యూనిట్ - 3
కర్రసామాగ్రి డిజైన్ మరియు నిర్మాణము
3.1 ఉపోద్ఘాతము :
కర్రతో చేయబడి వివిధ ఉపకరణములను తయారు చేయుటకుగాను ఆ ఉపకరణము ఉపయోగము, దానిని వాడెడి విధానము మున్నగు వివరములను ముందుగా తెలుసుకొనాలి. ఆ ఉపకరణము ఒకేచోట స్ధిరముగా వుంచబడెడిదా ఉదా: ( గోడలోనే అమర్చబడిన బీరువా ) లేక ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశమునకు తీసుకొని పోయెడిదా ( ఉదా : కుర్చీ, టేబుల్ మొదలగునవి ) అన్న విషయము గమనించాలి. వివిధ ఉపకరణములను నిర్మాణ పద్ధతి క్రింద తెలుపబడింది.
కర్రఉపకరణములను తయారుచేయుటలో ముఖ్యముగా మూడుభాగములు ( Steps ) కలవు. డిజైన్ చేయుట, డ్రియింగ్ చేయుట మరియు నిర్మాణ పద్ధతి అని వీటిని పేర్కొనవచ్చును.
A. డిజైన్ చేయుట :
కర్రసామాగ్రిని రూపకల్పన ( Design ) చేయుటకుగాను క్రింద పేర్కొనిన విషయములను ముందుగా గమనించాలి.
( i ) వస్తు ఉపయోగము :—
తయారుచేసిన పిదప కర్రసామాగ్రిని యేవిధముగా ఉపయోగించాలీ అన్న విషయమునుబట్టి ఆ సామాగ్రి ఆకారము సూచనామాత్రంగా మన మెదడులో రూపుదిద్దుకొంటుంది. ఉపయోగమును బట్టి కర్రసామాగ్రి ఆకారము, పరిమాణము మొదలగునవి నిర్ణయింపబడును.
( ii ) పరిమాణము :—
కర్రసామాగ్రి ఉపయోగమును ఆధారంగా పరిమాణము ( సైజు ) నిర్ణయింపబడుతుంది. అయితే దాని ఆకారము దానికి కావలసిన పటిష్టత, అవసరపడు కర్రకు అయ్యే ఖర్చు మున్నగు వివరములు కూడా పరిమాణమును నిర్ణయించుటలో తోడ్పడుతవి.
( iii ) ఇతర వివరములు :—
ఉపకరణములను తయారుచేయుటకుగాను ఉపయోగించెడి కర్ర వివరములు, వివిధ జాయింట్లను ఏర్పరచు విధానము , దానిపై నగీషీలు ఏర్పరుచు పద్దతి మున్నగు వివరములుకూడ కర్ర ఉపకరణము రూపకల్పన ( డిజైను ) లో తోడ్పడతవి. అయితే యీ వివరముల ఆధారముగా దానిని రూపకల్పన గావించినపుడు దాని ఉపయోగమునకు యే విధమైన అవరోధము లేకుండా చూడాలి.
B. పటమును గీయుట :
కర్రసామాగ్రిని రూపకల్పన చేయునపుడే దాని వివిధభాగముల చిత్తు పటములను గీస్తూ వాటి డిజైనుకు కావలసిన ఆవశ్యకతలను పొందుట జరుగుతుంది. విడిభాగముల చిత్తు పటములను ( Rough sketches ) దృష్టిలో పట్టుకొని, ఆ భాగములను కలిపినపుడు కర్రసామాగ్రి యే విధముగా ఏర్పడుతుందో తెలిపెడి పటమును గీయవలసి వుంటుంది. ఈ పటమును ' వర్కింగ్ డ్రాయింగ్ ' ( Working drawing ) అంటారు. దీనిలో తెలిపిన వివిధ సూచనలను గమనిస్తూ, వాటి ఆధారముగా వర్కషాప్ లోని కర్రపనిచేయువ్యక్తి ఆ కర్రసామాగ్రిని తయారుచేస్తాడు. ఈ డ్రాయింగ్ లో
కర్రసామాగ్రి ఆకారము, అన్ని కొలతలు మరియు దానిని తయారుచేయుటలో వర్కర్ తెలుసుకొనవలసిన అన్ని వివరములు పూర్తిగా సూచింపబడివుంటవి. కర్రసామాగ్రిని తయారుచేయుటలో ముందుగా విడి విడి భాగములను చేసుకొని వాటిని తగిన విధముగా కలపవలసి వుంటుంది కదా! కావున డ్రాయింగ్ లో విడి విడి భాగముల పటములు, వాటిని కలిపెడి జాయింట్ల వివరములు, పటములు మరియు మోల్డింగులు మొదలైన నగిషీ పనుల వివరములు చేర్చవలసియుంటుంది.
వర్కింగ్ డ్రాయింగ్ లను మూడు విధములుగా వేయవచ్చును.
( i ) ఒక కోణములో కర్రసామాగ్రిని చూచినపుడు అది కనపడెడి ఆకారమును గీయు విధానము మొదటిది. ఈ పటములో అన్ని కొలతలు సరిగా గుర్తించాలి. దీనినే ' ఫ్రీ హాండ్ డ్రాయింగ్ ' ( Free hand drawing ) అంటారు.
( ii ) కర్ర ఉపకరణము పరిమాణమునకు సమానమైన కొలతలతో పటమును గీచువిధానము రెండవది. ఈ విధముగా గీయునపుడు ఉపకరణమును పై నుండి, ముందువైపు నుండి చూచునపుడు అది యే విధముగా కనబడుతుందో ఆ దృశ్యములను గీయవలెను.
