యూనిట్ -1
కర్రపనియందు ఉపయోగపడు యంత్రములు
ఉపోద్ఘాతము :
చేతితో వివిధ పనిముట్లను ఉపయోగించి కర్రపనిచేయు విధానములను తొమ్మిదవ తరగతిలో తెలుసుకొనియున్నాము. అయితే కర్రపనిని త్వరితముగా చేసుకొనుటకు మరియు అతి కచ్చితమైన కొలతలను కర్రసామాగ్రిపై సాధించుటకు చేతి పనిముట్లు పనికిరావు. వీటికి బదులు యంత్రపనిముట్లను ( Machine Tools ) ఉపయోగించవలసి యుంటుంది. యంత్రశక్తి ద్వారా పనిచేసెడి ఈ పనిముట్లు ఎక్కువ వేగముతో మరియు ఎక్కువశక్తితో పనిచేస్తాయి. ఉదాహరణకు చేతితో హాండిల్ ను త్రిప్పుకొని పనిచేయించెడి డ్రిల్లింగ్ యంత్రముకన్నా విద్యుత్ శక్తితో పనిచేసెడి పోర్టబుల్ డ్రిల్లింగ్ యంత్రము కర్రవస్తువుయందు త్వరగా మరియు ఖచ్చితమైన కొలతలతో రంధ్రములను చేస్తుంది.
అయితే చేతి పనిముట్లను ఉపయోగించుటకన్నా యంత్రపనిముట్లను ఉపయోగించుటలో ఎక్కువ నైపుణ్యత ( Skill ) అవసరమగుతుంది. చేతి పనిముట్లను ఉపయోగించుటకై కండబలము ( అనగా మానవశక్తి ) అవసరమవుతుంది. యంత్ర పనిముట్టుకు కండబలము అవసరములేదు. కాని యంత్ర పనిముట్టును సరిగా ఉపయోగించుటకై తగిన బుద్ది కుశలత, అనుభవము, పరిజ్ఞానము అవసరమగును.
యంత్రపనిముట్లను ఉపయోగించునపుడు గమనించవలసిన విషయములు :
1. యంత్ర పనిముట్టును ఉపయోగించుటకు ముందు, ఆ యంత్ర భాగముల గురించి, అవి పనిచెసెడి విధానముగురించి మరియు ఆ యంత్రముతో వివిధ పనులను నెరవేర్చు పద్ధతులను గురించి వివరముగా తెలుసుకొనాలి. క్రొత్తగా పని నెరవేర్చుకొనువారు యంత్రము పనిచేయునపుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి. యంత్రమును గురించి తెలిసినవ్యక్తిని ప్రశ్నించి యంత్ర వివరములను తెలుసుకొనాలి.
2. నిర్దేశించిన పనిచేయించెడి యంత్ర పనిముట్టును, ఆ పనికి మాత్రమే ఉపయోగించాలి. ఆ పనిని నెరవేర్చుటకుగాను
వివిధ యంత్రములు ఉన్నయెడల వాటిలో ఉత్తమమైన ఫలితములనిచ్చునది, సులభముగా పనిచేయునది మరియు ఎక్కువ రక్షణనిచ్చునది యే యంత్తమో కనుగొని దానిని ఉపయోగించాలి.
3. యంత్రము పై పనిచేయునపుడు ఒకేసారి రెండు లేక ఎక్కువ పనులు చేయరాదు. యంత్రము నుపయోగిస్తూ ఒకే పనిని నెరవేర్చుచు, ఆ పనిమీదనే దృష్టిని, మనస్సును కేంద్రీకరించాలి.
4. యంత్రము పై అమర్చిన పనిముట్టు వదులుగా యున్నయెడల యంత్రము పనిచేయునపుడు పనిముట్టు ఎగిరిపడి పనిచేసెడి వ్యక్తికి లేదా దగ్గరగావున్న యితరులకు హాని కలిగియుండవచ్చును. యంత్రము పై పనిముట్టు గట్టిగా అమర్చబడియుండునట్లు చూడాలి.
5. యంత్రమును స్టార్టు చేసి, దాని విద్యుత్ మోటారు పనిచేయునపుడు యంత్రమును వదలి దూరంగా పోరాదు. మోటారు పనిచేస్తున్న విషయము తెలియని యితర వ్యక్తి యంత్రమును సమీపించి, దానిపై యేదైనా పనిచేసినయెడల అతనికి హాని జరగవచ్చును.
6. యంత్రముపై నిర్దేశించిన స్థలములలో అప్పుడప్పుడు కందెనవేస్తూవుండాలి. యంత్రము తయారీదారు సూచనలమేరకు కందెనను ఉపయోగించాలి.
7. విద్యుత్ మోటారుతో నడపబడెడి యంత్రములన్నింటికి ' ఎర్తింగ్ ' ( Earthing ) చేయాలి. పోర్టబుల్ విద్యుత్ యంత్ర పనిముట్లకు యీ సూచన అతిముఖ్యమైనది.
8. యంత్రముపై పనిచేయుటలో తగిన అనుభవము సంపాదించిన వ్యక్తికి యంత్రము పనిచేయునపుడు వెలువడు శబ్దము బాగా అవగతమై వుంటుంది. యంత్రము పనిచేయునపుడు మామూలుగా వెలువడు ధ్వనికన్న భిన్నముగా వింత శబ్దము వెలువడినయెడల వెంటనే యంత్రము పనిచేయుటను ఆపి, ఆ వింత శబ్దమునకు కారణమును తెలుసుకొనాలి. దానికి సంబందించిన లోపములను సవరించిన పిదపనే మరల యంత్రముపై పనిసాగించాలి.
9. యంత్రము పై పనిచేయునపుడు వదులైన దుస్తులు తొడుగరాదు. పొడుగుచేతుల చొక్కా చేతులను మోచేతులవరకు మడచుకొనవలెను. పనిచేయునపుడు యితరులతో సంభాషణలు చేయరాదు. ప్రక్కలకు చూస్తూ పనిచేయరాదు. రెండు చేతులనుపయోగించవలసిన పనికి ఒకే చేతిని వుపయోగించరాదు.
10. ప్రతి యంత్రము ఒకపద్ధతి ( సూత్రము ) ననుసరించి పనిచేస్తుంది. ఈ పద్ధతిని సరిగ్గా నెరవేర్చుటకుగాను ఆ యంత్రమునకు కావలసిన పరిరక్షణ తెలుసుకొని అది సరిగా నిర్వహించాలి.
పైన పేర్కొన్న వివరములు ప్రతియంత్రమునకు పనికివస్తాయి. కర్రపనియందు ఉపయోగించు కొన్ని ముఖ్యమైన యంత్రముల గురించి వివరముగా తెలుసుకుందాము.
కర్రపనికి ఉపయోగించు లేత్ యంత్రము :--
లేత్ యంత్రము యందు కర్రవస్తువును యంత్రము పై అమర్చి వేగంగా గుండ్రముగా త్రిప్పెడి సదుపాయముంటుంది. గుండ్రముగా తిరిగెడి కర్రవస్తువుపై తగిన పనిముట్టును చేతితో నొక్కిపెట్టుచు కర్రవస్తువుకు తగిన ఆకారమును యిస్తాయి.
లేత్ యంత్రము యందు విద్యుత్ మోటారు ద్వారా గుండ్రముగా త్రిప్పబడెడి
' స్పిండల్ ' ( Spindle ) అనబడు స్థూపాకారపు గొట్టముంటుంది. విద్యుత్ మోటారు ఒకేవేగముతో తిరుగుతుంది. స్పిండల్ ను వివిధ వేగములతో త్రిప్పుటకుగాను మోటారు మరియు స్పిండల్ ప్రత్యేక పద్ధతిలో కలుపబడి వుంటాయి. మోటారు షాప్టు మరియు స్పిండల్ కలుపెడి బెల్టు స్టెప్ కోన్ పుల్లీలపైన ( Step cone pulleys ) అమర్చబడి యుంటుంది. వివిధ వ్యాసముల ( సైజు ) చక్రములతో ( pulleys ) స్టెప్ కోన్ పుల్లీ ఒకే భాగంగా తయారు చెయబడి యుంటుంది. మోటారు షాప్టు పైన ఒక స్టెప్ కోన్ పుల్లీ మరియు స్పిండల్ పైన రెండవ స్టెప్ కోన్ పుల్లీలు బిగింపబడి వుంటాయి. పటములో చూపినట్లు యివి వ్యతిరేక దిశలో అమర్చబడివుంటాయి. అనగా ఒకదాని చిన్న చక్రము మరియు రెండవదాని పెద్ద చక్రము ఒకే లైనులో వుంటాయి. రెండు స్టెప్ కోన్ పుల్లీల మీదుగా బెల్టు అమర్చబడి యుంటుంది. బెల్టును ప్రక్కలకు జరుపుకొని కావలసిన సైజుగల పుల్లీ పైకి తెచ్చుకొనవచ్చును.
