Monday, July 19, 2021

బుక్ బైండింగ్ -2. పనిముట్లు , పరికరములు మరియు యంత్రముల వాడుకలోని జాగ్రత్తలు

 అధ్యాయము 4

       పనిముట్లు ,  పరికరములు   మరియు     

        యంత్రముల  వాడుకలోని  జాగ్రత్తలు 


మనము   8వ  తరగతిలో   వివిధములైన  పనిముట్లు,  పరికరములు   మరియు   యంత్రములను  గూర్చి  తెలిసికొనియుంటిమి.  ప్రతి  పరికరమును  వాడునప్పుడు  కొన్ని  జాగ్రత్తలు,  పద్ధతులు  తప్పక  ఆచరించవలెను.  అట్టివాటిలో  ముఖ్యంగా  పుస్తకాలు  కుట్టుట,   కాగితములు  మడచుట,  నంబరింగ్  చేయుట,   పుస్తకాలు  కట్టింగ్  చేయుట  అనే  పనులకు  కొన్ని  సులభపద్ధతులు  గలవు.   ఆ   ప్రకారము  చేసిన  పనిలో  ఇబ్బందులురావు.  మనము  వాడు  పనిముట్లలో  ముఖ్యంగా  సూది,  కంఠాణి, రంపము, కత్తి,  కత్తెర, మొదలగునవి  పదును  కల్గియుండును.  అందువలన  వాటిని  సరైన  పనులకు  మాత్రమే  వాడవలయును.  అప్పుడప్పుడు  పదును  పెట్టించుచుండవలెను.  బ్యాకింగ్  బోర్డ్సును  ఉపయోగించునప్పుడు  వాటిమీద  రంపుగాట్లు  పడకుండా  చూడవలెను.  పుస్తకములను  అదుముటకు  ఉపయోగించు  ప్రెస్సింగ్  బోర్డ్సును  శుభ్రముగా  నుంచవలెను.  లేనిచో  కాగితముల  పై  మరకలు  ఏర్పడును.  పేష్టు  గిన్నెలు,  బ్రష్ లు  పని  అయినవెంటనే  శుభ్రముగా  నుంచుకొనవలెను.

   పుస్తకముల పై   అలంకరణ  చేయుటకు  వాడు పనిముట్లు  ఇత్తడి  లోహముతో   చేయబడి  వుండును.  వాటిని  వేడిచేసి  ఉపయోగింతురు.   అందువలన   వాటిని   చల్లారిన   తరువాత   బద్రపరచవలెను.  ఒకదానితో  మరియొకటి  తగులకుండా  చూడవలెను.  అలంకరించవలసిన  పుస్తకాలను  ప్రత్యేకముగా  నుంచవలయును

.పుస్తకములను   బైండింగ్    చేయుటలో   అనేక     యంత్రములను   వాడతారు.    అట్టి   వాటిలో    ముఖ్యమైనవి   పేపరు   కట్టింగ్ ,   ఫోల్డింగ్ ,  ఫిన్నింగ్ ,  నంబరింగ్    పర్ ఫోరేటింగ్   మరియు   రూలింగ్      మొదలగు  యంత్రములు.   వాటీని   ఉపయోగించి   చేయుపనులు,   నడుము  విధానము,   జాగ్రత్తలు   తెలిసికొనవలయును.   ప్రతి   యంత్రమునకు   ప్రత్యేక   పద్ధతులుండును.   యంత్ర  సామర్య్థము,  అనగా   పనిచేయు  కొలతలు,   వేగము  తెలిసికొనవలయును.    కొన్ని  ఆటోమ్యాటిక్ గాను,  మరికొన్ని   చేతితో   నడుపులాగును,   మరికొన్ని   రెండు   విధములుగా    వుండును.   కావున   తగిన   శిక్షణ   పొందిన   తరువాతనే    యంత్రములను    నడపవలయును.   పనిచేయు   ప్రదేశమును   శుభ్రముగా   వుంచుకొనవలయును.   యంత్రము  పైనవున్న    సూచనల    ప్రకారము   ఆయిలింగ్ ,  గ్రీసుపెట్టవలయును.   కొన్ని   భాగములను   ప్రతినిత్యం   శుభ్రపరచి   నూనె   వేయవలయును.  మరికొన్ని    భాగములకు   అప్పుడప్పుడు   గ్రీసుపెట్టివలసియుండును.    యంత్రములను   వృధాగా   నడపరాదు.   మరియు   పనిమధ్యలో   విరివిగా   ఆపరాదు.   అందువలన    యంత్ర   భాగములపై   భారముపడి   విరిగిపోగలవు.  యంత్రమును.    పనిలేనప్పుడు   నిశ్చలస్థితిలో    వుంచవలెను  ( Home position )   వారమునకొకసారి   కిరసనాయిల్ తో    తుడవవలయును.   కట్టింగ్    మిషన్   బెడ్డుపైన   త్రప్పు   పట్టకుండా    అప్పుడప్పుడు    కొబ్బరినూనెపూసి     తుడపవలెను.    Feed table మీద    ఏమి   మరకలు,    గాట్లు    లేకుండా    చూడవలయును.    మోటారుబెల్టు   మరియు   ఇతర     కదిలెడు    భాగములను   కప్పిపుచ్చవలెను.   ఆపరేటింగ్    స్విచ్ లు   దగ్గరగా    వుండవలయును.    ఎక్కువగా   ఆయిలింగ్   చేసిన,    నేలపై  బడిన    నూనెవలన   జారిపడే   అవకాశముండును.   అందువలన    సరిపడు    నూనెను    మాత్రమేవేసి   మిగిలినది   తుడవవలయును.    పిన్నింగ్    మిషన్ లో   పిన్ను   మీద    పిన్ను   పడకుండా    నడపవలయును.    పర్ పోరేటింగ్    మిషన్ లో   సూదులు    విరిగిపోకుండా    చూడవలెను.   అట్టలను   Board  cutting    యంత్రముపైననే    కత్తిరించవలయును.  వాటిని    కట్టింగ్    యంత్రముతో    కత్తిరించిన,   కత్తితొందరగా   చెడిపోవును.    నంబరీంగ్   మిషన్ ను    శుభ్రపరచవలెను.   అప్పుడప్పుడు   పల్చటి   చమురువేసి    నడపవలెను.   అధికముగా    అదమకూడదు.    నంబరింగ్   చేయునప్పుడు    క్రింద   కొన్ని   కాగితములు    వుంచవలెను.   రంగుమార్చినపుడు    Ink pad ను    మర్చాలి.  అంకెలు   మార్చవలసి   వచ్చినప్పుడు   Stick   ద్వారానే    మార్చాలి.    ఇనుప     వస్తువులను   వాడరాడు.    అంకెలు   చెడిపోగలవు.  Folding   మిషన్ లో   కూడ   పైన   తెల్సిన   జాగ్రత్తలు   తీసుకొనవలయును.    కాగితము    వంకర    పోకుండా    మడవవలెను.    ఈ   విధముగా    ఒక్కొక్క   యంత్రము    మీద     తగిన    జాగ్రత్తలు    తీసుకొని    నడిపిన    అది   ఎంతోకాలము   చక్కగా   పనిచేయును.

                        ప్రశ్నలు

(1) యంత్రములపై   పనిచేయునపుడు   గమనించవలసిన   విషయములేవి?

(2) పనిముట్లు   వాడుటలో   తీసుకొను   జాగ్రత్తలేవి?

అధ్యాయము —5

 బైండింగ్  వస్తువులను   భద్రపరచుట  మరియు  వాడు  విధానము

       మనము   క్రింది   తరగతిలో    కాగిత   గిడ్డంగిని    గూర్చి   తెలుసుకొనినాము.   ప్రస్తుతం   బైండింగ్ కు   ఉపయోగించు   ఇతర   వస్తువులను   ఏ   విధముగా   బద్రపరచవలెనో   తెలిసికుందాము.    ఒక్కొక్క   వస్తువుకు   ప్రత్యేకమైన   అరలు ( Racks )  ఏర్పాటు   చేయవలెను. ఉ :—  వేరు  వేరు    కాగితములు,  పల్పు బోర్డులు,   సెంచరీకార్డులు,   క్రాఫ్ట్ పేపరు,  మార్బుల్ పేపరు,   గడ్డి  అట్టలు    మొదలగునవి.   రెండురకములు   ఒకదానిపై   నొకటి   వుంచరాదు.   కాగితములను    గూర్చిన    వివరములు   వ్రాసి  పెట్టుకొనవలెను.   నేలపై   కాగితములు   పెట్టరాదు.   గాలి,   వెలుతురు  బాగుగా   తగులునట్లు   చూడవలయును.   రాక్సుమధ్య   మనిషి    తిరుగుటకు    స్థలమండవలయును.   ర్యాకులు    గోడలకు   తగులనీయ    కూడదు  చెదలు,   బూజు    పట్టకుండా   అప్పుడప్పుడు    తుడిచి  D.D.T  మందును   చల్లవలెను.

