెడల అది పదునైన మొనలు కలిగిన పండ్లను కాకుండా గుండ్రముగా వున్న పండ్ల యేర్పడతాయి.
2. మొదట సాధారణ చదునైన ఫైల్ ( Flat file ) తో ఱంపము పండ్ల పై ముందునుండి వెనుకవైపు ఫైల్ ను కదిలిస్తూ పండ్లను అరగదీయాలి.
3. తర్వాత పండ్ల మధ్యగల ఖాళీ స్థలములో కూర్చుండునట్లు త్రిభుజాకారపు ఫైలను బ్లేడుకు లంబదిశలో అమర్చి పండ్లను అరగదీసిన యెడల పండ్లు పదునుపెట్టబడతాయి.
4. తర్వాత బ్లేడు పండ్లను ఒకదానిని విడచి యింకొకటి ఎడమ వైపుకు, మిగిలిన పండ్లు కుడివైపుకు వంగియుండునట్లుగా అమర్చాలి. ఇందుకుగాను బ్లేడు పండ్లకు ఒకవైపు ఏదైనా ఆధారమునమర్చి సుతత్తె నుపయోగిస్తూ పండ్లను ప్రక్కలకు కొద్దిగా వంగి ( పటము 4.15 ). లేదా ' సా సెట్ ' అను పరికరము నుపయోగించి బ్లేడు పండ్లను ప్రక్కలకు వంచుకొనవచ్చును. దీనిని 'ఱంపము పండ్లను అమర్చుకొనుట ' లేదా ఱంపము పండ్ల సెట్టింగు ( Saw setting ) అని అంటారు.
5. పిదప ఆయిల్ స్టోన్ ( Oil stone ) ద్వారా బ్లేడుకు యిరువైపులా వంచబడిన పండ్ల వాడి మొనలను సరిచేయాలి. దీనిని డ్రెస్సింగ్ ( Dressing ) అని అంటారు.
6. చివరిగా పటము 4.17 లో చూపిన మాదిరిగా త్రిభుజాకార ఫైల్ ను వుపయోగిస్తూ ఒకటిగా బ్లేడు పండ్ల ఎడమ వైపు, మిగిలిన పండ్లను కుడివైపు అరగదీసి పదును పెట్టుకొనాలి.








No comments:
Post a Comment