మోటారు షాప్టు పై గల చక్రమును
" త్రిప్పెడి చక్రము " ( Driving pulley ) అని మరియు స్పిండల్ పై గల పుల్లీని
" త్రిప్పెడి చక్రము " ( Driving pulley ) అని అంటారు. మోటరు పనిచేయునపుడు గుండ్రముగా తిరిగెడి " త్రిప్పెడి చక్రము ", స్పిండల్ పై గల త్రిప్పబడెడి చక్రమును గుండ్రముగా త్రిప్పుతుంది కాబట్టి యీ చక్రములు ఆ పేర్లతో పిలువబడతాయి.
ఇక్కడ గమనించవలసిన విషయములు :
1. త్రిప్పబడెడి చక్రముకన్నా త్రిప్పెడి చక్రము సైజు చిన్నగా వున్నపుడు, స్పిండల్ వేగము మోటరు వేగముకన్నా తక్కువగుతుంది.
2. అదేవిధముగా త్రిప్పబడెడి చక్రము వ్యాసముకన్నా త్రిప్పెడి చక్రమువ్యాసము ఎక్కువగాయున్నపుడు స్పిండల్ వేగము మోటరు వేగముకన్నా ఎక్కువగా వుంటుంది.
3. స్పిండల్ వేగము మోటరు వేగముకన్నా
ఎంత ఎక్కువగా లేదా తక్కువగా వుంటుంది. అన్న విషయము బెల్టు కలిపిన త్రిప్పెడి మరియు త్రిప్పబడు చక్రముల వ్యాసముల పై ఆధారపడియుంటుంది. ఈ వేగమును తెలుసుకొనుటకుగాను క్రింద సూచించిన సూత్రమును వుపయోగించాలి.
త్రిప్పబడెడి చక్రము వేగము
—————————————— =
త్రిప్పెడి చక్రము వేగము
త్రిప్పబడెడి చక్రము వ్యాసము
———————————————
త్రిప్పెడి చక్రము వ్యాసము
ఈ వేగములను ఒక నిముషమునకు షాఫ్ట్ ( లేదా స్పిండిల్ ) తిరుగు చుట్లలో కొలుస్తారు. వీటిని R.M.P ( Revolutions per minute ) లలో సూచిస్తారు.
బెల్టును పుల్లీలపైన మార్చుకొనుము లేత్ యంత్రము యందు స్పిండిల్ ను 300 నుండి 3600 R.P.M వరకు మధ్య గల నియమిత వేగములతో త్రిప్పవచ్చును.
4. కొన్ని లేత్ యంత్రము యందు స్పిండిల్ వేగములను మార్చుకొనుటకు వివిధ వేగములతో పనిచేయు విద్యుత్ మోటారును వాడతారు.
లేత్ యంత్రము పనిచేయు సూత్రము :
లేత్ యంత్రము పనిచేయునపుడు కావలసిన వేగముతో స్పిండిల్ గుండ్రముగా తిరుగుతుంది కదా! స్పిండిల్ పైనగల స్ర్కూలసహాయముతో ఫేస్ ప్లేట్ అనబడు గుండ్రని ప్లేట్ ను స్పిండిల్ కు అమర్చవచ్చును లేదా గొట్టములాంటి స్పిండిల్ లోపలి ఏటవాలు రంధ్రము యందు ' స్పర్ సెంటర్ ' ను ( Spur centre ) లేదా ' లైవ్ సెంటర్ ' ను ( Live center ) బిగించవచ్చును.
కర్రవస్తువును ఫేస్ ప్లేట్ పైన లేదా సెంటర్ల మధ్య అమర్చిన యెడల స్పిండిల్ తిరుగునపుడు దానితో బాటు కర్రవస్తువు కూడా గుండ్రముగా తిరుగుతుంది. గుండ్రముగా తిరిగెడి వస్తు ఉపరితలముపైన పదునైన మొన కలిగిన ఉలివంటి పనిముట్టును చేతితో నొక్కిపెట్టి వస్తు ఉపరితలముసను ఖండిస్తూ కావలసిన ఆకారములోనికి మార్చుకొనవచ్చును. అయితే
లేత్ యంత్రము పైన గుండ్రని మరియు వంపుతిరిగిన ఆకారములను మాత్రమే పొందవచ్చును. చదునైన ఉపరితలమును పొందలేము. చేతితో నొక్కిపెట్టబడిన పనిముట్టును తగిన విధముగా నేర్పుతో జరుపుకుంటూ వస్తువుపై కావలసిన ఆకారమును పొందవచ్చును.
లేత్ యంత్రపు వివిధ భాగములు :
కర్రపనికి ఉపయోగపడు లేత్ యంత్రము క్రింద సూచింపబడిన వివిధ భాగములను కలిగియుంటుంది.
1. పీఠము ( బెడ్ ) :—
ఇది పోతయినుముతో ( Cast Iron ) చేయబడి తగినంత ఎత్తుగల స్టాండ్ పైన లేదా పునాదిపై బోల్టుల ద్వారా బిగింపబడియుంటుంది. దీని ఉపరితలమును సమతలంగాయుండి దానిపై హెడ్ స్టాక్ , టెయిల్ స్టాక్ మరియు టూల్ రెస్ట్ లు అమర్చబడి యుండి, వాటికి ఆధారంగా బెడ్ పనిచేస్తుంది.
2. హెడ్ స్టాక్ :—
ఇది ఖాళీపెట్టె ఆకారములో పోతయినుముతో చేయబడిన లోపలిభాగమున స్పిండిల్ ను కలిగియుంటుంది. ఒకవేల స్పిండల్ మోటారుతో నేరుగా కలుపబడియున్నచో, మోటారు కూడా హెడ్ స్టాక్ లోనే అమర్చబడియుంటుంది. స్పిండిల్ బెల్టు ద్వారా
త్రిప్పబడిన యెడల స్టెప్ కోన్ పుల్లీ హెడ్ స్టాక్ లో అమర్చబడియుంటుంది. హెడ్ స్టాక్ లో స్పిండిల్ రెండు బోరింగుల ద్వారా బిగింపబడి హెడ్ స్టాక్ కు రెండువైపులా వెలుపలకు తీయబడియుంటుంది. హెడ్ స్టాక్ బెడ్ పైన ఎడమచివర స్థిరంగా బిగింపబడియుంటుంది.
గొట్టము ఆకారములో చేయబడిన స్పిండిల్ లోపలి రంధ్రము ఏటవాలుగా వుండి స్పర్ సెంటర్ ను అందులో బిగించుకొనవచ్చును. స్పిండిల్ వెలుపలి భాగము యందు ( కుడి వైపు మరియు ఎడమవైపు ) స్ర్కూ మరలు ( Screw threads ) ను కలిగియుండి వాటిపైన ఫేస్ ప్లేట్ ను బిగించుకొనవచ్చును. స్పర్ సెంటర్
ద్వారా లేదా ఫేస్ ప్లేట్ పైన కర్రవస్తువును అమర్చుటద్వారా స్పిండిల్ కు బిగించవచ్చును.
స్పిండిల్ తిరుగునపుడు కర్రవస్తువు కూడా గుండ్రముగా తిరుగుతుంది.
3. స్పర్ సెంటర్ :—
దీనినే ' లైవ్ సెంటర్ ' ( Live center ) అంటారు. ఇది ఏటవాలు స్తూపాకారమును కలిగియుండి మేలురకపు ఉక్కుతో చేయబడియుంటుంది. స్పిండిల్ కుగల ఏటవాలు రంధ్రములో దీనిని ప్రవేశపెట్టి బిగించుకొనవచ్చును. దీని కుడివైపు చివర శంఖు ఆకారముతో కోసుగాయుండి దాని పదునైన కొనభాగము కర్రవస్తువుకు ఎడమవైపు చివర మధ్యభాగములో చేయబడిన రంధ్రములో కూర్చుంటుంది. స్పిండిల్ తో పాటు స్పర్ సెంటర్ తిరిగి కర్రవస్తువును కూడా గుండ్రముగా త్రిప్పుతుంది.
4. టెయిల్ స్టాక్ ( Tail stock ) :—
ఇది బెడ్ పైన కుడివైపు చివర బోల్టు ద్వారా బిగింపబడియుంటుంది. అవసరమైనచో బోల్టును వదులుచేసి, టెయిల్ స్టాక్ ను బెడ్ పైన కదల్చి హెడ్ స్టాక్ వైపునకు తీసుకురావచ్చును. హెడ్ స్టాక్ మరియు టెయిల్ స్టాక్ సెంటర్ల మధ్య బిగింపబడెడి కర్రవస్తువు పొడవునుబట్టి వాటిమధ్య దూరమును మార్చుకొనవలసియుంటుంది. టెయిల్ స్టాక్ పొతయినుముతో చేయబడిన దీనికి ' డెడ్ సెంటర్ ' బిగింపబడియుంటుంది.