ఉపకరణమును పై నుండి చూచునపుడు
కనబడు దృశ్యమును ' ప్లాన్ ' ( Plan ) అంటారు. దానిని ముందువైపు నుండి చూచునపుడు కనబడు దృశ్యమును ' ఎలివేషన్ ' ( Elevation ) అంటారు. కుడి లేదా ఎడమ ప్రక్కల నుండి దానిని చూచునపుడు కనబడు దృశ్యమును సైడ్ వ్యూ ( Side view ) అంటారు.
ఈ పటములను డ్రాయింగ్ పేపరుమీద లేదా సన్నని కర్రపలక మీద గీయవచ్చును. ఈ కర్రపలకను ' వర్కింగ్ బోర్డు ' అంటారు. కర్ర ఉపకరణము పూర్తి కొలతలతో గీసిన ఈ పటమును ' ఫుల్ సైజు డ్రాయింగ్ ' అంటారు. ఈ పటముయందు సాధారణముగా కొలతలను సూచింపరు.
కర్ర ఉపకరణమును చేయునపుడు కర్రవస్తువును వర్కింగ్ బోర్డు పైనగల పటముపై పెట్టి జాయింట్లు, చీలికలు మొదలగు వాటిని కర్రవస్తువుపైన గుర్తింపవచ్చు. ఉపకరణమును తయారుచేయునపుడు దాని కొలతలను వర్కింగ్ బోర్డు పైన గీయబడిన పటము కొలతలతో పోల్చి చూచుకొనవచ్చును.
వర్కింగ్ బోర్డు పైన పటమును గీయుటకు స్టీలు రూలు, పెన్సిల్ , ట్రై స్క్వేర్ ఉపయోగిస్తాయి. ఎక్కువ సంఖ్యలో కర్రసామాగ్రిని తయారుచేయుటకుగాను ' వర్కింగ్ బోర్డు ' ఎక్కువగా ఉపయోగిస్తుంది. దీని పై గీయబడిన పెన్సిల్ రేఖలు సరిగా కనిపించుటకుగాను ముందుగా దీనిపై తెల్లని సుద్దముక్కను గీయాలి.
( iii ) కర్రసామాగ్రికి నిర్ణయించిన కొలతలను తగిన నిష్పత్తిలో తగ్గించి డ్రాయింగ్ పేపర్ పై గీయుట మూడవ పద్ధతి. ఈ విధముగా తగ్గించి గీచిన డ్రాయింగును ' స్కేలు డ్రాయింగ్ ' అంటారు.
C. కర్రసామాగ్రిని తయారుచేయుట :
వర్కింగ్ డ్రాయింగ్ పై సూచింపబడిన కొలతల ననుసరించి కర్రసామాగ్రిని తయారుచేయుటకై క్రింద వివరించిన పద్ధతి నవలంబించాలి.
( a ) కర్రముక్కలను సిద్ధముచేయుట :—
ముందుగా కర్రసామాగ్రి విడివిడి భాగములను చేయుటకుగాను కావలసిన సైజుగల కర్రముక్కలను సిద్ధము చేసుకొనాలి. వాటిపైన వివిధ తలములు, అంచులు యే విధముగా వుండవలయునో గుర్తుపెట్టుకొనాలి.
( b ) కర్రముక్కలను అమర్చుకొనుట :—
దీనినే ' సెటింగ్ అవుట్ ' అంటారు. వర్కింగ్ డ్రాయింగ్ ప్రకారము అన్ని కర్రముక్కలను కలిపి అమర్చుకొనాలి. వాటిపైన జాయింట్లు, చీలికలు, రిబేట్లుగల స్థలములను గుర్తించాలి. దీనివలన తొలగించవలసిన కర్రభాగములు గుర్తింపబడుతవి.
( c ) కర్ర ముక్కలను కోయుట :—
తగిన పనిముట్లను ఉపయోగించి కర్రముక్కలను కోసి కావలసిన ఆకారమునకు మార్చాలి. జాయింట్లు, రిబేట్ల నుండి తొలగించవలసిన కర్రను కోసి తొలగించివేయాలి.
( d ) విడిభాగములను కలుపుట :—
విడిగా చేయబడ్డ వివిధ కర్రసామాగ్రి భాగములను కలుపుకొని కర్రసామాగ్రిని అమర్చాలి. చేయవలసిన మార్పులు, అమరికలు పరిశీలించాలి. ఈ విధముగా పరిశీలించుటకుగాను అమర్చిన కర్రసామాగ్రి జాయింట్లయందు జిగురు, స్ర్కూలు మొదలగునవి ఉపయోగింపరాదు.
పిదప కావలసిన అమరికలుచేసి అన్ని విడిభాగములను ప్లేను, స్ర్కేపర్ , సాండ్ పేపరు మొదలగునవి ఉపయోగించి నునుపుపరచాలి. పిదప జిగురు, స్ర్కూలు మొదలగు వానినుపయోగించి వాటిని కలపాలి.
( e ) ఫినిషింగ్ :—
విడిభాగములను కలుపుట వలన యేర్పడిన కర్రసామాగ్రి అన్ని తలములను, అంచులను గాజు కాగితముతో నునుపుపరచాలి. పిదప వార్నింష్ లేదా పెయింట్ పూత వేయాలి.
కొన్ని కర్ర ఉపకరణములను చేసెడి విధానములనుగురించి ఇప్పుడు తెలుసుకుందాము.