              దారపు   వస్తువులు    అనగా     దారము,  సూయింగ్   టేపు,   సిల్కురిబ్బన్ లు,   హెడ్ బ్యాండ్సు,   గుడ్డ,   క్యాలికో,  రెక్సిన్  మొదలగునవి

అన్నీ   ఒకేచోట   వసతిగా   పెట్టుకొనవలయును.   ఉపయోగించిన    వాటికి   లెక్కలువ్రాసి    వెంటనే   క్రొత్తవికొని    జాగ్రత్తపడవలెను.   వివిధరకాల   తోళ్ళు,   గ్లూముక్కలు   దూరముగా   గాలితగులు   ప్రదేశములో   వుంచవలెను.   వీటిని   బూజుపట్టకుండా   చూచుకోవలెను.   తోళ్ళును   కిలో   గ్రాములలో   కొంటారు.మైదాపిండిని   ఎలుకలు,   పురుగుల   పాలుకాకుండా  జాగ్రత్తపడవలెను.   వండిన   పేష్టును   దూరముగా   నుంచవలయును.   ఎక్కువ    రోజులు   నిల్వ   ఉంచరాదు.   వాసన,  బూజు,  కుక్కగొడుగులు  అభివృద్ధి   కాకుండా    చూచుకొనవలయును.   పేష్టులో   క్రిమిసంహారక   మందులు   అయిన    కాపర్ సల్ఫేట్ పొడిని,   ఆలమ్ పొడిని,  కలుపుతారు.    వాడుకకు   కావల్సినంత   తయారుచేసుకొనుట   మంచిది.    బైండింగ్   వస్తువులను,   పద్ధార్థములను,   వృధాకాకుండా   చూడవలెను.

             ఇనుప   వస్తువులు   అయిన    తీగచుట్టలు,   స్పైరల్స్ ,   మెటల్ కార్నర్సు,    ఫైలుక్లిప్సు,   అయిలెట్సు    మొదలగునవి  కావలసిన    మందములోను,   పొడవులోను    కొనవలయును.   ఇవన్నీ   మెకానికల్    బైడింగ్ కు   ఉపయోగించుతారు.   సూదులు,   కత్తెరలు   ( Cutting sticks )  కొన్ని    ఎక్కువగా    కొనిపెట్టుకొనవలెను.  మనకు   కావలసినప్పుడు   కొన్ని   వస్తువులు    దొరకపోవచ్చును   లేదా   ధర  పెరగవచ్చును.   అందువలన   అవసరమైనవాటిని   కొన్ని   బద్రపరచుకొనవలెను.    ఈ   అవసరములన్నీ   చూచుకొనుటకు    ప్రత్యేకముగా   ఒక   అధికారి   శిక్షణ   పొంది   వుండవలయును.

                            ప్రశ్నలు

1. కాంతములు   బద్రపరచు   విధమును   తెల్పుము?

2. బైండింగ్   వాడు   వివిధ   రకముల  వస్తువు  లేవి?

అధ్యాయము —6

                  పుస్తకాలు   కుట్టుట

        పుస్తకాలు     కుట్టుటకు   గురించి   మనము   తెలిసికొనియున్నాము.   కాని   సూయింగ్   పద్థతికి,   స్టిచ్చింగ్   పద్థతికి    తేడాగలదు.    స్టిచ్చింగ్   అనునది   దారముతోగాని    తీగతోగాని   అన్ని    కాగితములను   కలిపి   ఒకేసారి   కుట్టుదురు.   కాని   సూయింగ్    పద్థతిలో    కాగితములను   ముందుగా   సెక్షన్ లుగా   మడచుకొంటారు.   అటుతరువాత    ఒక్కొక్క   సెక్షన్ ,   క్రమముగా    అల్లిక   పద్థతిలో   కుట్టుదురు.   ప్రతి    సెక్షన్ కు    చివరియందు    కెటిల్ స్టిచ్  అనుముడినివేసి    ఒక   సెక్షన్ కు   మరి   ఒక   సెక్షన్ తో   కలిసి   యుండునట్లుగా  చేయుదురు.   ఈ   విధముగాా ఎన్ని   సెక్షన్ లు   అయినను   కలుపుకొని    కుట్టవచ్చును.   స్టిచ్చింగ్    కొంత    మందమువరకే   పరిమితము.    ఈ    పద్థతిలో   పుస్తకాన్ని   పూర్తిగా   తెరచి   చదువుటకు,   వ్రాయుటకు,    ఇబ్బందిగా   నుండును.  కాని   సూయింగ్    పద్థతిలో   పైన   తెల్పిన   ఇబ్బందులు    ఏమీ   వుండవు. 

         సూయింగ్   అనునది   పుస్తకముల   కుట్టుటకు   గట్టి   పద్థతి,    కాని   చాలా   వ్యవధిపట్టును.   సూయింగ్ లో   ఐదు   పద్థతులు  గలవు.

( 1 ) లైబ్రరీ   సూయింగ్

( 2 ) పాన్ ఇన్  సూయింగ్

( 3 ) ఫ్లెక్సిబుల్ సూయింగ్

( 4 ) ఓవర్ కాష్టు సూయింగ్

( 5 ) టు  ఆన్   సూయింగ్  అనునవి

           సూయింగ్    పద్థతిలో    నిర్ణయించుకొనుటకు    పుస్తకము    యెక్క    విశిష్టతపైన,   తయారుచేసి    ఇవ్వవలసిన    వ్యవధిపైన   ఆధారపడి    యుండును.   కొద్ది   పుస్తకాలను    చేతితో    కుట్టవచ్చును.    ఎక్కువ   పుస్తకాలను    చేతితో    కుట్టునపుడు    సూయింగ్  చట్రమును    వాడుదురు.   అధిక   సంఖ్యలో    పుస్తకములను   తక్కువ   కాలములో    తయారు   చేయుటకు    ' సూయింగ్ '    యంత్రములు   గలవు.   యంత్ర   సామర్య్థమునుబట్టి    పనిచేయవలయును.    సూయింగ్    యంత్రములలో    కొన్ని   వసతులు   గలవు.  అని   ఏననగా,   సూదితో   రంధ్రములు   చేయుట,    దారమును   ఒక   రంధ్రము    నుండి    మరి   ఒక   రంధ్రమునకు   అందించుట,     చివరన   ఒక   సెక్షన్    మరియొక    సెక్షన్ తో   కలిపి   ముడివేయుట   అనునవి    గలవు.   ఈ    యంత్రములందు   సూయింగ్     టేపును,   సూయింగ్  కార్డును   అమర్చు   వసతి   కూడా   గలదు.    సూయింగ్     యంత్రములలో   ఆటోమ్యాటిక్    మరియు    సెమి — ఆటో    మ్యాటిక్   యంత్రములు   గలవు   ఈ   యంత్రములలో   పుస్తకము   వెంట   పుస్తకమును   కుట్టుదురు.   కాని   పుస్తకము,  పుస్తకమునకు   మధ్యన    ఒక  extra    కుట్టును   వేయుదురు.   దానిని    Blind stich  అంటారు.   Blind stich ని   కత్తిరించి    ఒక్కొక్క    పుస్తకమును     విడిగా   చేయదురు.