5. డెడ్ సెంటర్ ( Dead center ) :—
ఇది మేలురకపు ఉక్కుతో లైవ్ సెంటర్ ఆకారములోనే చేయబడి టెయిల్ స్టాక్ స్పిండిల్ కు గల ఏటవాలు రంధ్రములో బిగింపబడియుంటుంది. కోసుగా శంఖు ఆకారములోయున్న దీని ఎడమవైపుమొన కర్రవస్తువు కుడివైపు మధ్యలోచేయబడిన రంధ్రములో అమర్చబడియుంటుంది. ఇది కర్రకుగల రంధ్రములో కూర్చున్నచోట కొద్దిగా కందెన వేయుటవలన కర్రవస్తువు సులభముగా తిరగగలుగుతుంది డెడ్ సెంటర్ కర్రవస్తువుతోపాటు తిరగదు. టెయిల్ స్టాక్ నకు
కుడివైపు చివర అమర్చబడిన చక్రము స్పిండిల్ పైన బిగింపబడియుంటుంది. దీనిని చేతితో త్రిప్పుకొనుటద్వారా డెడ్ సెంటర్ ను కొద్దిగా ముందుకు లేదా వెనుకకు జరుపుకొనవచ్చును.
6. టూల్ రెస్ట్ ( Tool Rest )
కర్రవస్తువు లేత్ యంత్రము స్పిండిల్ తో పాటు వేగంగా గుండ్రముగా తిరుగునపుడు దాని ఉపరితలము పై పనిముట్టును ఆనించి చేతులతో నొక్కిపెట్టుట ద్వారా కర్రపొరలు పొరలుగా విడదీయబడుతుంది. అయితే పనిముట్టును చేతితో నొక్కిపెట్టినపుడు, గుండ్రముగా తిరిగెడి కర్రవస్తువు వేగమువలన పనిముట్టు క్రిందకు నెట్టివేయబడు అవకాశమున్నది. దీనిని నివారించుటకుగాను
' టూల్ రెస్ట్ ' ఉపయోగిస్తుంది. ఇది హెడ్ స్టాక్ కు మరియు టెయిల్ స్టాక్ కు మధ్యగా బెడ్ పైన అమర్చబడియుంటుంది. దీనికిగల క్లాంప్ స్ర్కూను త్రిప్పుకొని దీనిని వదులు చేసుకొని బెడ్ పైన జరుపుకొనవచ్చును.
7. విద్యుత్ మోటారు :—
లేత్ యంత్రపు స్పిండిల్ ను గండ్రముగా త్రిప్పుటకుగాను అవసరపడు యంత్రశక్తిని విద్యుత్ మోటారు యిస్తుంది. దీని శక్తి 0.5 నుండి 0.75 H.P. వరకు వుంటుంది. విద్యుత్ మోటారు షాఫ్ట్ స్పిండిల్ కు బెల్టు ద్వారా కలుపబడుతుంది.
లేత్ యంత్రము సైజు :—
లేత్ యంత్రము సైజును రెండువిధములుగా సూచిస్తారు.
1. రెండు సెంటర్ల మధ్యగల గరిష్ఠ దూరము అనగా యీ రెండింటి మధ్య అమర్చబడెడి కర్రవస్తువు గరిష్ఠ పొడవు.
2. బెడ్ ఉపరితలమునుండి లైవ్ సెంటర్ కుగల మధ్యదూరము. ఈ ఎత్తును ' స్వింగ్ ' ( Swing ) అంటారు. యంత్రము పై బిగించెడి కర్రవస్తువు గరిష్ఠ వ్యాసార్థమును యిది సూచిస్తుంది. పై రెండుకొలతలు గూడ మిల్లీమీటర్లలో పేర్కొంటారు.
లేత్ యంత్రము పై ఉపయోగించు వివిధ పనిముట్లు :—
లేత్ యంత్రము పై బిగించిన కర్రవస్తువు
గుండ్రముగా తిరిగినపుడు తగిన పనిముట్టునుపయోగించి దానిని ఖండిస్తూ తగిన ఆకారమునకు మార్చుపనిని ' టర్నింగ్ ' ( Turning ) అంటారు. ఇందుకుగాను ఉపయోగించు పనిముట్లను ' టర్నింగ్ పనిముట్లు ' అని అంటారు.
టర్నింగ్ పనిముట్లు కర్రవస్తువు ఖండించటానికిగాను పదునైన మొనభాగమును కలిగియుంటవి. పదునులేని అంచుగల పనిముట్టును ఉపయోగించిన యెడల అది కర్ర ఉపరితలమును పొరలు , పొరలుగా చీల్చుటకు బదులు దానినుండి పొడి రూపములోనున్న కర్రపొట్టును వెలువరుస్తుంది. అంతే కాకుండా టర్నింగ్ చేసిన కర్ర ఉపరితలము మృదువుగా వుండదు. పదునైన మొన కలిగిన పనిముట్టు వలన టర్నింగ్ పని సులభముగా జరుగుతుంది.
టర్నింగ్ పనిముట్టు పొడవైన బ్లేడు భాగమును కలిగియుండి దాని ఒక చివర పదునుపెట్టబడిన అంచునుకలిగి యుంటుంది. రెండవచివర కడ్డీ ఆకారపు ' టాంగ్ ' భాగమును కలిగియుండి దానిద్వారా బ్లేడు కర్రతో చేయబడిన హాండిల్ రంధ్రమునందు బిగింపబడియుంటుంది. దీని పదునైన అంచువెడల్పు దీని సైజుగా సూచింపబడుతుంది. కర్రపనియందు ఉపయోగపడు వివిధ టర్నింగ్ పనిముట్లను గురించి క్రింద వివరింపనైనది.
1. టర్నింగ్ గౌజు ( Turning Gouge ) :—
దీని బ్లేడు మొత్తం పొడవు వంపుతిరిగి వెలుపలిభాగము ఉబ్బెత్తుగావుండి అదే ఆకారముతో పదునైన అంచును కలిగియుంటుంది. దీని సైజు 6 మి.మిా. నుండి 30 మి.మిా. వరకు వుంటుంది. ఇది నునుపుగా లేని కర్రవస్తువు ఉపరితలము నుండి కర్రను త్వరగా ఖండించటానికి మరియు దాని పై లోతైన తలములను ఏర్పరుచుటకు ఉపయోగిస్తుంది.
2. టర్నింగ్ ఉలి ( Turning Chisel ):—
దీనినే ' స్క్యూ ఉలి ' ( Scew Chisel ) లేదా ' సైడ్ ఉలి ' ( Side Chisel ) అంటారు. దీని ఖండించెడి అంచు రెండువైపులా అరగదీయబడి, పదును పెట్టబడియుంటుంది. ఇదికూడా 6 మి.మిా. నుండి 30 మి.మిా. వరకు వివిధ సైజులలో లభ్యమవుతుంది. టర్నింగ్ గౌజును ఉపయోగించిన పిదప కర్రవస్తువు ఉపరితలముపై యేర్పడిన గీతలను, సన్ననిచీలికలను, ఎత్తుపల్లములను తొలగించటానికి యిది పనికివస్తుంది. దీనిపదునైన అంచు ముందు, వెనుక భాగములను ఉపయోగిస్తూ పైనతెలిపిన పనులే కాకుండా కర్రవస్తువు చివర భాగములను సమపరచవచ్చును.
3. రౌండ్ నోస్ ఉలి ( Round nose chisel ) :—
దీని ఒకవైపు భాగము మాత్రమే అరగదీయబడి పదును పెట్టుటద్వారా యేర్పరచబడిన పదునైన అంచును కలిగియుంటుంది. దీనిద్వారా కర్రవస్తు ఉపరితలంనందు లోతైన కోతలను యేర్పరచుట సాధ్యపడుతుంది. గిన్నెలాంటి వెడల్పైన లోతుగల సామాగ్రిని చేయునపుడు రాపిడిగావిస్తూ కర్రను తొలగించుటకుయిది పనికి వస్తుంది.
4. పార్టింగ్ పనిముట్టు (parting Tool ):—
దీని బ్లేడు యొక్క పదునైన అంచు 3 మి.మీ వెడల్పును కలిగియుంటుంది. దీనినుపయోగించి కర్రవస్తువును ఖండించుట లేదా దానిపై తగిన పొడవును గుర్తించుట చేయవచ్చును.