( గమనిక :— అన్ని కొలతలు మిల్లీ మీటర్లలో తెలపబడినవి. )
A. చిన్న బల్ల :---
కర్రముక్కల విడి భాగములను కోయవలసిన కొలతలు :
కొలతలు — పై పలక ...... 300 x 300 x 12
కావలసిన సంఖ్య — ఒకటి
కొలతలు — కాళ్లు .... 450 x 30 x 30
కావలసిన సంఖ్య — నాలుగు
కొలతలు — అడ్డు పలకలు .... 300 x 50 x 18
కావలసిన సంఖ్య — నాలుగు
కొలతలు — బటన్లు .... 36 x 24 x 12
కావలసిన సంఖ్య — ఎనిమిది
ఇతర వివరములు :—
( a ) 18 మి.మిా. వ్యాసముగల స్ర్కూలు ఎనిమిది సిద్ధపరచుకొనవలెను.
( b ) ఉపయోగించవలసిన జాయింట్ మోర్ టైస్ అండ్ టెనస్ జాయింట్.
నిర్మాణ పద్ధతి :---
1. ముందుగా కర్రముక్కలను పైన పేర్కొనబడిన కొలతలకు తగిన సైజులో కోసి సిద్ధపరచాలి.
2. బల్లకాళ్లను మరియు అడ్డుపలకలను వాటి, వాటి స్థానములలో వుండునట్లు అమర్చి కలపవలసిన మూలలను గుర్తుపెట్టాలి.
3. అన్ని కర్రముక్కలపై చేయవలసిన చీలికలు, రిబేట్లు, వంపులు మొదలగునవి సరిగా గుర్తించాలి.
4. అడ్డుపలకలపై టెనన్లు యేర్పరచాలి. ఇందుకుగాను టెనన్ పొడవును అడ్డుపలకలపై మార్కింగ్ చాకుతో గుర్తించాలి. ఒక అడ్డుపలకలపై ముందుగా కొలతను సరిగా గుర్తించి పిదప ఆ కొలతనుపయోగిస్తూ మిగిలిన
అడ్డుపలకలపై కొలతలను గుర్తించాలి.
5. పిదప బల్లపై భాగమున అడ్డుపలకల టెనన్లకు సరిపడు మోర్ టైస్ లను గుర్తించాలి. గుర్తింపబడిన టెనన్ మందము, మోర్ టైస్ మందములను కొలిచిచూడాలి. టెనన్ల చివరలలో మీటరింగ్ చేయాలి.
6. కర్రముక్కలపై చీలికలను, రిబేట్లను, వంపులను కోసి, ప్లేన్ తో నునుపుపరచాలి.
7. అడ్డుపలకలపై ఱంపముతో కోసి టెనన్ లను యేర్పరిచి, ప్లేన్ తో నునుపుపరచాలి.
8. ఒక కర్రముక్కను కోసి బటన్లను తగుసైజులో తయారుచేయాలి. బటన్ ఆకారము పటము 3.3 లో చూపబడింది. బటన్లపై రంధ్రములుచేసి, కౌంటర్ సంక్ చేయాలి. ఈ రంధ్రములలో కౌంటర్ సంక్ స్ర్కూలు అమర్చబడతవి.
9. అడ్డుపలకలు మరియు బల్లకాళ్లలోపలివైపు తలములను నునుపుపరచాలి. ముందుగా వ్యతిరేకదిశలో వున్న రెండు కాళ్లజతలను అడ్డుపలకలతో కలుపుకొనాలి. కాళ్లు సరిగా ( అనగా నిలువుగా, బిగుతుగా ) అమర్చబడినవా లేదా సరిచూడాలి. పిదప రెండు కాళ్లజతలను కలిపెడి అడ్డుపలకలతో బల్ల ఫ్రేమును కలిపి తయారుచేయాలి.
10. అడ్డుపలకలు కాళ్లకు కలపబడి స్థలమును ప్లేను ద్వారా చదునుపరచి నునుపుచేయాలి. కళ్ల వెలుపలివైపు మూలలను ప్లేను ద్వారా వంపుగా చేయాలి.
11. అవసరమైనయెడల కాళ్ల అడుగు భాగమున వెలుపలివైపు జాగ్రత్తగా రిబేటింగ్ చేయాలి. ( పటములో రిబేటింగ్ చేయబడిన కాళ్లు చూపబడ్డాయి ).
12. ప్లేను ద్వారా బల్లపై పలక నాలుగు అంచులను వంపుగా చేయాలి. బటన్లద్వారా పై పలకను అడ్డుపలకలను కలపాలి. బటన్లను పై పలకను స్ర్కూల ద్వారా కలుపుకొని అడ్డుపలకలో చేయబడిన చీలికలలో బటన్లను కూర్చొనబెట్టుట ద్వారా పై పలక అడ్డుపలకకు కలుపబడుతుంది.
13. చివరగా అన్ని భాగములను శుభ్రపరచి, పాలిష్ చేసి వార్నిష్ పూత పూయాలి.
B. చిన్న బీరువా ( small cabinet )
తీసు కొనవలసిన కొలతలు — కావలసిన సంఖ్య
ప్రక్కభాగములు ... 450 x 200 x 12.... రెండు
పైభాగము ....300 x 200 x 12 ... ఒకటి
క్రిందభాగము ...300 x 200 x 12 ... ఒకటి
లోపలి షెల్పు ....305 x 200 x12 ... ఒకటి
( ప్లైవుడ్ )
షెల్పుకు ఆధారముగా
యుండు ఫిల్లెట్లు ...175 x 12 x 9 ...రెండు
హాండిల్ ....150 x 12 x 12 ....ఒకటి
కాళ్లు ..... 25 x 25 x 25 ....నాలుగు
తలపు ..... 425 x 275 x 12 ...ఒకటి
నిర్మాణ పద్ధతి :---
1. ముందుగా కర్రను కోసుకొని తగిన కొలతలతో అన్ని భాగములకు కర్రపలకను తయారుచేసుకొనాలి. విడిభాగములను కలుపుకొని జాయింట్లు యేర్పరచు చివరలలో సుమారు 3 లేక 4 మి.మీ. ఎక్కువ కొలత వుండునట్లు చూడాలి.