               లైబ్రరీ సూయింగ్     చేయు విధానము :  సూయింగ్    చేయవలసిన   కాగితములను   లేదా   సెక్షన్ లను    బాగుగా   Jogging   చేయాలి.   అటుతరువాత   అన్ని    కాగితములను   ఫారమ్   నంబర్   ప్రకారము   వరుసగా    gathering  చేసిన   తరువాత   Hard press లో    pressing   చేయాలి.   ఇప్పుడు   సెక్షన్ లు   అన్నీ   అణిగి   క్రమ   ఆకారము   కల్గియుండును.   మడచిన   సెక్షన్ ల   వెనుకభాగమున,   సూయింగ్    గుర్తులు    పెట్టుకొనవలయును.   పుస్తకము   పొడవును   బట్టి   సూయింగ్   టేపులు   సంఖ్యను   నిర్ణయించు   కొనవలయును.    సాధారణముగా   రెండు   టేపులు   చాలును.    ప్రతి  టేపునకు   రెండువైపులా    గుర్తులు   పెట్టుకొనవలయును.   అనగా   రెండు   టేపులకు  గాను   నాల్గు   గుర్తులు   మరియు   పై వైపున   క్రింద  వైపున   కెటిల్   ముడికి    రెండు   గుర్తులు   వుంచవలయును.   టేపుకు,   టేపుకు  మధ్య   దూరము   సమానముగా   వుండవలయును.   పుస్తకము   Head side నందు   11\2 cms,   Tail side  నందు   2 cms  స్థలము   వదిలిపెట్టి   కెటిల్   ముడికి   గాట్లు   పెట్టుకొనాలి.   అటుతరువాత   పుస్తకమును   బ్యాకింగ్   బోర్స్డ్   మధ్యన   వుంచి   లైయింగ్    ప్రెస్ లో    బిగించవలయును.   రంపము   సహాయమున    సూయింగ్   గుర్తుల   మీద   గాట్లు   పెట్టవలయును.   గాట్లను   మధ్య   కాగితము   తెగువరకు     పెట్టవలయును.      ఎక్కువ   లోతుగా   గాట్లు   చేయరాదు.   ( fig. next page )  ప్రస్తుతం   పుస్తకము   కుట్టుటకు   తయారైనది.

తగినంత   దారమును   సూదిలోనికి   ఎక్కించుకోవాలి.   రెండు   సూయింగ్    టేపులను    పుస్తకము   మందముకన్నా   2  అంగుళములు   పెద్దవిగా   వుండునట్లు    కత్తిరించుకొని   వాటి    స్థానములలో   వుంచవలెను.  ఆఖరీ   సెక్షన్ ను   ముందుగా   తీసుకోవాలి.   పుస్తకము   వెనుక   భాగము   మనవైపునకు   వచ్చునట్లుగా   పెట్టుకోవాలి.   సిగ్నేచరు   గుర్తు  పైకీ   అగుపించునట్లుగా    వుంచవలెను.   ఎడమ   చేతిని   పుస్తకము   మధ్యన    వుంచవలెను.   సూదిని   Tail side   రంధ్రము   నుండి    లోనికి   నెట్టవలయును.   చివర   కొంత   దారమును   ( అనగా 2 అం. )    వుండునట్లుగా   వుంచవలయును.   సూది    రెండవ   రంధ్రమునుండి   బయటకి   తేవలయును.   టేపుమిద   నుండి   మూడవ   రంధ్రము   గుండా   సెక్షన్ లోనికి   నెట్టవలూను.

సూయింగ్ చేయు  విధము  తెల్పు  పటములు  

(1)  మొదటి  సెక్షన్ పద్ధతి  6 రంధ్రములలో 1, 6 కెటిల్ ముడి  రంధ్రములు

(2)  3, 4 సెక్షన్ లు  కుట్టి  కెటిల్ ముడినివేసిన  పద్ధతి

(3)  సూయింగ్  అయిన  తరువాత  పుస్తకము పైన  రెండువైపులా  అగుపించు  టేపులు


తిరిగి  సూదిని  నాల్గవ  రంధ్రమునుండి  బైటికి  తేవలయును.  దారమును  రెండవ  టేపు  మీదనుండి  తీసుకొని 5వ  రంధ్రములోనికి  సూదిని    నెట్టవలయును.  సూది  సెక్షన్ లో  నుండి  తిరిగి  6వ  రంధ్రముద్వారా  బైటికి  వచ్చును.  దారమును  వదులు లేకుండా  చక్కబరచుకొనవలయును.  తరువాత   సెక్షన్  తీసుకొని  కుట్టిన  సెక్షన్  మీద  సరిగా  వుంచవలయును.  ప్రస్తుతం  కుట్టు  Head side నుండి  మొదలగును.   ప్రస్తుతం  కుట్టు   మొదటి   సెక్షన్  మాదిరే  చేయాలి  కాని   వ్యతిరేకదిశలో    చేయాలి.   Tail side కు  సూది  చేరిన    తరువాత     దారమును  వదులు లేకుండా        లాగవలయును.    దారమును   లాగునప్పుడు  వ్యతిరేకదిశలో   లాగరాదు.  కాగితములు   చినిగిపోగలవు.   Tail side  నందు   వున్న   దారము    చివరతో    ముడిని    వేయాలి.  దీనిని   కెటిల్ ముడి   అంటారు.   ఆ   విధముగా   ముడివేయుట   వలన     ఒక   సెక్షన్   మరిఒక    సెక్షన్ తో   కల్సియుండును.   లేనిచో   దేనికది   విడిగావుండును.   పుస్తకము   తయారు  కాదు.    ప్రస్తుతం   మూడవ   సెక్షన్   ఇదే   ప్రకారమువుంచి  

 దారమును    ముడివేసిన    తరువాత    సూదిని   Tail side     మొదటి    రంధ్రమునుండి   దూర్చి,   Head side  కు   పైన   తెల్పిన   విధముగా   తేవలయును.   ఇప్పుడు   6వ  రంధ్రము  నుండి   బైటికి   వచ్చిన   సూదిని   క్రిందనున్న   1,2   సెక్షన్ ల   మధ్యనుండి   చొప్పించవలయును.   అందువలన     మూడవ   సెక్షన్   క్రింది   సెక్షన్ లతో    కలసి   యుండును.     ఇక్కడ   మెలికముడిని   ( chain stitch )  వేసి   నాల్గవ    సెక్షన్ ను   కుట్టుటకు    Head side  నుండి   మొదలుపెట్టాలి.   ఈ    విధముగా   అన్ని   సెక్షన్ లు   కుట్టాలి.   చివరి   అంచులయందు   ముడిని    తప్పకుండా   వేయాలి.

             సూయింగ్    చేయునపుడు    కొన్ని   జాగ్రత్తలు    తీసుకొనవలయును.   ప్రతి   సెక్షన్   వరుస   క్రమములోనున్నది    లేనిది   పరీక్షించుకొనవలెను.    సెక్షన్   కు    సెక్షన్     కలిపి   ముడి   వేయునప్పుడు   దారము   వదులు   లేకుండా   చూచుకొనవలెను.    పుస్తకము   వెనుకభాగమున,   Head side  నందు   సమానముగా   ( Level ) గా   వుండునట్లు   సెక్షన్ ను   మెల్లగా   తట్టి   సరిచేసుకోవలయును.   అన్ని   సెక్షన్స్    కుట్టిన   తరువాత    చివరన   రెండు   లేక   మూడు   ముళ్ళు   వేసి   దారమును   5mm   పొడవు   వదిలి    కత్తిరించవలయును.   ఈ    విధముగా   కుట్టిన    పుస్తకము   వేరే   ఇతర   బైండింగ్    పనులు   చేయుటకు   సిద్ధమగును.   లైబ్రరీ   సూయింగ్   అను  పద్థతి    చాలా   తేలిక   అయినది.   తక్కువ  ఖర్చు,   మరియు   మన్నిక   గల   పద్థతి.   ముందు   తరగతులలో   మిగిలిన   సూయింగ్   పద్థతులను    గురించి    తెలిసికొందాము.   సూయింగ్   చేసిన   పుస్తకము   బైండింగ్   చేయుటకు   అనువుగా  వుండును.

                            ప్రశ్నలు

1. సూయింగ్  మరియు   స్టిచ్చింగ్ కు  గల   తేడా  ఏమిటి?

2. సూయింగ్  వలన  లాభము   లేవి?

3. స్టిచ్చింగ్   వలన   గల  లాభనష్టము   లేవి?

4. సూయింగ్   ఎన్ని   పద్థతులలో   గలదు?

5. సూయింగ్   చేయుటకు   ముందు   తీసుకొనవలసిన   జాగ్రత్తలేమిటి?

6. లైబ్రరీ   సూయింగ్   పద్థతిని   గూర్చి  వ్రాయుము?