5. పదునైన మొనకలిగిన ఉలి :—
దీనినే ' డైమాండ్ పాయింట్ ఉలి ' లేదా ' స్పియర్ పాయింట్ ఉలి ' అని అంటారు. దీనిబ్లేడు ఖండించెడి అంచు పదునుపెట్టబడి వాడిమొన వలె యేర్పరచబడియుంటుంది. ఎత్తు వల్లములతో కూడిన కర్రవస్తువు ఉపరితలమునుంది ఎత్తైన భాగములను అరగ దీయుటకు, కర్రవస్తు చివరభాగములను చదునుపరచుటకు, కర్రవస్తు ఉపరితలమును నునుపుపరచుటకు యిది వాడబడుతుంది.
6. ఫేసింగ్ ఉలి ( Facing chisel ) :—
దీనిబ్లేడు ఒక ప్రక్క భాగము అరగదీయబడిపదును పెట్టబడి సాధారణ ఉలివలె యేర్పరచబడియుంటుంది. దీని ద్వారా వస్తు ఉపరితలముపై ఎత్తులను రాపిడిగావించి అరగదీయుటకు యిది పనికి వస్తుంది. ఫేస్ ప్లేట్ ను ఉపయోగించి టర్నింగ్ చేయునపుడు కర్రవస్తు ఉపరితలముపై నుండి కర్రను తొలగించుటకు యిది ఎక్కువుగా వుపయొగిస్తుంది. దీనినే 'చదునైన ఉలి ' లేదా ' స్క్వేర్ నో ఉలి ' అంటారు.
1.3.5 కర్రవస్తువును టర్నింగ్ చేయు విధానము :
కర్రవస్తువును రెండు పద్ధతుల నుపయోగించి టర్నింగ్ చేయవచ్చును
1. కటింగ్ :—
ఈ పద్ధతి యందు పనిముట్టును కర్రవస్తు ఉపరితలమునకు తగిన కోణమును చేయునట్లు ఏటవాలుగా అమర్చాలి. పనిముట్టు పదునైన అంచును కర్రవస్తు ఉపరితలముపై దాని అక్షమునకు క్రిందగా యుండునట్లు ఆనించి వుంచాలి. అది ప్రక్కకు తొలగినపుడు తిరిగి తగినదిశలోనికి జరుపుతూరావాలి. ఈ పద్ధతిలో కర్రవస్తువు ఉపరితలమును నునుపుగా చేయవచ్చును. కటింగ్ చేసిన పిదప తిరిగిగాజు కాగితముతో నునుపుపరచవలసిన పనిలేదు.
క్రొత్తగా పనినేర్చుకొనువారికి యిది కష్టతరమైన పద్ధతి. తగినంత అనుభవమును పొందిన పిదప, యీ పద్ధతి నుపయోగించి కర్రవస్తువును నునుపుపరచవచ్చును. అయితే కర్రవస్తువుయందు కణముల అమరిక దాని పొడవు దిశలో యున్నపుడుమాత్రమే ఈ పద్ధతిని వుపయోగించాలి.
2. స్ర్కేపింగ్ :—
ఈ పద్ధతియందు పనిముట్టును టూల్ రెస్ట్ పై అడ్డముగా ( అనగా కర్రవస్తువు ఉపరితలమునకు లంబదిశలో ) పట్టుకొని కర్రవస్తువులోనికి దిగునట్లుగా నెట్టాలి. పనిముట్టు కర్రవస్తువు ఉపరితలములో మధ్యభాగమును తగులుతూ వుండాలి. కర్రవస్తువుయందు కణముల అమరిక లేత్ యంత్రపు అక్షమునకు అడ్డముగా వూన్నపుడు ఈ పద్ధతి ఉపయోగించాలి. స్ర్కేపింగ్ చేసిన పిదప సాండ్ పేపర్ తో కర్రవస్తువు ఉపరితలమును నునుపుపరచవలసి యుంటుంది.
1.3.6 టర్నింగ్ విధానాలు :—
కర్రవస్తువును లేట్ యంత్రముపై బిగించుకొని టర్నింగ్ చేసుకొనుటకు రెండు పద్ధతులలో జరపవచ్చును. కర్రవస్తువును యంత్రము స్పిండిల్ కు అనర్చెడి విధానములో భేధముండుటవలన ఈ రెండు పద్ధతులేర్పడ్డాయి.
( 1) ఫేస్ ప్లేట్ టర్నింగ్ :—
పొడవు తక్కువగా, ఎక్కువ వెడల్పును కలిగియున్న గిన్నెలు, ట్రేలు మొదలగు వాటిని తయారుచేయునపుడు కర్రవస్తువును ఫేస్ ప్లేట్ కు బిగించి టర్నింగ్ చేయుటకు ఫేస్ ప్లేట్ టర్నింగ్ అంటారు.
( 2 ) స్పిండిల్ టర్నింగ్ :—
పొడవు ఎక్కువగావున్న కుర్చీ కాళ్ళు బల్లలకాళ్ళు, బ్యాటులు మొదలగు కర్రసామాగ్రిని తయారుచేయునపుడు హెడ్ స్టాక్ , స్పిండిల్ కు బిగించిన లైవ్ సెంటర్ మరియు టెయిల్ స్టాక్ కు అమర్చిన డెడ్ సెంటర్ మధ్య కర్రవస్తువును అమర్చి టర్నింగ్ చేయుటకు ' స్పిండిల్ టర్నింగ్ ' లేదా ' సెంటర్ టర్నింగ్ ' అంటారు.
1.3.7 ఫేస్ ప్లేట్ టర్నింగ్ :—
దీనియందు కర్రవస్తువును ఫేస్ ప్లేట్ ( Face plate ) అనబడు గుండ్రముయినుపు ప్లేట్ కు స్ర్కూలతో బిగిస్తారు. ఫేస్ ప్లేట్ ను హెడ్ స్టాక్ స్పిండిల్ పైన బిగిస్తారు. దీనితో స్పిండిల్ తిరిగినపుడు దాని దానితోపాటు ఫేస్ ప్లేట్ గుండ్రముగా తిరుగుతుంది. ఫేస్ ప్లేట్ తోపాటు గుండ్రముగా తిరిగెడి కర్రవస్తువును తగిన పనిముట్టు నుపయోగించి స్ర్కేపింగ్ చేయుటవలన ఆ వస్తువును తగిన ఆకారములోనికి మార్చవచ్చును.
ఫేస్ ప్లేట్ టర్నింగ్ వివిధ రకములుగా కర్రవస్తువును ఖండించు పనిముట్లు క్రింద పేర్కొనబడినవి:
ఉలి పేరు : రౌండ్ నోస్ ఉలి
ఉపయోగము : లోపలివైపు వంపు తిరిగినట్లు ఖండించుటకు
ఉలి పేరు : టర్నింగ్ ఉలి
ఉపయోగము : బయటివైపు వంపు తిరిగినట్లు ఖండించుటకు
ఉలి పేరు : ఫేసింగ్ ఉలి
ఉపయోగము : వంపులు లేకుండా తిన్నగా ఖండించుటకు
ఉలి పేరు : డైమండ్ పాయింట్ ఉలి
ఉపయోగము : V — ఆకారముగా ఖండించుటకు
ఉలి పేరు : పార్టింగ్ ఉలి
ఉపయోగము : ఉపరితలము నుండి లోతుగా ఖండించుటకు
3.8 ఫేస్ ప్లేట్ టర్నింగ్ చేయు విధానము :—
1. ముందుగా బ్యాక్ ఱంపము నుపయోగించి కర్రవస్తువును కావలసిన దానికన్నా సుమారు 4 లేదా 5 మి.మిా. ఎక్కువ వ్యాసము కలిగి యుండునట్లు గుండ్రముగా పళ్లెము ( Disc ) ఆకారములో కోయాలి.
2. ఈ విధముగా గుండ్రముగా కోయబడ్డ కర్రవస్తువుకంటే చిన్నగాయున్న ఫేస్ ప్లేట్ ను ఎన్నుకొనాలి.
3. ఫేస్ ప్లేటును మరియు కర్రవస్తువును కలుపుచు స్ర్కూలను దించుట ద్వారా వాటిని ఒకదానిలో నొకటి బిగించవచ్చును. ఒకవేళ కర్రవస్తువు యందు స్ర్కూ రంధ్రములు చేయుటకు వీలుకానప్పుడు కర్రవస్తువునకు ఏదైనా గుండ్రని కర్రముక్కను జిగురుతో అంటించాలి. ఈ కర్రముక్కను ' బ్యాంకింగ్ బ్లాక్ ' ( Backing block ) అంటారు. జిగురుతో అంటించిన ఉపరితలముల మధ్య ఎక్కువ మందముగల కాగితమును పెట్టి వాటిని కలుపుకొనినయెడల, టర్నింగ్ పని ముగిసిన పిదప ఆ రెండింటిని సులభముగా విడదీయుట సాధ్యపడుతుంది.