2. జాయింట్లను యేర్పరుచుస్ధలములను ముందుగా గుర్తించాలి.
3. బీరువా వెనుకభాగపు కర్రైపలకయందు పై భాగమున మరియు ప్రక్క భాగములయందు రిబేట్లను యేర్పరచాలి.
4. పైభాగపు కర్రపలకయందు రెండు చివరల డవ్ టెయిల్ చీలికల నేర్పరచునట్లు మార్కింగ్ చేయాలి. అదే విధముగా క్రిందభాగపు కర్రపలకయందు రెండు చివరలలో డవ్ టెయిల్ చీలికల నేర్పరచునట్లు మార్కింగ్ చేయాలి.
5. పిదప ఱంపముతో కోసి డవ్ టెయిల్ ను యేర్పరచాలి.
6. ఫెల్ఫును అమర్చుటకుగాను మోర్ టైస్ మరియు టెనస్ జాయింట్లను యేర్పరుచు గుర్తులను పెట్టుకొనాలి. ఇందుకుగాను రెండు ప్రక్కభాగపు కర్రలయందు సుమారు 30 మి.మీ. పొడవు మరియు 15 మి.మీ వెడల్పుగల దీర్ఘచతురస్రాకారపు చీలికలను యేర్పరచాలి.
7. క్రింది భాగమును సూచించెడి కర్రపలక వెనుకభాగమును చీలికచేసి దానిలో వెనుకభాగపు కర్రపలక పట్టునట్లు చూడాలి.దీనిలో వృధాగా పైకి చొచ్చుకువచ్చిన కర్రపలకను కోసివేయాలి.
8. పైభాగపు మరియు ప్రక్కభాగపు కర్రపలకలపై చేసిన రిబేటుల అంచులను ప్లేను ద్వారా చదునుపరచాలి.
9. మోర్ టైస్ లయందు, టెనన్ ల యందు, డవ్ టెయిలయందు వృధాగా పైకి చొచ్చుకువచ్చిన కర్రను కోసివేసి చదునుపరచాలి.
10. హాండిల్ ను బిగించవలసిన స్ధలము గుర్తించాలి.
11. బీరువా కాళ్లను తగినకొలతలతో టర్నింగ్ చేసుకొని, వాటియందు రంధ్రములను చేయాలి. ఈ రంధ్రముల ద్వారా స్ర్కూల నమర్చి వాటిని బీరువా అడుగు పలకకు బిగించవచ్చును.
12. పిదప అన్ని భాగములను అమర్చుకొని చూడాలి. అవసరమైన విధంగా కొలతలను మార్చుకొని సరిగా అమర్చబడేట్లుగా చూడాలి.
13. అన్ని భాగములను విడదీసి, శుభ్రపరచి , జిగురుద్వారా జాయింట్లను అంటిస్తూ తిరిగి అమర్చుకొనాలి. బీరువాపై నాలుగు మూలలను వంపుగా నునుపుపరచాలి.
14. కాళ్లను జిగురుతో అంటించి, స్ర్కూలతో బిగించాలి.
15. తలుపులను బట్ కీళ్ల ద్వారా అమర్చాలి. తలుపుకు హాండిల్ ను స్ర్కూలద్వారా బిగించాలి.
16. నునుపుపరచి వార్నిష్ లేదా పెయింట్ పూత పూయాలి.
C . కుర్చీ :---
వివిధ భాగములను కోసుకొనవలసిన కొలతలు :
కొలతలు — కావలసిన సంఖ్య
ముందు కాళ్లు.... 425 x 30 x 30 ... రెండు
వెనుక కాళ్లు .....900 x 75 x 25 .... రెండు
వీపును ఆనించుకొనుటకుగాను
ఫ్రేము కొరకు :---
వంపుదిరిగినఅడ్డు కమ్మీలు..336x30x25 ...రెండు
ప్రక్క నిలువ కమ్మీలు....325x 30x 25 ...రెండు
మధ్యవిలువ కమ్మీలు...325x75x12...ఒకటి
సీటు ఫ్రేముకై ఆధారముగా
యుండు :
ప్రక్కఅడ్డుకమ్మీలు....335x35x15...రెండు
వెనుకభాగపుఅడ్డుకమ్మీ...335x25x15...ఒకటి
ముందుభాగపుఅడ్డుకమ్మీ....375x35x20... ఒకటి
క్రింది అడ్డు కమ్మీలు :---
ప్రక్కవి .....350x25x15......రెండు
వెనుకది....335x25x15.....ఒకటి
ముందుది....380x25x15....ఒకటి
సీటు ఫ్రేము :---
ప్రక్క భాగములు....320x50x20.....రెండు
వెనుక భాగము.....304x50x20 ......ఒకటి
ముందు భాగము.....340x50x20......ఒకటి
నిర్మాణ పద్ధతి :
1. కుర్చీని తయారు చేయుటలో ఎక్కువ యిబ్బంది కలిగించేది ఏటవాలుగాయున్న దాని నిర్మాణము. దీనిములంగా మోర్ టైస్ లు, టెనన్ లు తిన్నగా కాకుండా కొంత కోణములో యేర్పరచాలి. వీటి కోణములను ఖచ్చితంగా తెలుసుకొనుటకుగాను పై నుండి చూచినపుడు కుర్చీ ఏ విధముగా కనబడుతుందో ఆ పటమును ( అనగా ప్లానును ) పూర్తి కొలతలతో గీయాలి. దీనినే ' ఫుల్ సైజుప్లాన్ ' అంటారు.