అధ్యాయము —7

         ఎండ్  పేపర్స్    ( End   papers )

       పుస్తకము   రెండు   అంచులయందు   అతికించబడిన   కాగితములను   ఎండ్  పేపర్సు   అని   అంటారు.    పుస్తకము   తెరచుట,   మూయుటవలన   అంచుల   యందుండు    పుస్తక   పేజీలు   త్వరగా    చినిగిపోవును.   లేదా  వూడిపోవును.   మరియు   అట్టలను    పుస్తకముతో   అతికించుటకు   కాగితము   కావలయును.    లేనిచో   అట్టలు   బిగించును   వీలుపడదు.   అందువలన   ఎండ్  పేపర్సు   అనునట్టి   మడిచిన   కాగితమును   ముందుగా   పుస్తకపు   రెండు  అంచులయందు,   వెనుక   భాగమునుండి  1\2 సెం.మి.    వెడల్పును   అతికీంచుదురు.    అందువలన   ఎండ్  పేపరు   అట్టను,   పుస్తకమునకు   కలుపునట్టి   లీవరుగా   ఉపయోగపడును.   ఎండ్  పేపరు     అనునది   ఒక  మడిచిన    కాగితము.   దీనీ   వెలుపలి   రెండు      అంచులును   ఒకటి   అట్టవైపునకు,   రెండవది   పుస్తకము   వైపునకు   వుండును.   పుస్తకమునకు   రెండు   ఎండ్  పేపర్లు    కావలయును.   ఎండ్  పేపరుకు   ఉపయోగించు    కాగితము   దళసరిగా   నుండవలయును.   ఎండ్  పేపరు   మీద   ఏమి   మరకలుండరాదు.   పుస్తకము   తెరవగానే   ముందుగా   ఎండ్  పేపరు  అగుపించును.   అందువలన    దానిని   ఆకర్షణీయముగా   వుండునట్లు   వాడవలయును.

       ఎండ్  పేపర్లు  5   రకములలో   గలవు.   అవసరమును  బట్టి,  ఒక్కొక్క   రకమును   వాడతారు.

1. సింగిల్    ఎండ్  పేపరు

2. రీయిన్   ఫోర్స్ డ్   ఎండ్  పేపరు

3. మేడ్  ఎండ్  పేపరు

4. క్లాత్ జాయింట్   ఎండ్  పేపరు

5. జిగ్  జిగ్   ఎండ్  పేపరు,  అనునవి

            సాధారణముగా    పుస్తకమునకు   వాడు    ఎండ్  పేపరు,   కవరింగ్ కు  వాడునట్టి   వస్తువులు  ఒకే   రంగులో  వుండిన   చూచుటకు   బాగుంటుంది.

ఎండ్  పేపర్సును  తయారుచేయు   విధానము  :—

1.   సింగిల్   ఎండ్  పేపరు  :—

                ఇది  చాలా   తేలిక    అయిన   పద్ధతి.   దీనిని   తక్కువ  ఖరీదు   పుస్తకాలకు   వాడుతారు.

ఉదా :—   డెమ్మిా  1/8  సైజు   పుస్తకానికి   డెమ్మిా  1/4  సైజు   కాగితమును  తీసుకొని  సగమునకు  మడిచిన  అది  1/8  సైజు  సింగిల్   ఎండ్  పేపరగును.   ఇటువంటివి    రెండు   తయారుచేసుకోవాలి.   ఈ   ఎండ్  పేపరును  " టిప్పింగ్  ఆన్ "   పద్ధతిలో  1/8"   వెడల్పుకు   పేష్టు  రాసి  పుస్తకము   వెనుక   అంచులయందు   అతికించుతారు.

2.  రీయిన్  ఫోర్స్ డ్   ఎండ్  పేపరు   చేయు   విధానము  :—

           ఈ    రకం   ఎండ్  పేపరు   1/8  సైజు   పుస్తకమునకు   చేయవలెనంటే   డెమ్మిా  1/4  సైజు   కాగితము   మరియు    1/8  సైజు   కాగితము   కావలయును  ( అనగా  1 1/2 Sheets ).  ముందుగా  1/4  సైజు   కాగితమును   1/8  సైజు   సింగిల్   ఎండ్  పేపరుగా   చేసుకోవాలి.  మిగిలిన   సగము  కాగితమును   1/8"  అం.   వెడల్పున  మడవవలెను.  మడిచినభాగమునందు  గట్టి   పెష్టును  రాయవలెను.  అటుపిమ్మట   దానిని  సింగిల్   ఎండ్  పేపరుపైన   వుంచి   1/8"  అం.  పేష్టు   భాగమును  మడిచి  అంటించవలెను.   అటు   తరువాత   సగము   కాగితమునకు  పూర్తిగా   పల్చటి    పేష్టును  రాసి   సింగిల్   ఎండ్  పేపరుమిాద     పూర్తిగా    అతికించవలెను.   దీనినే   

రీయిన్  ఫోర్సు   అని  అంటారు.   1/2    కాగితము     

అంటించినవైపు   అట్ట   వెనుకనకు   వచ్చునట్లుగా   ఎండ్  పేపరును   పుస్తకమునకు  అతికించవలెను.      ఈ    విధముగా   రెండు   రీయిన్  ఫోర్స్ డ్   ఎండ్  పేపర్లను   తయారుచేయవలయును.   తయారుచేసిన   తరువాత   వాటిని   ప్రెస్సింగ్ లో    పెట్టవలయును.

3.  మేడ్  ఎండ్  పేపరు   చేయు   విధానము  :—

              ఈ    రకము   ఎండ్  పేపరు   ఖరీదయిన  పుస్తకాలకు  వాడుతారు.   దీనిని   టప్పింగ్    ఆన్    పద్ధతిలోనే   వాడుతారు.   దీనిని   ముందుగా   రీయిన్  ఫోర్డ్సు   ఎండ్  పేపరు   లాగున   తయారుచేయాలి.   తరువాత   మార్బుల్    కాగితమును    తీసుకొని  full sheet,   half  sheet  మధ్యలో   పూర్తిగా   అంటించవలయును.

        మార్బల్   పేపరును   full sheet  మరియు   half  sheet  మధ్యన  అతికించిన   విధము

      అంటించునప్పుడు    మడతలు,  గాలిబుడగలు    రాకుండా   చూచుకొనాలి.    ఈ   ఎండ్   పేపరులో    రెండు   రకాల   కాగితములుండును.     (1 ) పుస్తకమునకు    వాడిన కాగితము    ( 2 )   మార్బుల్   కాగితము.  పుస్తకమునకు  అంటించునప్పుడు   1\2  sheet    అట్టవైపునకు    రావలయును.    పుస్తకము    తెరవగానే     మార్బుల్     కాగితము   అగుపించును.   అటు  తరువాత      తెల్లకాగితము  అగుపించును.   తయారుచేసిన   ఎండ్   పేపరును   ప్రెస్సింగ్ లో     పెట్టవలయును.   పుస్తకము   కుట్టిన   తరువాత   దీనిని   టిప్పింగ్   ఆన్   పద్థతిలో   అంటిచవలెను.

4.   క్లాత్   జాయింట్   ఎండ్  పేపరు   చేయు   విధానము  :—

        దీనిని   పెద్ద    పుస్తకాలకు   వాడుతారు.   ఇది   చాలా  గట్టి   రకము   ఎండ్  పేపరు.   దీనికి  గుడ్డ,  రెక్జిన్ ,  కేన్ వాస్ ,   లేక   తోలును   కూడా   వాడుతారు.  దీనిని   చేయుటకు  ముందుగా   రీయిన్   ఫోర్డ్సు    ఎండ్  పేపరును  చేసుకోవాలి.   తరువాత   full sheet  మరియు   half  sheet  మధ్యలో   2 అం.  వెడల్పు   మరియు   పుస్తకము   పొడవు   గల   గుడ్డను   కత్తిరించి  అతికించవలెను.   తరువాత   మార్బుల్    కాగితమును   రెండు   సమభాగములుగా   కత్తిరించి,   ఇదివరలో   అతికించిన   గుడ్డకు   రెండు  వైపులా   సమాన   దూరములో   గుడ్డ  బయటికి   అగుపించునట్లుగా  వుంచి,   మార్బుల్    కాగితమును   రెండు  వైపులా   అతికించవలెను.   అటుపిమ్మట   వాటిని   ప్రెస్సింగ్ లో   వుంచవలెను.    ఈ   రకము   ఎండ్  పేపరును    పుస్తకము  సెక్షన్స్  తో   పాటు   కలిపి   కుట్టుతారు.   అందువలన   ఎండ్  పేపరు  పుస్తకముతో    గట్టిగావుండును.    half  sheet  వైపు   అట్టవైపునకు   వచ్చులాగున   కుట్టవలయును.   పుస్తకము   తెరవగానే   క్లాత్   జాయింట్   అగుపించవలయును.   ఎండ్  పేపర్లను  ముందుగా   తయారుచేసుకొని   పుస్తకము   కుట్టుట   ఆరంభించవలయును.