4. పిదప ఫేస్ ప్లేట్ ను బ్యాంకింగ్ బ్లాక్ అడుగు భాగమునకు స్ర్కూల ద్వారా బిగించాలి. ఈ విధముగా బిగించినపుడు ఫేస్ ప్లేట్ మరియు కర్రవస్తువుల కేంద్రములు ఒకే సరళరేఖలో వుండునట్లు జాగ్రత్త వహించాలి.
5. లేత్ యంత్రము నుండి లైవ్ సెంటర్ ను విడదీసి, స్పిండిల్ నకు ఫేస్ ప్లేట్ ను బిగించాలి.
6. టూల్ రెస్ట్ ను వదులుచేసి బెడ్ పైన దానిని కదిలిస్తూ కర్రవస్తు కేంద్రభాగమునకు సుమారు 3 లేదా 4 మి.మీ. క్రిందుగా వుండునట్లు అమర్చాలి. టర్నింగ్ చేయవలసిన
ఉపరితలమునుండి కూడా 3 లేదా 4 మి.మీ.
దూరము వుండాలి. కర్రవస్తువును గుండ్రముగా చేతితో త్రిప్పుకొని టూల్ రెస్ట్ కర్రవస్తు ఉపరితలమునుండి పైన తెలిపిన దూరములో వున్నదీ, లేనిదీ గమనించుకొని సరిచేయాలి.
7. కర్రవస్తువును గుండ్రముగా త్రిప్పుటకు కావలసిన వేగమును నిర్ణయించుకొనాలి. సాధారణంగా తక్కువవేగము ( అనగా 600 R.M.P వరకు ) సరిపోతుంది. అయితే 75 మి.మీ. కన్న తక్కువ వ్యాసముగల కర్రవస్తువులను ఈ పద్ధతిలో టర్నింగ్ చేసుకొనుటకు 1200 R.M.P వరకు పోవచ్చును.
8. టర్నింగ్ పనిచేయువ్యక్తి లేత్ యంత్రమునకు 45॰ కోణములో ఏటవాలుగా హెడ్ స్టాక్ వైపు తిరిగియుండునట్లు నిలబడాలి. బరువు రెండు కాళ్లపై సమంగా పడునట్లు నిలబడాలి. కుడిచేతితో టర్నింగ్ ఉలి హాండిల్ చివరభాగమును పట్టుకొనాలి. ఎడమ చేతివ్రేళ్లతో ఉలి బ్లేడును టూల్ రెస్ట్ పై నొక్కిపెట్టుచు దానిపై తగిన విధంగా కదిలిస్తూ టర్నింగ్ పనిచేయాలి. లేత్ యంత్రమును స్టార్ట్ చేయుటకు ముందుగానే యీవిధముగా నిలుచుని, ఉలి కర్రవస్తువునకు సరియైన పొజిషన్ లో వున్నదీ, లేనిదీ పరిశీలించుకొనాలి.
9. ఉబ్బెత్తుగా యున్న ఉపరితలమును పొందుటకుగాను టర్నింగ్ ఉలి యొక్క చదునైన భాగమును టూల్ రెస్ట్ పైన సమతలముగా వుండునట్లు అమర్చి, బ్లేడును పట్టుకొన్న చేతివ్రేళ్ల ఆధారముగా హాండిల్ ను
కదిలిస్తూ దాని ఖండించెడి అంచు కావలసిన చాపములోనికి తిరుగునట్లు చేయాలి.
10. అదేవిధముగా లోపలివైపు వంపు తిరిగిన
ఉపరితలములను పొందుటకుగాను రౌండ్ నోస్ ఉలి చదునైన భాగమును టూల్ రెస్ట్ పైన సమతలముగా వుండునట్లు ఆనించియుంచిదాని బ్లేడును కావలసిన వట్రుతలమును ఖండించునట్లు తగిన చాపములోనికి తిరుగునట్లు చేయాలి.
11. పైన తెలిపిన పద్ధతి నవలంబిస్తూ కర్రవస్తు ముఖభాగములో కూడా ఉబ్బెత్తుగా లేదా లోతుగాయున్న ఉపరితలములను పొందవచ్చును. లోతైన ఉపరితలమును పొందుటకుగాను ముందుగా కర్రవస్తు కేంద్ర భాగమున ప్రారంభించి వెలుపలివైపుకు ( అనగా వ్యాపార్థ దిశలో ) ఖండిస్తూ రావాలి. చాపదిశలో పయనించునపుడు ఉలి బ్లేడు అది పయనించు దిశకు లంభములో వుండునట్లు చూడాలి. దీనివలన ఉలి బ్లేడు చివరనగల పదునైన ఖండించెడి అంచు మాత్రమే కర్రవస్తువుకు తగులుచు, అది సరిగా టర్న్ చేయబడుతుంది.
12. కర్రవస్తువుకను తిన్నగా ఖండించుటకు స్క్వేర్ నోస్ ఉలిని ఉపయోగించాలి. బ్లేడు ఖండించెడి అంచు వెడల్పు మొత్తము కర్రవస్తువుకు తగులునట్లు ఉలిని పట్టుకొని టర్నింగ్ పనిచేయాలి.
13. V — ఆకారపు ఉపరితలమును పొందుటకు డైమండ్ పాయింట్ ఉలిని ఉపయోగించాలి.
14. కర్రవస్తువు నుండి కర్ర తొలగింపబడుతూనే టూల్ రెస్ట్ ను ముందుకు జరిపి తగిన కోణములో వుండునట్లు కర్రవస్తువు నుండి తగినంత దూరములో వుండునట్లు అమర్చుతూ రావాలి.
15. టర్నింగ్ పని పూర్తి అయిన పిదప సాండ్ కాగితముతో ఉపరితలమును నునుపుపరచాలి.
16. పైన తెలిపిన పద్ధతిలో టర్నింగ్ పని ముగించిన పిదప కర్రవస్తువును యంత్రమునుండి విడదీయుటకుగాను ముందుగా ఫేస్ ప్లేట్ ను తొలగించాలి. పిదప స్ర్కూలను విడదీసి కర్ర బ్లాక్ ను ఫేస్ ప్లేట్ నుండి తొలగించాలి. పిదప కర్ర బ్లాక్ కు జిగురుతో అంటించిన కర్రవస్తువును మాలెట్ మరియు ఉలిని ఉపయోగిస్తూ జాగ్రత్తగా విడదీయాలి.
1.3.9 ఫేస్ ప్లేట్ టర్నింగ్ లో తీసుకొనవలసిన జాగ్రత్తలు :—
1. ఒకేసారి ఎక్కువ లోతుతో ఖండించరాదు.
2. పనిముట్టు ఖండించెడి అంచు పదునుగా వుండాలి.
3. టర్నింగ్ ఉలిని ఎల్లప్పుడు తగిన కోణములో వుంచి గట్టిగా పట్టుకొనాలి.
4. టూల్ రెస్ట్ ను తగినంత ఎత్తులో మరియు కర్రవస్తువు నుండి తగినంత దూరములో వుంచాలి.
5. సాండ్ పేపర్ తో నునుపు పరుచుట ముందు టూల్ రెస్ట్ ను తొలగించాలి.
6. లేత్ యంత్రము పై పనిచేయునపుడు పనిముట్లను దాని బెడ్ పై వుంచరాదు.
7. టూల్ రెస్ట్ ను అమర్చిన పిదప కర్రవస్తువును చేతితో త్రిప్పుకొని అది టూల్ రెస్ట్ కు తగులుటలేదని నిర్ధారించుకొనాలి.
8. రఫ్ టర్నింగ్ ను తక్కువ వేగముతో చేయాలి.
1.3.10 స్పిండిల్ టర్నింగ్ :—
1. ముందుగా తగిన కొలతలను కలిగిన కర్రవస్తువును ఎన్నుకొనాలి. తయారు చేయవలసిన కర్రసామగ్రి పొడవుకన్న ముందుగా ఎన్నుకొన్న కర్రవస్తువు పొడవు 40 నుండి 50 మి.మిా. ఎక్కువగా వుండాలి. దాని వ్యాసము కర్రసామగ్రి వ్యాసముకన్న 6 నుండి 8 మి.మిా. ఎక్కువగా వుండాలి.
2. కర్రవస్తువు రెండు చివర భాగములను చదునుపరచి వాటి కేంద్ర బిందువులను నిర్ణయించాలి. ఇందుకుగాను ఒకదానితో ఒకటి
ఖండించెడి కర్ణ రేఖలను గీయవలసి వుంటుంది. ఈ రెండు రేఖలు ఖండించెడి బిందువు మధ్యబిందువుగా గుర్తించబడుతుంది. వివిధ ఆకారపు అవచ్ఛేదములుగల కర్రవస్తువులకు వాటి మధ్యబిందువును గుర్తించు విధానములు పటము 1.25 లో ( a నుండి f వరకు ) చూపబడ్డాయి.