2. కర్ర కోసుకొని పైన పేర్కొనబడిన వివిధ భాగములను తగిన కొలతలతో యేర్పరచాలి.
3. ముందుగా కుర్చీ కాళ్లను ప్లేనుతో చదునుపరచి తగిన ఆకారమునకు తీసుకొనిరావాలి. పొడవైన వెనుక కాళ్లు ఏటవాలుగా వుండునటమూలముగా వాటి మందమునకు మూడు రెట్లు కొలతలతో కర్రముక్కను తీసుకొనాలి. దీనిని పటములో చూపినట్లు ఏటవాలుగా చదునుపరచాలి.
4. కాళ్లయందు అడ్డు కమ్మీలు అమర్చు స్థలములను గుర్తించి, అచ్చట మోర్ టైస్ లను
ఏర్పరచాలి. అదేవిధంగా అడ్డు కమ్మీల చివరలలో టెనన్ లు యేర్పరచాలి.
5. వీపును ఆనించుకొను రెండు అడ్డు కమ్మీలు వంపుతిరిగి యుండాలి. ముందుగా రెండు చివరలలో టెనన్ లు యేర్పరచిన పిదప దానిని ప్లేను ద్వారా చదునుపరచుచు వంపు ఆకారమునకు మార్చాలి. పిదప నిలువు కమ్మీలను అమర్చెడి మూడు మోర్ టైస్ లు ( చీలికలు ) యేర్పరచాలి.
6. నిలువ కడ్డీలను మూడింటికి ప్రతిదానికి రెండు చివరలలో టెనన్ లు యేర్పరచి, వాటిని
అడ్డు కమ్మీలకు బిగించాలి. పిదప స్టోక్ షేవ్ ను ఉపయోగిస్తూ అడ్డు కమ్మీలు, నిలువ కమ్మీలను నునుపుపరస్తూ సరియైన వంపు ఆకారము వుండునట్లు చేయాలి.
7. సీటును అమర్చెడి అడ్డు కమ్మీల పై టెనన్ లను యేర్పరచాలి.
8. పిదప ముందు, వెనుకగల అడ్డు కమ్మీలను కుర్చీ కాళ్లకుగల మోర్ టైస్ లలో టెనన్ లను కూర్చొనబెట్టుట ద్వారా బిగించాలి. వీటిని శుభ్రపరచి జిగురుతో అంటించాలి.
9. ఈ విధముగా అమర్చబడిన భాగము ఫుల్ సైజు ప్లానును ఒక కాగితముపై గీయాలి. దీనివలన ప్రక్కలకు అమర్చబడెడి అడ్డు కమ్మీల ఖచ్చితమైన పొడవును నిర్ణయించవచ్చును.
10. కుర్చీ కాళ్లకు క్రిందవైపున బిగించెడి అడ్డు కమ్మీలలో ప్రక్కన వుండునవి, సీటును అమర్చెడి ప్రక్క అడ్డు కమ్మీలకన్న కొద్దిగా పొడవుగా వుంటవి. దీనికి కారణము కుర్చీ కాళ్లు ఏటవాలుగా వుండి వాటి మధ్య దూరము క్రిందివైపు ఎక్కువ వుండుటయే. క్రిందనగల ప్రక్క అడ్డు కమ్మీల ఖచ్చితమైన దూరమును నిర్ణయించుటకు కుర్చీ క్రింది భాగపు ఫుల్ సైజు సైడ్ ఎలివేషన్ ను గీయాలి. అనగా ప్రక్కవైపు నుండి చూచినపుడు కుర్చీ భాగము ఏవిధముగా కనబడుతుందో, దానిని పూర్తి సైజులో గీయాలి. ఈ విధముగా గీయుటవలన పని సులభసాధ్యమగుతుంది.
11. పిదప అన్ని అడ్డు కమ్మీలను అమర్చుకొని సరిచూచుకొనాలి. అవసరమైన యెడల తగిన అమరికలు చేసుకొనాలి. సీటును తగిలించుకొను
అడ్డు కమ్మీల మూలలందు L— ఆకారములో వున్న ( కోణాకారపుదిమ్మ ) ఆంగిల్ బ్లాక్ ను స్ర్కూలతో బిగించాలి.
12. సీటు ఫ్రేమును తయారుచేయుటకై అడ్డు కమ్మీలను, మోర్ టైస్ మరియు టెనన్ జాయింట్లతో కలుపుకొని జిగురుతో అంటించాలి. ఆంగిల్ బ్లాక్ ల పై సీటు ఫ్రేమును అమర్చి జిగురుతో అంటించి స్ర్కూలతో బిగించాలి.
13. సీటు ఫ్రేమును తయారుచేయుటకై ఉపయోగించెడి మరియొక పద్ధతి పటము 3.12 లో చూపబడింది.
D. బల్ల సొరుగు ( Table Drawer ):
బల్ల సొరుగు కొలతలు దానిని అమర్చవలసిన చట్రము కొలతల ఆధారపడియుంటుంది. క్రిందసూచింపబడిన కొలతలు కేవలము ఉదాహారణగా పరిగణించాలి.