5.  జిగ్ జాగ్   ఎండ్  పేపరు   చేయు  విధానము :—

       ఇది   చాలా   ఖరీదు  అయినది.   చేయుటకూడా   కొంత   వ్యవధితో   కూడినది.  దీనిని  పెద్ద  పెద్ద  ledger  లకు   వేస్తారు.   దీనివలన   బరువైన   అట్టలను   తెరుచునప్పుడు,  మూయునప్పుడు,  పుస్తకముపై   ఎలాంటి  భారము  పడకుండా   చేయును.  దీనిని  చేయుటకు  రెండు  తెల్ల   కాగితములు  ( full sheets )  ఒక  మార్బుల్   కాగితము    ( full sheet )  కావలయును.   ముందుగా  ఒకపెద్ద    తెల్ల   కాగితమును   మధ్యన   జిగ్ జాగ్   పద్ధతిలో    మడవవలయును.   ఆ  విధముగా   మడచుటవలన   మధ్యలో  1/8 అం.  ఎత్తు  అంచు  ఏర్పడులాగున   చేయాలి.  దీనిని  Gusset  అని  అంటారు.  ఈ  అంచునకు   ( Gusset )  ఒక  వైపున    తెల్ల   కాగితమును   అంటించవలయును.   రెండవ   వైపున     మార్బుల్   కాగితమును   అంటించవలయును.   తరువాత  ప్రెస్సింగ్ లో   పెట్టవలయును.   దీనిని   పుస్తకములో   కలిపి  కుట్టవలయును.   మార్బుల్   కాగితము   ముందు   వచ్చినట్లుగా   వుంచవలయును.

                           ప్రశ్నలు

1.  ఎండ్  పేపరు    ఉపయోగమేమి  ?

2.  ఎండ్  పేపర్లు   ఎన్ని   రకములు?

3.  రీయిన్ ఫోర్స్ డ్    ఎండ్  పేపరు   ఎట్లు   చేస్తారు?

Tuesday, July 13, 2021

బుక్ బైండింగ్ -1. కాగితములు — వాటి కొలతలు

            బుక్   బైండింగు

  అధ్యాయము  — 1

కాగితములు  — వాటి కొలతలు

  ముద్రణా   పరిశ్రమలోను,   పుస్తకములు   బైండింగ్    చేయుటకును   కాగితము    ముఖ్యమైన    వస్తువు.    కావున    కాగితమును   గురించి   కొన్ని    విషయములను    తెలిసికొనవలయును.   కాగితము   యొక్క   ఆవశ్యకత    ఏవిధముగా    ఏర్పడినదో    తెలిసికొందాము.     శిలాయుగమునందు    మానవుడు    తన   భావనలను    రాళ్లపైన,   చెట్లమొదళ్ళ    మీద    మరియు   మట్టి  బిళ్ళలమీద,  చెక్కుకొనెడివాడు.   కాలక్రమేణ   నాగరికత    అభివృద్దిచెంది,    జంతు    చర్మములను,    ఆకులను,   సిల్కు గుడ్డలను    వ్రాయుటకు   ఉపయోగించెను.   అటుతరువాత   అనగా     క్రీస్తుకు   పూర్వమే    కాగితమును    తయారుచేసుకొను     పద్ధతులను   తెలిసికొనిరి. కాగితమును    వెదరు,   చెరకుపిప్పి,  మొదలగు   వృక్షసంబధమైన    వస్తువులను    నానపెట్టి,   ఉడకపెట్టి    గుజ్జుగా    తయారుచేసి,  ఆ   గుజ్జు   పదార్ధమునకు    కొన్ని   రసాయన   పదార్ధములను,   రంగును   కూడా   చేర్చి,   ప్రత్యేకమైన   జల్లెడల    ద్వారా   ఆ   గుజ్జును   వడపోసెదరు.   ఈ    కాగితపుగుజ్జునందు   షుమారుగా   90  నుండి  95  శాతము   ద్రవముగాను,   మిగిలినది   పొడిరూపములోనున్న   పీచు   పదార్ధము   కల్గియుండును.

          కాగితమును   తయారుచేయు   పద్ధతి:  కాగితమును    చేతితో   తయారు   చెయుటకు    తీగలతోచేసిన    జల్లెడ    చట్రము    కావలయును.  ఈ     చట్రములు    వివిధ    కొలతలలో    దొరకును.  కాగితపు    గుజ్జును    ఈ   చట్రమునందు   నింపుతారు.   అటుతరువాత   ఈ  జల్లెడపై    మరియొక   frame ( deckle )  చెక్క  వుంచి   కాగితపు    గుజ్జును   అదిమెదరు.    కాగితము    నిర్ణయించబడ్డ   మందము   మరియు  కొలతలలో    తయారగును.   తరువాత    కాగితము పై    సైజింగ్,    అనగా   వ్రాయుటకు   అనువుగా   వుండునట్లుగా    చేస్తారు.   కాగితము   అవసరమునుబట్టి,    కోటింగ్ ,    క్యాలండరింగ్    చేస్తిరు.    కాగితమును   తయారుచేయువారు   వారియొక్క   వ్యాపార   ముద్రను  ( Water mark )  కాగితమును   తడిగా    నున్నపుడే   వేస్తారు.    ఈ   ముద్ర    సాధారణముగా    mould లో    వుండును    లేదా    ప్రత్యేకమైన    రోలర్    ( roller ) ద్వారా    ( Dandy roller ) కాగితముపై   తడిగా   నున్నప్పుడు   అద్దుతారు.

         ఆ   విధముగా     తయారైన    తడి   కాగితములను    బ్లాంకెట్సు  ( Blankets )  మధ్యన    వుంచుతారు.   కాగితము   కొంచెముగట్టిపడిన   తరువాత    ప్రెస్     చేసి   ఆరవేయుదురు.  ఈ   దశలో    కాగితము   ఎక్కువ   గరకుగా    నుండును.   కావున    వ్రాయుటకు   అనువుగా    వుండుటకు    కాగితమును   సైజింగ్    మరియు   కోటింగ్    ద్రవములో    ముంచి   ఆరపెట్టుదురు.    తరువాత    కాగితములను    500   లేదా   480   ప్రకారం   కట్టలు    కట్టి   బద్రపరచెదరు.    కాగితమును    యంత్రముల   సహాయముతో    చేయుట    ఎక్కువగా    వాడుకలోనికి   వచ్చెను.   యంత్రముల   సహాయమున    కాగితము    భారీ   ఎత్తున    చేయుటకు    వీలుకల్గినది.   ఎంత    సన్నని    కాగితమునైనా,    ఎంతటి   వెడల్పు,   పొడవు   అయినను   సులభముగా     చేయుటకు     వీలు   అగును.    యంత్రముల   ద్వారా   చేసిన    కాగితము    ఎంతో   నాణ్యత    కల్గియుండును.    కాగితపు   గుజ్జు    తయారు   చేయుటనుండి    సైజింగ్ ,    calendering,    drying   చివరగా    కాగితమును    వుండగా    చుట్టుట    అనునవి   ఒకేసారి    చేయుటకు    యంత్రముల   ద్వారా   వీలుకల్గును.

     కాగితములో  అనేకరకములు  గలవు.  న్యూస్ ప్రింటు,  కోటెడ్  పేపర్, సూపర్  క్యాలెండర్  కాగితము, డూప్లెక్స్  కాగితము,  బాండు  పేపరు,  టిష్యూ  పేపరు,  కవరు  పేపర్,  పోస్టరు  పేపరు,  క్రాఫ్ట్ పేపరు,  కాట్రిడ్జి  పేపరు,  అని  అనేక  రకములలో  గలవు.  కావున  పైన  తెల్పిన  కాగితముల   అవసరమునుబట్టి  వాటి  కాగితపు   గుజ్జును  ఇతర   loading,   sizing,   colouring,  finishing ను  చేస్తారు.  కావున  కాగితమును  కొనునప్పుడు,  మన  అవసరమును,  కాగితపు  నాణ్యతను  ముఖ్యంగా  తెలుసుకొనవలెను.  సాధారణముగా  కాగితములు  నాల్గు  విధములుగా  వుండును.  (1)  Machine finishing   (2)  Super  calendering   (3)  Coated  (4) Antique .  కావున   కాగితమును  కొనునప్పుడు  కేటలాగునందు  చూచి  కావల్సిన  finish,  colour,  size,  మందములోను  కొనవలయును.  కాగితమును ఎక్కువ  మొత్తంలో  కొనునప్పుడు  ఎన్ని  రీములు  కావలయునో,  ఏవిధముగా  pack  చేయాలో  అట్లా  transport  చేయాలి  అనేది  వివరముగా  తెలియపరచవలెను.   బద్రపరచుకొనుటకు  ముందుగా  తగిన  ఏర్పాట్లు  చేసుకోవలెను.