3. పైన తెలిపిన విధముగా మధ్యబిందువులను గుర్తించిన పిదప ఒక చివరభాగముపై ' బ్యాంక్ ఱంపము ' వుపయోగిస్తూ కర్ణముల వెంబడి సుమారు 3 లేదా 4 మి.మిా.లోతుగా కోయాలి. ఈ చివర భాగమున లైవ్ సెంటర్ అమర్చబడియుంటుంది. రెండవ చివర గుర్తించబడిన కేంద్రబిందువు వద్ద సెంటర్ పంచ్ తో లోతుగా రంధ్రమును చేయాలి. గట్టి కర్రయందు సుమారు 3 మి.మిా. వ్యాసముతో అంతే లోతుగల రంధ్రములను చేయవలసివుంటుంది. ఈ రంధ్రములో డెడ్ సెంటర్ అమర్చబడుతుంది.
4. లేత్ యంత్రము నుండి లైవ్ సెంటర్ ను విడదీసి , దానిని మాలెట్ తో కొట్టి కర్రవస్తువు ఒక చివరభాగములోనికి దింపాలి. పిదప లైవ్ సెంటర్ మరల మరల హెడ్ స్టాక్ స్పిండిల్ యందు అమర్చి బిగించాలి.
5. టెయిల్ స్టాక్ కుగల చక్రమును త్రిప్పుకొని దాని స్పిండిల్ ను హౌజింగ్ నుండి సుమారు 20 లేదా 30 మి.మిా. వెలుపలికి వుండునట్లుగా అమర్చాలి. పిదప టెయిల్ స్టాక్ ను బెడ్ పై ముందునకు జరిపి దాని డెడ్ సెంటర్ కర్రవస్తువు రెండవ చివర చేయబడిన రంధ్రములోనికి ప్రవేశించునట్లుగా చూడాలి. టెయిల్ స్టాక్ బెడ్ పై బిగించి దాని చక్రమును త్రిప్పి డెడ్ సెంటర్ ను కర్రవస్తువు
రంధ్రములోనికి పూర్తిగా దిగునట్లు చూడాలి.
6. టూల్ రెస్ట్ ను జరుపుకొని అది కర్రవస్తు మధ్యభాగమునకు ( అనగా అక్షమునకు ) సుమారు 3 మి.మిా. పైకి వుండునట్లు అమర్చాలి. ఈ స్థలములో టూల్ రెస్ట్ ను బిగించాలి. కర్రవస్తువును చేతితో త్రిప్పుకుంటూ, టూల్ రెస్ట్ దాని ఉపరిభాగము నుండి సుమారు 3 మి.మిా. దూరములో వుండునట్లు చూడాలి. టూల్ రెస్ట్ కర్రవస్తు ఉపరితలమునకు దాదాపుగా సమాంతరముగా వుందా లేదా పరిశీలించాలి. పిదప టూల్ రెస్ట్ హోల్డర్ ను బిగించాలి. కర్రవస్తు సైజు ( అనగా వ్యాసము ) తగ్గునపుడు టూల్ రెస్ట్ దాని ఉపరితలము నుండి ఎప్పుడుకూడ సుమారు 10 మి.మిా. కంటే తక్కువ వుండరాదు.
7. 50 మి.మిా. కంటే ఎక్కువ కొలతగల చదరపు అవచ్ఛేదముగల కర్రవస్తువులను యంత్రముపై బిగించుటకు ముందు వాటి మూలలను ప్లేన్ ( లేదా స్పోక్ షేవ్ ) నుపయోగించి వంపుగామార్చాలి.
8. రెండు కాళ్లను దూరంగా వుంచి , కుడికాలు కొద్దిగా ఎడమ కాలి వెనుకవుండునట్లుగా నిలబడాలి. బరువు రెండు కాళ్ల పై సమంగా పడునట్లు చూడాలి.
9. టర్నింగ్ పనికి పొడవైన గౌజును ఎన్నుకొనాలి. దాని హాండిల్ కుడిచేతితో గట్టిగా పట్టుకొనాలి. ఎడమచేతి వ్రేళ్లతో దాని బ్లేడును పట్టుకొని టూల్ రెస్ట్ పైన ఆనించి దాని ఆధారంగా కదిలిస్తూ టర్నింగ్ చేసుకొనాలి.
10. లేత్ యంత్రమును తక్కువ వేగముతో ( 600 R.M.P ) స్టార్ట్ చేయాలి.
11. టర్నింగ్ పనిలో స్ర్కేపింగ్ చేయుటకుగాను గౌజుబ్లేడును అడ్డముగా పట్టుకొనాలి. ఇది రఫ్ టర్నింగ్ పనికి ఉపయోగిస్తుంది.
12. కటింగ్ చేస్తూ టర్నింగ్ చేయునపుడు గౌజుబ్లేడును కొద్దిగా ప్రక్కలకు వంచాలి. కుడిచేతిని కొద్దిగా ( సుమారు 10॰) క్రిందకు దించి హాండిల్ ను పట్టుకోవాలి. ( పటము 1.28 )
13. ఈ విధముగా టర్నింగ్ చేస్తూ కర్ర ఉపరితలము స్థూపాకారముగా వుండునట్లుగా చెయాలి.
14. చివరగా నునుపైన టర్నింగ్ పనికి స్క్యూ ఉలిని ఉపయోగించాలి. ఎక్కువ వేగముతో కర్రవస్తువు తిరిగితే ఎక్కువ నునుపైన ఉపరితలము యేర్పడుతుంది. కాబట్టి వేగము 1600 నుండి 1800 R.M.P వరకు పెంచాలి. స్క్యూ ఉలిని ఉపయోగిస్తూ స్ర్కేపింగ్ లేదా కటింగ్ పనిచేయవచ్చును. స్ర్కేపింగ్ పని ఎక్కువ నునుపుదనమును యివ్వజాలదు. ( పటము 1.29 )
స్క్యూ ఉలితో కటింగ్ పనిచేయటవలన నునుపైన ఉపరితలమును పొందవచ్చును.
1.3.11 v— ఆకారపు చీలికలు ఏర్పరచుట :—
కర్రవస్తువు గుండ్రమును ఉపరితలముపై v ఆకారము చీలికలను యేర్పరుచుటకుగాను డైైమండ్ పాయింట్ ఉలిని లేదా స్క్యూ ఉలిని వాడవచ్చును.
1. ముందుగా పెన్సిల్ ను, స్టీలురూలును వుపయోగించి తగిన కొలత v — ఆకారము వెడల్పు, మధ్యరేఖ కర్రపై గుర్తించాలి.
2. స్క్యూ ఉలి పదునైన అంచుగల బ్లేడు చివరభాగమునుటరెస్ట్ పై ఆనించి దాని తిన్నని ఖండించెడి అంచు నిలువుగా వుండునట్లు ఎడమ చేతితో బ్లేడును పట్టుకొన్నాలి.ముందుగా గుర్తింపబడిన మధ్యరేఖ కర్రను ఖండించాలి.
3. స్క్యూ ఉలిని టూల్ రెస్ట్ పైన కొద్దిగా ప్రక్కలకు ( అనగా ఏటవాలుగా వుండునట్లు ) జరపాలి. బ్లేడు ఖండించెడి అంచు v — ఆకారపు మధ్యరేఖ నుండి సుమారు 3మి.మిా.ప్రక్కలకు జరగాలి. ఈ విధముగా జరుపుటవలన నిలువుగా యున్న బ్లేడు పదునైన అంచు మధ్యరేఖకు కొద్దికోణములో ఏటవాలుగా వుంటుంది. ఉలిని యీ విధంగా పట్టుకొని కర్రవస్తువులోనికి ఏటవాలుగా దించుతూ టర్నింగ్ చేయాలి. పిదప ఉలిని రెండువైపు త్రిపి ఏటవాలుగా పట్టుకొని వ్యతిరేక దశలో మరల టర్నింగ్ చేయాలి. దీనివలన v — ఆకారపు చీలిక ఏర్పడుతుంది.
1.3.12వంపులను టర్నింగ్ చేయుట :—
లోతుగాయున్న వంపులను చేయుటకుగాను క్రింద తెలిపిన పద్ధతిని అవలంభించాలి:
1.ముందుగా పెన్సిల్, స్టీల్ రూలుహను ఉపయోగిస్తూ చేయవలసిన వంపు మధ్యరేఖను, వెడల్పును సూచిస్తూ గుర్తులు పెట్టుకొనాలి.
2. వంపువద్ద కావలసిన వ్యాసము కన్న సుమారు 1 మి.మిా. ఎక్కువ వుండునట్లు అవుట్ సైడ్ కాలిపర్స్ ను అమర్చుకొనాలి.