సొరుగు వివిధ భాగములను తయారుచేయవలసిన కొలతలు :
సొరుగు ముందుపలక —200x75x15—ఒకటి
ప్రక్క పాలకలు —125x75x10— రెండు
వెనుక పలక —200x60x10— ఒకటి
అడుగు పలక —170x120x3 —ఒకటి
స్లీప్ —110x15x10— రెండు
హాండిల్ —36x15x6—ఒకటి
గమనికలు :— 1.సొరుగు ముందుపలక కొలతలు చట్రములో యేర్పరచబడిన ఖాళీస్ధలము కొలతలకు సమానముగావుండి అది దానిలో గట్టిగా బిగింపబడినట్లు వుండాలి.
2. ప్రక్కపలకల మందము ముందుపలకల మందము కన్నా 3 నుండి 5 మి.మీ. తక్కువుగా వుండాలి. వీటి పొడవు చట్రములో సొరుగుకై యేర్పరచిన ఖాళీస్ధలము ప్రక్కభాగముపొడవు కన్నా 10
నుండి 12 మి.మీ. తక్కువగా వుండాలి ఇది సొరుగుకై యేర్పరచిన ఖాళీస్ధలము యందు ప్రక్కభాగములో బిగుతుగా అమర్చబడిలి.
3. వెనుక పలక మందము ప్రక్క పలకల మందముతో సమానముగా వుండాలి. సొరుగుయొక్క వర్కింగ్ డ్రాయింగ్ పటము 3.13లో చూపబడింది.
నిర్శాణ పద్ధతి :
1. మందుగా విడిభాగములకు తగిన కర్రపలకను సిద్దము చేసుకొనాలి. వాటి ఒక వైపు ఉపరితలము మరియు ఒకవైపు అంచు చదునుపరచి నునుపుచేయాలి.
2. అన్ని కర్రముక్కలను తగిన స్ధానములలో వుంచుకొని సొరుగు ఆకారము యేర్పడునట్లు చూడాలి. పెన్సిల్ తో కలపవలసిన జాయింట్లను గుర్తుపెట్టుకొనాలి. ఈ విధముగా గుర్తించినపుడు చదును పరచబడిన తలములు లోపలివైపు మరియు చదునుపరచబడిన క్రిందవైపు వుండాలి. ( పటము 3.14)
3. సొరుగు ముందుపలక మరియు వెనుకపలకలను ప్రక్క పలకలను కలుపుటకు సాధారణంగా లాప్ డ్ డవ్ టెయిల్ జాయింట్ వాడతారు. ( పటము 3.15)
4. మార్కింగ్ గేజితో లేదా పెన్సిల్ తో డవ్ టెయిల్ చీలికలు మరియు పిన్నుల కొలతలు మార్కింగ్ చేయాలి. ప్రక్కపలకలయందు పిన్నులు మరియు ముందు, వెనుక పలకలయందు చీలికలు యేర్పరచునట్లు గుర్తించాలి.
5.ఱంపముతో తోస్తూ డవ్ టెయిల్ పిన్నులను, చీలికలను యేర్పరచాలి.( పటము 3.16 ).
6. సొరుగు ముందుపలకపై హాండిల్ ను అమర్చెడి స్ధలమును గుర్తించాలి.
7. స్లిప్ లయందు చీలికను యేర్పరచాలి. ( పటము 3.17 ). స్లిప్ యందు సొరుగు ముందుకూ, వెనుకకు సులభముగా కదులుతుంది. సొరుగు చట్రములో ముందుకు, వెనుకకు కదిలెడి స్లిప్ జాయింట్లు వివిధ రకములుగా వుంటాయి. ( పటము 3.17 ).
8. పిదప అన్ని భాగముల లోపలి తలమును శుభ్రపరచి, జిగురుతో అంటించి కలుపుకొనాలి.
9. జిగురు ఆరిన పిదప అన్ని ప్రక్క భాగములను శుభ్రపరచి చదునుపరచి, సొరుగుబల్ల ఖాళీస్థలములో బిగుతుగా పట్టునట్లు చూడాలి.
10. పిదప జిగురుతో స్లిప్ లను వాటి స్థానములలోయుంచి అడుగు పలకను అమర్చాలి. సొరుగు వెనుకభాగమును స్ర్కూద్వారా పిన్నుద్వారా బిగించాలి.
12. ఫ్రేము అన్నిభాగములను కలుపుకొని జిగురుతో అంటించాలి. కావలసిన స్ర్కూ రంధ్రములను చేసుకొనాలి.
13. ఫ్రేముకు బ్రాకెట్ ను స్ర్కూ ద్వారా బిగించాలి.
14. శుభ్రపరచి వార్నిష్ పూత పూయాలి.
బీరువాల ఫిట్టింగులు :
బీరువాలను తయారుచేయునపుడు వాటికి బిగింపవలసిన తాళము, కీళ్ళు, హాండిల్ మొదలగు ఫిట్టింగులు బీరువా అందమును ఇనుమడింప జేసేదిగా వుండాలి.ఈ ఫిట్టింగులు ( వీటినే ' హార్డ్ వేర్ ' అంటారు. ) మార్కెట్ లో హార్డ్ వేర్ షాపుయందు లభ్యమగుతవి. వివిధ తయారీదార్లు చేసిన యీ ఫిట్టింగులు అనేక సైజుల్లో, అనేక నమూనాల్లో లభ్యమగుతవి. ఫిట్టింగును ఎన్నికచేయునపుడు గమనించవలసిన విషయములు క్రింద పేర్కొనబడినవి.