కాగితమును   అనేక   పనులకు   వాడుతారు.   అనగా   అనేక    రకములైన   చదువుకొను    పుస్తకములకు   మరియు   వ్రాయుటకు   ఉపయోగించు    అన్ని     రకములైన    పుస్తకములను    ఉపయోగించుతారు.   పైన   తెల్పిన    అన్నిరకముల   పుస్తకములు    ఒకే   మాదిరిగా   వుండవు.   వాటి   కొలతలలను,   నాణ్యత    లోను,   ఖరీదులోను,   మరియు    మన్నికలోను    చాలా    వ్యత్యాసముండును.   కావున   ఒక్కొక్కరకమునకు   తగిన   కొలతలుగల   కాగితమును    ఎంచుకొనవలయును.    లేనిచో    కాగితము    కొలతలు   ఎక్కువ   అగుటయో    లేక   సరిపడక   వృధా    అగుటయో    జరుగును.   అందువలన    మనము    కాగితము   ఎన్ని   రకముల    కొలతలలోఏయేపేర్లలో     లభించున్నదో    తెలిసికొందాము.     పేపరు    కొనునప్పుడు   ఈ   దిగువ     తెలిసిన    వివరములను   బట్టీ,   తగిన   కొలతలు   పేర్లలోని    కాగితమును    కొని    ఉపయోగించుట    లాభదాయకము.   కాగితము   తయారు   చేయువారు   రూపొందించిన    వివిధ   కాగితముల    వివరములు   దిగువన    పెర్కొనబడినవి.    కాగితములో    సింగిల్ సైజు  అనియు,   డబుల్ సైజు  అనియు,   క్వాడ్ సైజు  అనియు   గలవు.ప్రతి   సింగిల్   సైజు   కాగితము   యొక్క    తక్కువ    కొలత    మాత్రము     వెచ్చించిన    దాని    డెబుల్    కొలత    మరియు   అదే   ప్రకారముచేసిన    క్వాడ్   సైజును   తెలుసుకొనవచ్చును.   సాధారణముగా    కాగితములు   తయారుచేయువారు    పెద్ద    సైజులోనే    అనగా    క్వాడ్   సైజులోనే   సరఫరా    చేస్తారు.   అందువలన    కాగితము   ఖరీదులో    కొంత    తగ్గును.   చిన్న    సైజు   కాగితములు   కూడా   సరఫరా    చేస్తారు   కాని   వాటికి   కట్టింగ్  చార్జి ,ప్యా కింగ్ చార్జి   అనేవి   ఎక్కువ   అగును.   అందువలన    కాగితమును   పెద్ద   సైజులో   కొని,   మన   కట్టింగ్   మిషన్   మీద   కావల్సిన   సైజులోనికి   కత్తిరించుకొనుట   మంచి  పద్ధతి.

















కాగితము   పేర్లు   మరియు   కొలతలు

Quality    :   FOOLSGAP 

 single   Size in inches  :    13 1/2  x  17

Double  Size in inches  :    17  x  27

Quad   size in inches    :     27  x  34

Quality    :   GROWN

 single   Size in inches  :   15  x  20

Double  Size in inches  :   20  x 30

Quad   size in inches    :   30  x 40

Quality    :   DEMY

 single   Size in inches  :   17 1/2  x 22 1/2

Double  Size in inches  :    22 1/2 x 35

Quad   size in inches    :    35  x 45

Quality    :   MEDIUM

 single   Size in inches  :   18  x 23

Double  Size in inches  :    23  x 36

Quad   size in inches    :    36  x 46

Quality    :   ROYAL

 single   Size in inches  :   20 x  25

Double  Size in inches  :   25 x 40

Quad   size in inches    :   40  x 50

Quality    :   IMPERIAL

 single   Size in inches  :   22  x 30

Double  Size in inches  :   30  x 44

Quad   size in inches    :   44  x 60

Quality    :   SUPER  ROYAL

 single   Size in inches  :   20 1/2 x 27 1/2

Double  Size in inches  :   27 1/2 x 41

Quad   size in inches    :   41  x  55

Quality    :   ELEPHANT

 single   Size in inches  :   23  x 28

Double  Size in inches  :   28  x 46

Quad   size in inches    :   46  x 56

Quality    :   POST

 single   Size in inches  :  15 3/4 x 19 1/2

Double  Size in inches  :  19 1/2 x 31 1/2

Quad   size in inches    :   31 1/2 x  39


Quality    :   POTT

 single   Size in inches  :  12 1/2 x 15 1/2

Double  Size in inches  :   15 1/2 x 25

Quad   size in inches    :    25  x 31

గమనిక :  పేపరు   కొలతలతో    చిన్నకొలత   డబుల్ గా    మారుటకు   గమనించవలయును.

       ఏ    సైజు    కాగితమునైనా   అవసరమునుబట్టి    రకరకాలుగా   మడవవచ్చును.    ఈ   విధముగా   మడచుటకు   రెండు   పద్ధతులు    గలవు.   మొదటిది   Regular sub - division  Irregular sub - divisions   అనియు  అంటారు.   కావున   ఏదేని   ఒక   సైజు    కాగితమును   దాని    పొడవునందు   సగమునకు   మడచిన   దానిని    regular sub - divisions అని  అంటారు.   ఆ   విధముగా   చేయుటవలన    వచ్చుసగభాగమును     Folio  అని   అంటారు.   పై    మాదిరిగానే     Folio  లోని   పొడవు   సైజును   మడచిన   Quarto    లేదా  4 to   లభించును.  అదే   ప్రకారము    Quarto ను   మడిచిన   8vo   లేదా   Octavo   మరియు   అదే   ప్రకారము    16 mo  అనెడి   చిన్న   చిన్న   ముక్కలుగా    తయారగును.

ఉదా:—  కాగితమును    సక్రమముగా    మడచు   విధమును    చిత్రములలో   గమనించండి

      ఇదే   మాదిరి   ఒక   సైజు    కాగితమును   తక్కువ     సైజులలో    ( అనగా   వెడల్పు    నందు )  సగమునకు    మడచిన    దానిని    Long Folio  అని  అంటారు.   దానిని    సగమునకు   అదే   ప్రకారము   మడిచిన    Long Quarto   అని  అంటారు.    Long Quarto   పొడవులో   సగమునకు   మడిచిన    దానిని    Long  slip   octavo   అని  అంటారు.

          ఇదే   మాదిరి    ఏదేని   ఒక   సైజు   కాగితమును   దాని   పొడవునందు   మూడుసమభాగములు    చేసిన    దానిని    thirds లేదా   1\3 part    అని  అంటారు.     thirds  ను   పొడవు   వైపున  మడచిన   6 to  ( sixto ) అనగా   1\6  భాగము   వచ్చును.   దానిని   మడవగా   12 mo ( Duodecime )  అనగా    1\12   భాగము   వచ్చును.    అదే   మాదిరి  24  mo   వచ్చును.   వీటిని    Irregular sizes అని  అంటారు.   కాబట్టి   కాగితమును   అనేక   విధములుగా    అవసరమునకు   తగినట్లుగా    మడచుకొనుట   తెలుసుకొనవలయును.   ఈ    క్రింద   కొన్ని    regular sub - divisions కొలతలను    తెలుపుచున్నాము.   ఆ   ప్రకారము    మిగిలిన    పద్ధతులలో    ఇతర   కొలతలు   తెలుసుకొనవలసినది.

కాగితమును  క్రమపద్ధతిన  మడచు  విధము  :

Quality  :   Foolscap

Single size in inces  : 13 1/2  x 17

Folio (1/2) :  8 1/2  x 13 1/2

Quarto (1/4) :  6 3/4  x 8 1/2

Octavo (1/8) :  4 1/4  x 6 3/4

16mo (1/16) :  3 3/8  x 4 1/4

Quality  :  Crown

Single size in inces  :  15  x 20

Folio (1/2) :  10  x 15

Quarto (1/4) :  7 1/2  x 10

Octavo (1/8) :  5  x 7 1/2

16mo (1/16) :  3 3/4  x 5

Quality  :   Demy

Single size in inces  :  17 1/2  x 22 1/2

Folio (1/2) :  11 1/4  x 17 1/2 

Quarto (1/4) :  8 3/4  x 11 1/4

Octavo (1/8) :  5 5/8  x 8 3/4

16mo (1/16) :  4 3/8  x 5 5/8

Quality  :  Medium

Single size in inces  :  18  x 23

Folio (1/2) :  11 1/2  x 18

Quarto (1/4) :  9  x 11 1/2

Octavo (1/8) :  5 3/4  x 9

16mo (1/16) :  4 1/2  x 5 3/4

Quality  :  Royal

Single size in inces  :  20  x 25

Folio (1/2) :  12 1/2  x 20

Quarto (1/4) :  10  x 12 1/2

Octavo (1/8) :  6 3/4  x 10

16mo (1/16) :  5  x 6 3/4

Quality  :  Imperial

Single size in inces  :  22  x 30

Folio (1/2) :  15  x 22

Quarto (1/4) :  11  x 15

Octavo (1/8) :  7 1/2  x 11  

16mo (1/16) :  5 1/2  x 7 1/2

సూచన :—  ఒక్కో   సైజు   కాగితమును    మడిచి   వాటి    కొలతలను    గుర్తించవలయును.