3. పార్టింగ్ ఉలిని ఉపయోగిస్తూ మధ్య రేఖ వద్ద పై కొలత వచ్చునట్లు టర్నింగ్ చేసుకొనాలి.
4. రౌండ్ నోస్ ఉలిని, దాని పదునైన అంచు అడ్డముగా వుండునట్లు పట్టుకొనాలి. పదునైన అంచువద్దగల ఏటవాలుభాగము క్రిందవైపు అమర్చివుండాలి. టూల్ రెస్ట పై ఆనించి దీనిని కుడిచేతితో వంపుగా త్రిప్పుకుంటూ తగిన ఆకారము, సైజుగల వంపుదిరిగి చీలికలను చేయవచ్చును.
1.3.13 స్పిండిల్ టర్నింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. స్పిండిల్ టర్నింగ్ కు ఎన్నిక చెసిన కర్రవస్తువు యేవిధమైన లోపములను కలిగియుండరాదు.
2.లైవ్ సెంటర్ ను హెడ్ స్టాక్ నుండి విడదీయునపుడు క్రింద పడకుండా చూడాలి.
3. టెయిల్ స్టాక్ ను సరిగా లాక్ చేయాలి.
4. యంత్రముపై టర్నింగ్ చేయుటకు ముందుచేతితో కర్రవస్తువును త్రిప్పుకొని టూల్ రెస్ట్ కు తగలకుండా తగినంత దూరములో వుండునట్లు చూడాలి.
5. టూల్ రెస్ట్ ను కర్రవస్తువు నుండి తగినంత ఎత్తులో వుండునట్లు చూడాలి.
6. రఫ్ టర్నింగ్ తక్కువ వేగముతో చేయాలి. ఎక్కువలోతుగా ఖండించుట చేయరాదు.
7. కర్రవస్తువు ఉపరితలము నునుపుగా లేనపుడు అది గుండ్రముగా తిరూగునపుడు దానిపై చేతులు పెట్టరాదు.
8. అప్పుడప్పుడు డెడ్ సెంటర్ పై కందెన వేయాలి. లేనిచో అది వేడెక్కు అవకాశము కలదు.
9. పనిముట్టు ఎప్పుడు పదునుగా ఉండాలి.
10.యంత్రము పనిచేయునపుడు పనిముట్లు బెడ్ పై పెట్టరాదు.
1.4 బ్యాండ్ ఱంపము :
ఈ యంత్రము సన్నని పొడవైన వంచుటకు తగినటువంటి ఱంపమును కలిగియుంటుంది. ఈ ఱంపము బ్లేడురెండు చక్రములపై గుండ్రముగా బెల్టువలె అమర్చబడియుంటుంది. ఈ రెండు చక్రములు ఒకదానిపై మరియొకటి అమర్చబడియుంటవి. ఈ చక్రములు గుండ్రముగా తిరుగుట వలన ఱంపము బెల్టువలె ముందుకు కదులుతూ యీ ఈ చక్రములుతోపాటు గుండ్రముగా అతిరుగుతుంది. ఈ రెండు చక్రములు మధ్యగా యంత్రము యొక్క టేబుల్ అమర్చబడియుంటుంది. టేబుల్ పైన కర్రవస్తువును పెట్టుకొని కదిలెడి ఱంపముచే కర్రవస్తువును కోయవచ్చును. బెల్టు ఆకారపు ఱంపము బ్లేడు ఎక్కువ వేగముతో ( ఒక నిముషమునకు 900 నుండి 1500 మీటర్ల వేగముతో ) తిరుగుచు కర్రవస్తువును కోస్తుంది. బ్యాండ్ ఱంపముచే కర్రను తిన్నగా లేదా వంపులతో కోయవచ్చును. మీటర్ జాయింట్ , బ్రిడిల్ జాయింట్ , డవ్ టెయ్ ల్ జాయింట్ , మొదలగునవి తయారు చేయుటలో యీ ఱంపము ఉపయోగిస్తుంది. కుర్చీలు, బీరువాలు, బ్రష్ లు మున్నగునవి తయారు చేయుటలో యీ ఱంపము వుపకరిస్తుంది.
1.4.1 బ్యాండ్ ఱంపము వివిధ భాగములు :
బ్యాండ్ ఱంపము క్రింద వివరించిన వివిధ భాగములను కలిగియుంటుంది.
1. ఫ్రేము :—
ఇది పోతయినుముతో ఒకే భాగంగా తయారుచేయబడియుంటుంది. దీనిపై యంత్రపు వివిధ భాగములు బిగింపబడియుంటవి. ఇది తగినంత దారుధ్యతను కలిగియుండి నేలపై స్టాండ్ పై గట్టిగా బిగింపబడియుంటుంది.
2. టేబుల్ :—
ఇది కూడా పోతయినుముతో చేయబడియుంటుంది. ఫ్రేముపై అమర్చబడియుంటుంది. నేలనుండి సుమారు 1 మీటరు ఎత్తులో ( అనగా మోచేతి ఎత్తులో ) యిది యంత్రము పై అమర్చబడి యుండుటవలన నిలబడియున్న వ్యక్తి టేబుల్ పై కర్రవస్తువును పెట్టుకొని చేతులతో కావలసిన దిశలో కదిలిస్తూ కర్రవస్తువును కోయవచ్చును.
టేబుల్ ను కుడివైపు 45॰ కోణమువరకు మరియు ఎడమవైపు 5॰ నుండి 10॰ వరకు నుంచి ఏటవాలుగా బిగించుకొనవచ్చును. టేబుల్ ఎంత కోణములో వంచబడి తెలుసుకొనవచ్చును.
3. చక్రములు :—
ఇవి ఫ్రేములోపల అమర్చబడి బయటకు కనిపించకుండా యుంటాయి. ఇవి బాల్ బేరింగుల పైన అమర్చబడి యుండుటచేత సులభముగా వాటి అక్షముపై గుండ్రముగా తిరుగగలుగుతాయి. ప్రతి చక్రము పరిదిపైన ( అనగా చక్రము చుట్టు ) ఒక రబ్బరు టైరు బిగింపబడియుంటుంది. రబ్బరు టైరు పైన బెల్టు ఆకారపు ఱంపము బ్లేడు కదులుట వలన ఱంపము పండ్లు నష్టపడకుండా వుంటాయి. అంతేకాకుండా ఱంపము బ్లేడు చక్రములపై తిరిగినపుడు జారిపోకుండా రబ్బరు టైరు వుపయోగిస్తుంది. అనగా చక్రము తిరుగునపుడు అదే వేగముతో బ్లేడు త్రిప్పుతుంది.
ఈ రెండు చక్రములు ఒకదినిపై మరియొకటి అమర్చబడివుంటవి. క్రింది చక్రము విద్యుత్ మోటారు ద్వారా త్రిపబడుతుంది. ఈ చక్రము ఒకే చోట స్ధిరంగా అమర్చబడి అక్కడే గుండ్రముగా తిరుగుతుంది.
పైన అమర్చబడిన చక్రమును పైకి, క్రిందకూ లేదా ముందుకూ, వెనుకకూ కదిలించుకొనెడి సదుపాయమువుంటుంది. దీనీవలన పాతబ్లేడును విడదీసి క్రొత్తబ్లేడును అమర్చుకొనుటకు వీలుంటుంది. పై చక్రము ఒక స్ర్పింగు పైన అమర్చబడియడుటచేత కర్రవస్తువును కోయునపుడు కలిగే ఒడిదుడుకులను ఱంపము బ్లేడు తట్టుకొనకలుగుతుంది.
4. త్రోట్ ప్లేట్ ( Throat plate ) :—
బ్లేడు టేబుల్ పై చేయబడిన రంధ్రముగుండా పైనుండి క్రిందకు దూర్చినచోట త్రోట్ ప్లేట్ అమర్చబడియుంటుంది. ఇది మెత్తని అల్యూమినియం లోహముతో చేయబడి ఱంపము బ్లేడు విరిగినపుడు లేదా అది తప్పు మార్గంలో పయనించినపుడు దాని పండ్లు నష్టపడకుండా కాపాడుతుంది.
5. ఱంపము బ్లేడు :—
ఇది క్రోమియం కలిగిన గట్టి ఉక్కుతో చేయబడి సుమారు 3 నుండి 18 మి.మీ. వరకూ వెడల్పును కలిగియుంటుంది. వంపుగా కర్రను కోయునపుడు ఆ వంపు వ్యాసార్ధమును బట్టి బ్లేడు వెడల్పు నిర్ణయింపబడుతుంది. ఉదాహరణకు 3మి.మీ. వెడల్పు గల బ్లేడు 12 మి.మీ. వ్యాసార్ధము గల వంపులను కోయగలిగితే 18 మి.మీ. బ్లేడు 120 మి.మీ. వరకు వ్యాసార్ధము గల వంపులను కోయగలుగుతుంది. బ్లేడు యెక్క మందము యంత్రపు చక్రముల వ్యాసము మరియు బ్లేడు వెడల్పును బట్టి నిర్ణయించబడుతుంది.