( i ) అది తయారు చేయబడిన పదార్థము ఉదా॥ ఉక్కు, ఇత్తడి, ప్లాస్టిక్ మొదలగు విషయము.
( ii ) దానిపై యివ్వబడిన పూత లేదా దాని నునుపుదనము. ఉదా॥ క్రోమియంపూత, నికెల్ పూత లేదా నునుపు పరచబడిన ఇత్తడి మొదలగు వివరము.
( iii ) అది ఒకే భాగంగా చేయబడిందా లేదా తయారైనదా అన్నవివరము.
పై వివరములు ఆ ఫిట్టింగు యొక్క మన్నికను సూచిస్తవి.
ఫిట్టింగులను కొనునపుడు తయారీదారు కేటలాగులో సూచించిన సైజులలో తగినదానిని ఎన్నుకొనాలి.
వివిధరకముల ఫిట్టింగులను గురించి యిపుడు తెలుసుకొందాము.
1. కీళ్లు :—
వివిధరకముల కీళ్లు ( Hinges ) పటములో చూపబడ్డాయి. వీటిని కొనునపుడు గమనించవలసిన విషయములు. ( a ) దాని సైజు ( అనగా పొడవు ). ఇది పటములో చూపినట్లు వివిధరకాలుగా సూచింపబడుతుంది. ( b ) అది ఏలోహముతో చేయబడింది అన్నవివరము ( ఉదా. ఉక్కు, ఇత్తడి మొదలగునవి )
కీళ్లను తలుపులు, మూతలు మున్నగువాటిని తయారుచేయునపుడు ఉపయోగిస్తారు. దీనిని కర్రసామగ్రికి బిగించుటకుగాను క్రింది పద్ధతి అవలంబించాలి.
1. ముందుగా కీలు బిగించవలసిన స్థలమును సరిగా మార్కింగ్ చాకుతో గుర్తించాలి.
2. కర్రవస్తువులో కీలు బయటకు చొచ్చుకు రాకుండా ఉండునట్లు బిగించాలి. అందుకై కీలు మందములో సగభాగమును మార్కింగ్ గేజి ద్వారా కర్రవస్తువు పై గుర్తించాలి.
3. పిదప డవ్ టెయిల్ ఱంపముతో గుర్తింపబడిన కర్రభాగమును తొలగించాలి. ఈ విధముగా తొలగింపగా ఏర్పడిన ఖాళీస్థలములో కీలును స్ర్కూల ద్వారా బిగించాలి.
2. సొరుగును బయటకు లాగు హాండిల్ :—
క్రింది పటములో వివిధ రకములైన హాండిళ్లు చూపబడ్డాయి. వీటిని బల్ల సొరుగుకు స్ర్కూల ద్వారా బిగిస్తారు. వీటిని చేతితో పట్టుకొని బల్ల నుండి సొరుగును బయటకు లాగవచ్చును. ఇవి లోహముతో లేదా ప్లాస్టిక్ తో లేదా కర్రతోగానీ చేయబడతాయి.
3. సొరుగుకు అమర్చెడి తాళము :—
పటములో సొరుగుకు అమర్చెడి తాళము చూపించబడింది. దీనిని సొరుగుకు బిగించుటకు క్రింద తెలిపిన పద్ధతి అవలంబించాలి.
( i ) ముందుగా సొరుగు ముందుపలక పైన మధ్యభాగమును నిలువు గీతగీయుట ద్వారా గుర్తించాలి.
( ii ) సొరుగు తాళము పైనగల ప్లేటునుండి తాళముచెవిని దూర్చెడి రంధ్రము కేంద్ర బిందువు వరకు గల దూరమును మార్కింగ్ గేజిపై అమర్చి
దానిని సొరుగు ముందుపలక పై అంచునుండి అడ్డగీతను గీయుటద్వారా గుర్తించాలి.
( iii ) ఈ రెండు గీతలు ఖండించెడి బిందువు కేంద్రమును తాళముచెవి రంధ్రమునకు సరిపడు
రంధ్రమును ముందుపలక పై చేయాలి. పిదప కీ- హోల్ ఱంపము ద్వారా తాళము రంధ్రమును సరిగా యేర్పరచాలి.
( iv ) పిదప తాళముకప్పను పటములో చూపినట్లు దాని సైజుకు తగినంత మందముగల కర్రను కోసి, ఆ ఖాళీస్థలములో స్ర్కూలతో అమర్చాలి.
4. బీరువాకు అమర్చెడి తాళము :—
పటములో బీరువాకు అమర్చెడి తాళము చూపించబడింది. దీనిని గూడా సొరుగుతాళమును బిగించు పద్ధతి నవలంబిస్తూ
బీరువా తలుపును బిగించాలి.మ్మ లులులులులలరబ
గోడలో దిగగొట్టెడి కర్రదిమ్మలు :—
కొన్ని సందర్బాలలో చిన్నబీరువాలను, పటముల ఫ్రేములకు ఆధారమగు అడ్డుపలకలు,
ఎలక్ర్టికల్ వైరింగును కలిగిన కర్రపలకలు గోడలకు బిగింపవలసి యుంటుంది. ఇటుకలు, సిమెంటు మొదలగువాటితో చెయబడిన గోడలయందు మేకులు, స్ర్కూలు మొదలగునవి దిగగొట్టుటద్వారా వీటిని గోడలకు బిగింపవచ్చును. అయితే గోడలలోనికి దింపబడిన వీటికి ఆ వస్తువులను పట్టుకొనెడి శక్తి ఎక్కువగావుండదు. కాబట్టి సాధారణంగా గోడలలోనికి చిన్న కమ్మదిమ్మలను దిగగొట్టి వాటికి మేకులు, స్ర్కూల ద్వారా అయా వస్తువులను బిగింపవచ్చును. ఈ కమ్మదిమ్మలను ' కర్రప్లగ్గులు ' ( Wooden plugs ) అని కూడా అంటారు.