                           ప్రశ్నలు

ఈ    క్రింది   ప్రశ్నలకు    క్లుప్తముగా   సమాధానము  వ్రాయుము.

1. కాగితము  తయారు    చేయుటకు   కావల్సిన   మూలపదార్ధములేవి?

2. కాగితములో    ముఖ్యంగా   ఎన్ని   రకములు   గలవు?

3.కాగితమును   కొనుటకుముందు   తీసుకొనవలసిన   నిర్ణయములేవి ?

4.కాగితములో   అనేక   సైజులు  వుండుటకు   కారణమేమి?

5. కాగితములో    సైజులు   తెలుపుము.

6. కాగితములోని    రకముల   పేర్లు   తెల్పుము.

7. కాగితమును   ఎట్లు   చేయుదురు?

అధ్యాయము—2

బైండింగ్     పనులకు    ఉపయోగించు   అట్టలు   మరియు   వాటిలోని   రకములు

స్ర్టా   బోర్డులు   మరియు  మిల్   బోర్డులు :—

                         పుస్తకములు   బైండింగ్    చేయుటకు    అట్టలు   చాలా   ముఖ్యమైన   వస్తువులు.    కావున  అట్టలు  ఎన్ని    రకములుగా   దొరకునో    మరియు   వాటిని   తయారుచేయుట,  ఉపయోగించుటను    గూర్చి    తెలిసికొందాము.  అట్టలు     చేయుటకు   కాగితపు   గుజ్జు   అనేది    అవసరము.    కానీ    ఈ    కాగితపు   గుజ్జునందు   పనికిరాని   చెత్త,  గడ్డి,   చెరకుపిప్పి, వెదరు, నార  పీచులు,  పొట్టు   మొదలగునవి   ఎక్కువగా   వాడతారు.    కాగితము   గుజ్జులలో   అనేక   రకములుగలవు.   కాని   ముఖ్యమైనవి   మెకానికల్   ఉడ్   పల్పు  అనియు,  కెమినల్  ఉడ్ పల్పు  అనియు  గలవు.  అట్టలు   చేయుటకు   ఉపయోగించు   గుజ్జు   చాలా   తక్కువ   రకమునకు    చెందినది.   అందువలన    దీని   ధరకూడా   తక్కువగా    నుండును.    అట్టలయొక్క   విశిష్టతనుబట్టి kraft pulp, Rag pulp   మరియు Flaxpulpఅనునవి    కూడా   అంటారు.

    అట్టలు  అనునవి   గట్టిగాను,   మందముగాను   ధర    తక్కువగాను   వుంటాయి.    అట్టల   రకములలో     ముఖ్యమైనవి Straw boards, Gips boards, Grey boards,  pulp boards , అనునవి.  Straw board   అనునది    1\2lbమందము   నుండి    4lbమందమువరకు   దొరకును.   ఇంకా    మందమైన   అట్టలు   కావలెననిన   ఒకదానితో    మరియొకటి   అతికించుకొనవలయును.    Straw board    ఎక్కువగా    వంచుటకు   వీలుకాదు.    పెళుసుగా   నుండి    చేతితో   విరచిన     అక్రమాకారముగా    విరిగిపోవును.

ఇవి  బరువుగా    వుండును.   తేమను    అధికముగా    గ్రహించును.   వంకరలు  తిరుగును. వీటియందు   ఆల్కహాలు    లక్షణములు   గలవు.   అట్టలు    వేయుటకుముందు   వీటిని   pressingలో    పెట్టిన    తరువాత   పుస్తకమునకు  బిగించవలెను.    వీటిమిద     ముందుగా    కాగితమును    అంటించి   దానిపై   మార్బుల్    పేపరును    గాని   ఇంకా   ఇతర   క్యాలికోను   గాని   అతికించిన    బాగుండును.    లేనిచో   కొన్ని   దినములకు    కవరింగ్   చేసిన   కాగితపు   రంగు  మాయును.   ఇవి   ముద్రించుటకు   పనికిరావు.  ఈ   అట్టలు    మిఠాయి  పెట్టెలు,   పుస్తకములకు  అట్టలు   వేయుటకు,   వ్రాత  అట్టలు   తయారుచేయుటకు   బట్టలు   చుట్టుటకు   మొదలగునవానికి   వాడతారు.

              అట్టలు   గ్రేబోర్స్డు,   చిప్  బోర్స్డు,  అనునవి   ఇతర   రకములు.   వీటిని   చెత్త,   చెదారముల  నుండి    తయారు    చేస్తారు.  ఇవి  సన్నని    పొరలుగా    ఒకదానికొకటి   అంటుకొనియుండును.   ఇవి   0.04mm   మందమునుండి  4.54mm   మందమువరకు    లభ్యమగును.   ఇవి   తేలికగాను,   మెత్తగా   నుండును.   వీటిని    రకరకాలుగా   వంచుకొనవచ్చును.    వీటిని   ప్యాకింగ్ లకు   వాడతారు.     ముద్రించుటకు   అనువుగా   వుండును.  మందుపెట్టెలు,   చెప్పుల  దుపెట్టెలు,  బ్యాటరీ పెట్టెలు,   బేకరీ పెట్టెలు  మరియు  పుస్తకాల  అట్టలకు   మొదలగు   పనులకు   వాడతారు.

    మిల్  బోర్స్డు,   లేదా    పల్పు  బోర్స్డు,  అనేవి   అట్టరకములలో   ఖరీదైన   కాగితపు  అట్టలు.   ఇవి   సన్నగాను ,   గట్టిగాను,   నునుపుగానుండి   అనేక   రకములైన   మందములలో   దొరకుచున్నవి.    వీటిని   వంచినయెడల   విరగవు.  అట్టలు   వేయుటకు,  carton  లు   ముద్రించుటకు,    Files    తయారుచేయుటకు   వాడతారు.   ఇవి    వ్రాయుటకు,    ముద్రించుటకు  అనువుగా   వుండును.   ఇవి    అనేకరంగులలో   కూడా   దొరకును.      మిల్  బోర్స్డులో   ఇంకా   ఇతర   రకములుగలవు.డూప్లెక్స్  కార్డు,   సెంచరీకార్డు,    బ్రిష్టల్  కార్డు   ఐవరీకార్డు   అనునవి   ముఖ్యంగా    ముద్రణకు   వాడతారు.   కారుగేటెడు    బోర్డులను   ప్యాకింగ్ లకు   వాడతారు.

           అట్టలు   అనెడివి    కాగితపు   సైజుకన్నా    కొంచెము   పెద్దవిగా   నుండును.   కాగితములులోనే    అట్టలలోకూడా    వివిధ   సైజులుగలవు.   కాని  Straw boards  ముఖ్యంగా      రెండు   సైజులలో   లభ్యమగును.   మిల్  బోర్స్డు  అనునవి   చాలా   సైజులలో   దొరకును.   అందువలన    వాటినిగురించిన    వివరములు   దిగువన   ఇవ్వబడినవి.

                 STRAW  BOARDS

1.  22"x 32"

2.  25"x 30"

                  MILL   BOARDS

1. Pott                          141\4" x 171\4"

2. Foolscap                  141\2" x 181\2"

3. Crown                       161\6" x 20"

4. Small  half  Royal     13"       x 201\4"

5.Large half Royal        14"       x  21"

6.Small  Demy               181\2"x 221|2"

7. Large Demy              181\2" x 233\4"

8. Medium                      19"     x   24"

9. Extra Royal                211\2" x 281\2"

గమనిక :   అట్టల    కొలతలు   కాగితపు   కొలతలకన్నా    కొంచెము    పెద్దనిగా    నుండుటను  గమనించవలసినది.