6. ఱంపము గైడులు :—
ఱంపము బ్లేడు సరియైన దిశలో తిరుగుటకు గాను ' గైడులు ' ఉపయోగిస్తాయి. ఒక గైడు టేబుల్ పైన, రెండవ గైడు టేబుల్ క్రింద, అమర్చబడియుంటుంది. పైన అమర్చబడిన గైడును పైకీ, క్రిందకు కదుల్చుకొని బ్లేడు మందము ప్రకారము తగిన స్ధలములో అమర్చుకొన వీలుంటుంది. గైడులు వుండుట మూలముగా బ్లేడు అటుా యిటూ తూగుతు కదులుట లేదా మెలి దిరుగిపోవుట జరగదు. ప్రతి గైడు కు గల రెండు జా ల ( ఉక్కు దిమ్మల ) మధ్య బ్లేడు కదులుతుంటుంది. బ్యాండు ఱంపము సైజు దానికిగల చక్రముల వ్యాసముపై ఆధారపడియుంటుంది. ఉదాహరణకు 350 మి.మీ. బ్యాండు ఱంపము 350 మి.మీ. వ్యాసము గల చక్రములను కలిగియుంటుంది.
1.4.2 బ్యాండు ఱంపము పైన చేసెడి వివిధ పనులు :
బ్యాండు ఱంపము పై పని చేయుటకు ముందు దానికి తగిన సైజుగల ఱంపము బ్లేడును బిగించాలి. ఇందుకుగాను క్రింద క్రింద తెలిపిన పద్ధతిని అవలంభించాలి.
( a ) బ్లేడును అమర్చుట :
1. గైడుకు గల జా లను ( Jaws ) తెరవాలి.
2. గైడు చక్రములను వెనుకకు కదిలించాలి.
3. ఱంపము చక్రములపై అమర్చి బ్లేడు తగినంత బిగువుగా వుండునట్లు చూడాలి. చక్రములను చేతితో త్రిప్పుకొని బ్లేడు సరిగా కదులుతుందా లేదా పరిశీలించుకొనాలి.
4. గైడు జా లను కదలించి బ్లేడుకు గల జాలకు కొన్ని ఖాళీస్ధలము మాత్రము వుండునట్లు చూడాలి. జాల మధ్యభాగము ఱంపము పండ్లు వెనుక భాగమునకు సమంగా వుండునట్లు చూడాలి.
5. ఱంపము బ్లేడును మరల చేతితో త్రిప్పుకొని సరిగా తిరుగుతుందా లేదా పరిశీలించాలి.
( b ) తీసుకొనవలసిన యితర జాగ్రత్తలు :—
పనిచేయుటకు ముందుగా క్రింది విషయాలను గమనించుకొనాలి.
1. యంత్రముపై అని పరికరములు సరిగా అమర్చబడినవా లేదా పరిశీలించాలి.
2. పైన వున్న ఱంపము గైడు కర్రవస్తువుకు కొద్దిగా పైన వుండాలి.
3. ఱంపముతో కోయునపుడు, ఱంపమునకు ముందు నిలబడాలి. యంత్రము ప్రక్కభాగమున నిలబడి పనిచేయరాదు.
4. నేలమీద కోరబడిన కర్రముక్కలు లేకుండా చూడాలి. దీని వలన నేలపైన నిలబడ్డ వ్యక్తికి ఏ అడ్డంకులు లేకుండా సరిగా నిలబడి పనిపై మనస్సును కేంద్రీకరించగలడు.
5. వదులుగా వున్న దుస్తులను ధరించి యంత్రముపై పని చేయరాదు.
( c ) వివిధ పనులను చేయుట :
1. రిప్పింగ్ ( Ripping ) :—
కర్రపలక వెడల్పును తక్కువ చేయుటకు దానిని పొడవు దిశలో కోయుటను ' రిప్పింగ్ ' అంటారు. రిప్పింగ్ చేయుటకుగాను టేబుల్ పైన ' రిప్పింగ్ ఫెన్స్' ను
( Ripping fence ) అమర్చుకొనాలి. దీనికి ఆనించి, దీని ఆధారంగా కర్రవస్తువును కదిలిస్తూ కోతపని చేయవచ్చును రిప్పింగ్ పనికి పెద్ద పండ్లను కలిగియుండి వెడల్పైన బ్లేడును ఉపయోగించాలి.
2. రీ - సాయింగ్ ( R - sawing ) :—
కర్రపలక మందమును తగిస్తూ పొడవు దిశలో కోయుటను ' రీ - సాయింగ్ ' అంటారు ఇందుకుగాను కర్రపలకను దాని అంచుపై నిలబెట్టాలి.
రీ - సాయింగ్ పనికి గూడా రిప్పింగ్ ఫెన్స్ ను మరియు ఎక్కువ వెడల్పుగల బ్లేడును ఉపయోగించాలి. ముందుగా సర్కులర్ ఱంపము లేదా యితర చేతి ఱంపముల ద్వారా కర్రవస్తువు అంచుపై చేయబడిన కోతల ఆధారముగా బ్యాండ్ ఱంపము నుపయోగిస్తూ ఎక్కువ లోతుగా కర్రను కోయవచ్చును ఎక్కువ వెడల్పుగల కర్రవస్తువుల మందమును తగ్గించుటకు ఇరువైపుల అంచులందు సర్కులర్ ఱంపము తోకోసి మధ్య మిగిలిన భాగమును బ్యాండ్ ఱంపముతో కోయాలి.
3. క్రాస్ కటింగ్ :—
కర్ర వస్తువుయందు అమర్చబడియున్న కణముల దిశకు అడ్డముగా దానిని కోయుటను ' క్రాస్ కటింగ్'
( cross cutting ) అంటారు. ఈ పనికిగాను టేబుల్ పై కర్రవస్తువుకు ఆధారముగా మీటర్ గేజిని అమర్చాలి.
మీటర్ గేజ్ కి గల స్టాక్ రాడ్ ను అమర్చుకొనుటవలన ఒకే పొడవు గల అనేక కర్రవస్తువులపై క్రాస్ కటింగ్ చేసుకొనెడి వీలుంటుంది. కర్రవస్తువును ఏటవాలుగా కోయుటకు మీటర్ గేజ్ ని తగిన కోణములో అమర్చుకొనవచ్చును, ఈ విధముగా ఏటవాలుగా కోయుటకు ' మీటరింగ్ '
అంటారు.
4. వంపులను కోయుట :—
ముందుగా వంపులను పరిశీలించి, వాటిలో అతిచిన్నవంపును ( అనగా అతి తక్కువ వ్యాసర్థమును కలిగియున్న వంపు ) తగిన బ్లేడు ఎన్నుకొనాలి. ఱంపము పండ్లు సరిగా పదును పెట్టబడి యుండాలి. అయితే 25 మి.మీ. కన్న తక్కువ వ్యాసర్థమును వంపులను బ్యాండ్ ఱంపముపై కోయుట వీలుగాదు.
కోయవలసిన వంపులను
సూచించెడి చాపరేఖలను కర్రవస్తువుపై గుర్తించాలి. ఱంపముతో కోయునపుడు బ్లేడును కోయబడిన భాగమునుండి ఱంపమును తిరిగి వెనుకకు తీయుట చేయరాదు. కర్రవస్తువు అంచుల నుండి గుర్తింపబడిన వంపురేఖలకు తిన్నని కోతలను కోయుటవలన వంపురేఖను కోయునపుడు కర్రముక్క చిన్నచిన్న ముక్కలుగావిడిపోతుంది.
ఱంపముతో కోయునపుడు కర్రను నెమ్మదిగా ఱంపము వైపు కదిలించాలి. కావలసిన వంపురేఖ ఱంపమునకు తిన్నగా వుండునట్లు కర్రవస్తువును చేతితో కదిలిస్తూ బ్లేడువైపునకు జరపాలి. గుర్తింపబడిన వంపురేఖకు అతి దగ్గరగా బ్లేడు తాకుతూ కర్రనుకోయాలి. ఎడమచేతిని కర్రపలకకు ఆధారముగా పట్టుకొని కుడిచేతితో దానిని నెట్టుచూ వంపు మార్గములో కోయాలి.
5. వృత్తములను కోయుట :—
వంపుకొలతలను కోయుటకు అవలంభించిన పద్దతిలోనే కర్రవస్తువును గుండ్రముగా వృత్తాకారములో కోయవచ్చును.