కర్రప్లగ్గులు చదునుగా, చదరంగా లేదా గుండ్రంగా వుండి కొద్దిగా ఏటవాలుగా వుంటాయి. వివిధ రకముల కర్రప్లగ్గులు పటములో చూపబడ్డాయి.
ప్లగ్గులను గోడలలోనికి దింపుటకు వుపయోగించెడి పనిముట్లను ' ప్లగ్గింగ్ ఉలులు ' ( Plugging chisels ) అంటారు.
పటములో చూపబడిన ఈ ఉలుల ద్వారా ఇటుకలను కలిపిన మోర్టారును తొలగించుట సాధ్యపడుతుంది. వీటిని సుత్తెతో మెల్లిగా కొట్టుతూ గోడల రంధ్రమును చేయాలి. డ్రిల్ బిట్ ను ఉపయోగించినపుడు ఒకసారి సుత్తెతో కొట్టిన పిదప దానిని చేయబడిన రంధ్రములో కొద్దిగా గుండ్రముగా త్రిప్పాలి. ఈ విధముగా చేయబడిన రంధ్రము యందు కమ్మదిమ్మను దిగగొట్టాలి. గోడవెలుపలికి చొచ్చుకువచ్చిన భాగమును కోసివేసి గోడతో సమముగా వుండునట్లు చేయాలి.
యూనిట్ — 1
అభ్యాసము
1. లేత్ యంత్రముపై ఉపయోగించు యేవేని మూడు పనిముట్లను పేర్కొని, వాటిని గురించి వివరింపుము.
2. ' స్పిండిల్ టర్నింగ్ ' అనగానేమి? ఏ విధమైన కర్రవస్తువులకు స్పిండిల్ టర్నింగ్ ఉపయోగిస్తారు.
3. ' పేస్ ప్లేట్ టర్నింగ్ ' చేయు విధానమును వివరింపుము.
4. బ్యాండ్ ఱంపము వివిధ భాగములను పేర్కొనుము.
5. కొత్త బ్లేడును బ్యాండ్ ఱంపముపై బిగించు విధానమును వివరింపుము.
6. ' రిప్పింగ్ ఫెన్స్ ' ' మీటర్ గేజ్ 'ల ఉపయోగమును వివరింపుము.
7. సర్కులర్ ఱంపముపై కర్రను కోసెడి పద్ధతులలో యేవేని మూడింటిని వివరింపుము.
8. గ్రైండింగ్ యంత్రము వివిధ భాగములను పేర్కొని, వాటిని గురించి వివరింపుము.
9. గ్రైండింగ్ చేయునపుడు అవలంబించవలసిన జాగ్రత్తలేవి?
10. ప్లేనింగ్ యంత్రము వివిధ భాగములను వివరింపుము.
11. వివిధరకముల సాండర్ యంత్రములను పేర్కొని, వాటిలో యేదెని ఒకదానిని గురించి వివరింపుము.
12. స్పిండిల్ సాండర్ కు, డిస్క్ సాండర్ కుగల భేదమేమి? స్పిండిల్ సాండర్ పై పనిచేయు విధానమును వివరింపుము.
13. కర్రపనిచేయు యంత్రములపై పనిచేయునపుడు అవలంబించవలసిన జాగ్రత్తలేవి?
యూనిట్ —2
అభ్యాసము
1. పంచభుజిని నిర్మించు పద్ధతిని వివరింపుము.
2. 50 మి.మిా. భుజము కొలతలతో షడ్భుజిని సులభపద్ధతిలో గీయుటను వివరింపుము.
3. రేఖాపటములను గీయుటకు ఉపకరించు వివిధ డ్రాయింగ్ పరికరముల పేర్లను పేర్కొనుము.
4. 20 మి.మిా. భుజము కొలతగల దశభుజిని సులభపద్ధతిలో నిర్మించు పద్ధతిని వివరింపుము.
5. దీర్ఘవృత్తమును నిర్మించు పద్ధతులను పేర్కొనుము.
6. 120 మి.మిా. పెద్ద అక్షము, 80 మి.మిా. చిన్న అక్షముగల దీర్ఘవృత్తమును క్రింద తెలిపిన
పద్ధతుల ననుసరించి డ్రాయింగ్ పేపరుపై గీయుము.
( a ) పేపరు ముక్క పద్ధతి
( b ) దారము, పిన్నుల పద్ధతి
7. కర్ర ఉపకరణముపై నగిషీలు చేసెడి మూడు పద్ధతులను వివరింపుము.
8. ' మోల్డింగ్ 'లను గురించి వివరింపుము. మోల్డింగ్ చేసెడి విధానమును వివరింపుము.
యూనిట్ —3
అభ్యాసము
1. కర్రసామగ్రిని డిజైను చేయునపుడు గమనించవలసిన విషయములేవి?
2. ' వర్కింగ్ డ్రాయింగ్ ' ను గీసెడి వివిధ పద్ధతులను వివరింపుము.
3. బల్ల సొరుగును తయారుచేయు పద్ధతిని వివరింపుము.
4. కర్చీని తయారుచేయు పద్ధతిని వివరింపుము.