                        ప్రశ్నలు 

1.  అట్టలలోని    రకములను   తెల్పుము.

2.  Straw boards  ను    ముఖ్యంగా   ఎందుకు   వాడతారు?  వాటి   స్వభావము  ఏమిటి?

3. పల్పుబోర్డునకు,    గ్రేడ్ బోర్డునకుగల   తేడాలేమిటి?

అధ్యాయము  —3

                   I.S.O.   పేపరు  సైజులు

   మనము   మొదటి   పాఠములో    కాగితమును    గురించి   మరియు    వివిధ   కాగితపు   కొలతలను   గురించి   తెలీసికొని    యుంటిమి.   బ్రిటిష్   స్టాండర్    ప్రకారము   ముద్రణాకాగితములు,   ముద్రణాయంత్రములు   అవే   సైజులలో   వుండెడివి.    కానీ   ఈ   నాటికి   ఆ   పద్ధతులు   గొప్పగా    మారలేదు.   ఇప్పటికిని   అనేక     ముద్రణాలయములో   మెట్రిక్    పద్ధతి   కొలతలు   తెలియవు.    కావున   కాగితములు     అనేక   సైజులలోను   వివిధ   పేర్లతో    వున్నందువలన   వాటిని   ప్రత్యేకీంచి   తయారుచేయుట,    బద్రపరచుట ,   వాడుకొనుటలో   అనేక    జాగ్రత్తలు    తీసుకొనవలయును.    కొన్ని    సందర్బములలో    కేవలము   కొన్ని   సైజుల     కాగితములకే   గిరాకి,   మిగీలినవి   వాడుకలోనికి  అంతగా    రాలేకపోయినవి.   అందువలన   తయారుచేయువారు,    కొనినవారు   కూడా   ఆ   కాగితమును   వేరే   సైజు   పనికి   వినియోగీంచి   కొంత   నష్టపోవుచుండిరి.   పలురకముల   కొలతలలో   కాగితములు    వున్నందువలన    అనేక   ఇబ్బందులు   కల్గుచుండెను.   ఇంతలో   ప్రపంచములోని   కాగితములు   ఉత్పత్తి    చేయువారు,   కాగితమును  ఒక   స్టాండర్      సైజుకు   తయారుచేయవలయునవి   అనుకొనిరి.  ఈ     ఇంటర్నేషనల్     పేపర్    సైజులు   మెట్రిక్   పద్ధతిలో   అనుసరించుట    జరిగినది.   దీనిని    ముందుగా   జర్మనీ    దేశస్థులు   అనుసరించిరి.   అందువలన    వీటికి  DIN    సైజులు   అని   పేరు   కూడా   గలదు.

           మన    దేశములో   కూడా    స్వాతంత్ర్యము  వచ్చిన   తరువాత   క్రమేణా   మెట్రిక్    పద్ధతిని   అవలంభించుట    జరిగినది.   అదే   ప్రకారము   కాగితపు   కొలతలు    కూడా    మెట్రిక్    పద్ధతి  అయిన   మి.మీ. ,సెం.మీ.లలో    తయారుచేయుచున్నారు.    ఈ    కొలతలు  I.S.I వారు   కూడా    అనుమతించినారు.   ఇంతకుముందు   మాదిరి   వివిధ   పేర్లతో    కాకుండా    ప్రస్తుతం   కాగితములు     ముఖ్యముగా   మూడు   రకములలో    దొరకుచున్నవి.    అవి   అందరికి   తెలియులాగును   A సిరీస్ , B  సిరీస్   మరియు  C  సిరీస్    అని   పిలవబడుచున్నవి.   ఈ   పేర్లు     గుర్తుంచుకొనుట   చాలా   సులభము.    కొలతలులోను,   ఉపయోగములలోను   ఒకదానికి   మరియొకదానికి   చాలా   తేడాగలదు.   I.S.O.   పేపరు   సైజువలన    ఇంకా   ఇతర   లాభము   లేవనగా,   కొలతలు   గుర్తించుకొనుట,    బద్రపరచుట   సులభము.   అనేక    రకముల   సైజుల   పేపర్లను    కొనుటకు   డబ్బును   వెచ్చించ   నవసరములేదు.    ఒకేరకము   కాగితమును   అనేక    సైజులలో     ఉపయోగించుకొనవచ్చును.   అందువలన   ముద్రణ    పుస్తకములు    కొలతలలో    కూడా   మార్పువుండదు.   మరియు   కాగితము   వృధాకాదు.

                ఈ   A, B, C,   అను   మూడు   రకముల   కాగితములలో    A సిరీస్     అనునది   చాలా    ముఖ్యమైనది.     దీనిని    వ్రాతపుస్తకములకు,    ప్రచారపత్రములకు,   మ్యాగజైన్స్ కు,    కేటలాగ్సు,    లిటరేచర్   ముద్రణకు,    మొదలగు   అనేక    ఇతర   ముద్రణా    పత్రాలకు    వినియోగించవచ్చును.

           B  సిరీస్   అనునది    A సిరీస్    కన్నా    పెద్ద   సైజు    కాగితము.    దీనిని   పెద్ద    పెద్ద    Charts  ( చిత్రములు) , Maps , Folders,   Wall  posters     మొదలగువానికి   వాడుతారు.

           ప్రస్తుతం   మనము    A, B, C,    సిరీస్    యొక్క   సక్షజులను   వాటి   Sub — divisons  ను    తెలిసికొందాము.

I.S.O.   కాగితపు    కొలతలు   తెల్పునట్టి   చిత్రములు.

A.  సిరీస్    కాగితపు   కొలతలు

B.  సిరీస్    కాగితపు   కొలతలు

C.  సిరీస్    కాగితపు   కొలతలు

      కాగితము   ఉత్పత్తిదారులు   A, B, C,    సిరీస్    ను  Trimmed size   అనియు,   Raw  size అనియు    మరియు,   Special  raw  size  అనియు   తయారుచేస్తారు.   కావున   మనము   కావలసిన   తీరులో   కాగితమును    ఎన్నుకొనవలయును.   సాధారణముగా   AO   అనునది    Single  size   కాగితము.   దానిలో   సగము    A1,    అలాగే   A2,  A3, A4, A5,   అని   చిన్న   సైజులుగా   మార్చుకొనవచ్చును.   AO  కన్నా   పెద్ద   సైజు   కాగితము  2A.  2A  కన్నా   పెద్ద   సైజు    4A  ఆ   విధముగా   A   సిరీస్ లోనే    పెద్ద  సైజు   మరియు   చిన్న  సైజు    కాగితమును   పొందవచ్చును.   వాటి   కొలతలు    కూడా   సమాన   నిష్పత్తిలో    వుండును.    Trimmed size  ను   ముఖ్యముగా   గుర్తుంచుకొనవలెను

Paper Series :

A. సిరీస్ —

AO —  

Trimmed size in mms :  1189 x 841

Raw size in mms :  1220 x 860

A1 — 

Trimmed size in mms :  841 x 594

Raw size in mms :  860 x 610

A2 —

Trimmed size in mms :  594 x 420

Raw size in mms :  610 x 430

A3 —

Trimmed size in mms :  420 x 297

Raw size in mms :  430 x 305

A4 —

Trimmed size in mms :  297 x 210

Raw size in mms :  305 x 215

B. సిరీస్  —

BO —

Trimmed size in mms :  1414 x 1000

Raw size in mms :  1500 x 1050

B1 —

Trimmed size in mms :  1000 x 707

Raw size in mms :  1050 x750

B2 —

Trimmed size in mms :  707 x 500

Raw size in mms :  750 x 525

B3 —

Trimmed size in mms :  500 x 353

Raw size in mms :  525 x 375

C సిరీస్ —

CO —

Trimmed size in mms :  1297 x 917

Raw size in mms :  1340 x 940

C1 —

Trimmed size in mms :  917 x 648

Raw size in mms :  940 x 670

C2 — 

Trimmed size in mms :  648 x 458

Raw size in mms :  670 x 470

C3 —

Trimmed size in mms :  458 x 324 

Raw size in mms :  470 x 335

           ఈ   విధముగా   మిగిలిన  సైజులను   తయారుచేసుకొని  కొలతలను  గుర్తుంచుకొనవలయును.

                        ప్రశ్నలు

(1) I.O.S  సైజు  కాగితము  కొలతల   ఆవశ్యకత  ఏమిటి ?

(2) A,B,C  సిరీస్  కాగితముల  ఉపయోగము  లేమిటి ?

(3) A సిరీస్  కాగితము  sub divisions వ్రాయుము.